నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'అఖండ 2: తాండవం' . గతేడాది డిసెంబర్ 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. సనాతన ధర్మం, హిందుత్వం, దేశభక్తి నేపథ్యంలో సాగిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాలయ్య అభిమానులను మరోసారి ఉర్రూతలూగించింది. బాక్సాఫీస్ వద్ద శివతాండవం చేసిన బాలయ్య 'అఖండ 2' ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. లేటెస్ట్ గా ఈ మూవీ తన ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి కానుకగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్!
లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు 'అఖండ 2' డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9, 2026 నుండి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో కూడా ఈ అఘోరా గర్జన వినిపించనుంది. థియేటర్లలో మిస్ అయిన వారికి , మళ్లీ మళ్లీ చూడాలనుకునే ఫ్యాన్స్‌కు ఇది అసలైన పండుగ అని చెప్పాలి.
హైలైట్స్ ..
ఈ సీక్వెల్‌లో ప్రధాన ఆకర్షణ ఆది పినిశెట్టి. బోయపాటి గత చిత్రం 'సరైనోడు'లో అలరించిన ఆది, ఇందులో అఖండను ఎదుర్కొనే పవర్‌ఫుల్ విలన్‌గా మెప్పించారు. సినిమా కథలో బయోలాజికల్ వార్ వంటి ఆధునిక అంశాలను జోడించారు. 'బజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలీ ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె ఒక కీలకమైన సైంటిస్ట్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. బాలయ్య సరసన సంయుక్త నటించింది. మొదటి భాగంలాగే తమన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను హోరెత్తించారు. ముఖ్యంగా అఖండ ఎంట్రీ సీన్లు, హిమాలయాల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలకు ఆయన సంగీతం ప్రాణం పోసింది.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2 మూవీ.. సుమారు 122.21 కోట్ల మేర వసూలు చేసింది. ఈ కరోనా మహమ్మారి తర్వాత బాలయ్య ఓవర్సీస్ మార్కెట్ లో అఖండ2 అత్యల్ప వసూళ్లు చేసిన సీక్వెల్ గా నిలిచింది. ఇండియన్ బాక్సఫీస్ వద్ద 93.15 కోట్ల మేర వసూళ్లు సాధించింది. ఈ మూవీని దాదాపు రూ. 150 నుంచి 200 కోట్ల వరకు బడ్జెట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది.
'జై అఖండ' సర్ప్రైజ్!
సినిమా క్లైమాక్స్‌లో 'అఖండ 3'కి సంబంధించిన హింట్ ఇస్తూ, దానికి 'జై అఖండ' అనే టైటిల్‌ను కూడా ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. అంతకంటే ముందే బాలయ్య రీసెంట్ మూవీ 'డాకు మహారాజ్' కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి జనవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న ఈ 'తాండవం' ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి..
