కృష్ణా జలాలపై చర్చ..అసెంబ్లీలో కునుకు తీసిన బీజేపీ ఎమ్మెల్యేలు

కృష్ణా జలాలపై చర్చ..అసెంబ్లీలో కునుకు తీసిన  బీజేపీ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కృష్ణానది జలాలు, పాలమూరు ప్రాజెక్టుపై  ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓవైపు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తుండగా..బీజేపీ ఎమ్మెల్యేలు హాయిగా గాఢ నిద్రలోకి  జారుకున్నారు. ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, రామారావుపాటిల్ కునుకు తీయడం చర్చనీయాంశంగా మారింది. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి కేటాయింపులపై బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని, శ్రీశైలం నుంచి ఏపీ ఏవిధంగా నీళ్లను అక్రమంగా తరలించిందో..ఆధారాలు, జీవోలతో సహా ఉత్తమ్ అసెంబ్లీలో వివరించారు.  పదేళ్లలో కేసీఆర్  తెలంగాణకు  చేసిన ద్రోహంపై సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు  హాయిగా కునుకు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఏపీ అక్రమంగా 1200 టీఎంసీలు తరలింపు

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పదేళ్లలో ఏపీ అక్రమంగా 1200టీఎంసీలు తరలించుకుపోయిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాలపై అసెంబ్లీలో  పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా.. రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కు ఆనాడు జగన్ కు సహకరించింది కేసీఆరేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ఆపించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుదన్నారు ఉత్తమ్. 

కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకాలు చేసి తెలంగాణకు మరణ శాసనం రాశారని ఫైర్ అయ్యారు ఉత్తమ్. కృష్ణానదిలో  బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పదేళ్లలో ఏపీ రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం రోజుకు 3టీఎంసీలు వాడుకుంటుంటే బీఆర్ ఎస్ ప్రభుత్వం సైలెంట్ గా ఉందని తెలిపారు ఉత్తమ్. కృష్ణా నీటి వాటాలో తెలంగాణకు కేటాయించిన వాటాను బీఆర్ఎస్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని చెప్పారు. కృష్ణా జలాల వినియోగంలో రైతులు ఎక్కువగా వినియోగించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనేనని తెలిపారు.