ప్రాజెక్టుల అంచనాలు తారుమారు.. జీహెచ్ఎంసీపై అదనపు భారం

ప్రాజెక్టుల అంచనాలు తారుమారు.. జీహెచ్ఎంసీపై అదనపు భారం
  • ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి 20 నుంచి 30 శాతం పెరుగుదల
  • బల్దియా పరిధిలో చేపడుతున్న ప్రతి పనిలోనూ ఇదే పరిస్థితి
  • వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి అదనంగా రూ.100 కోట్లు ఖర్చు
  • బిల్లులు రిలీజ్​చేసేందుకు నిరాకరించిన స్టాండింగ్​కమిటీ

హైదరాబాద్, వెలుగు:గ్రేటర్​పరిధిలో జీహెచ్ఎంసీ చేపడుతున్న ప్రాజెక్టుల అంచనాలు తారుమారవుతున్నాయి. పనుల ప్రారంభానికి ముందున్న అంచానలు.. పూర్తయ్యేనాటికి ఉండడం లేదు. ప్రతి పనిలో 20 నుంచి 30 శాతం పెరుగుదల కనిపిస్తోంది. 8 నెలల కింద పూర్తయిన ఇందిరాపార్క్​స్టీల్ బ్రిడ్జి  ప్రాజెక్టుకు అదనంగా రూ.100 కోట్లు ఖర్చు అయిందని, చెల్లింపులకు అనుమతులు ఇవ్వాలని తాజాగా స్టాండింగ్​కమిటీని కోరడం బల్దియాలో హాట్​టాపిక్​అయింది. అసలు అంచనాలు ఎందుకు మారుతున్నాయనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో పూర్తిచేసిన, మొదలుపెట్టిన ప్రతి ప్రాజెక్టులో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 13న జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఇందిరాపార్క్​స్టీల్​బ్రిడ్జి ఖర్చు చెల్లింపుల అనుమతుల కోసం ఫైల్ పెట్టారు. రూ.100కోట్ల ఖర్చు పెరగడమేంటని ప్రశ్నిస్తూ.. అనుమతి ఇచ్చేందుకు సభ్యులు నిరాకరించారు. అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫైల్​ను తాత్కలికంగా పక్కన పెట్టారు. అయితే పనుల ఆలస్యం అంచనాలు పెరగడానికి ఓ కారణంగా తెలుస్తోంది.

ఫస్ట్ ఫేజ్ కింద 42 పనులు

సిటీలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు గత ప్రభుత్వం ఎస్ఆర్డీపీని రూపొందించింది. ఇందులోని ఫస్ట్ ఫేజ్​లో భాగంగా రూ.5,937 కోట్లతో మొత్తం 42 పనులు చేపట్టగా 6 పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గత ప్రభుత్వం నిత్యం బల్దియాకు చెబుతూ వచ్చింది. అయితే ఫ్లైఓవర్ల నిర్మాణం కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. అది కాస్తా ఖర్చు పెరుగుదలకు కారణమై, బల్దియాపై భారంగా మారుతోంది. ఇలా మొత్తం ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.5,937 కోట్లు కాగా, చివరికి రూ.7,500 కోట్లకు పెరిగింది. బల్దియాపై అదనంగా రూ.1,500కోట్ల భార పడుతోంది. 

ప్రాజెక్టులపై సీఎంకి సీపీఎం లేఖ

సిటీలోని ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా ఖర్చు పెరుగుతోందని, జీహెచ్ఎంసీపై అదనపు భారం పడుతోందని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ఇటీవల సీఎం రేవంత్​రెడ్డికి లెటర్​రాశారు. బల్దియా చేపట్టిన ప్రాజెక్టు పనుల అంచనా కంటే, 20 నుంచి 30 శాతం ఖర్చు పెరుగుతోందని అందులో పేర్కొన్నారు. చాలా ప్రాజెక్టులపై అనుమానాలు ఉన్నాయని, ఒక్క బల్దియాలోనే కాదు, మిగిలిన ప్రాజెక్టుల్లోనూ ఇలాగే జరుగుతోందని తెలిపారు. ఇందిరాపార్కు స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఖర్చుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరారు.

లెక్కలు చెప్పాలని మేయర్​ఆదేశం

ఇందిరా పార్క్​నుంచి వీఎస్టీ వరకు జీహెచ్ఎంసీ స్టీల్ బ్రిడ్జి నిర్మించింది. 2020 జులైలో ఈ ప్రాజెక్టు పనులను రూ.350 కోట్ల అంచనాతో ప్రారంభించారు. 24 నెలల్లో పూర్తిచేయాల్సి ఉండగా, అధికారులు 37 నెలల సమయం తీసుకుని 2023 ఆగష్టులో బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. అంటే 13 నెలలు ఆలస్యంగా ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది.

అయితే ప్రాజెక్టు నిర్మాణానికి మొదటగా అంచనా వేసిన దానికంటే రూ.100 కోట్లు అదనంగా ఖర్చు అయ్యాయని, వాటిని చెల్లించేందుకు అనుమతులు ఇవ్వాలని అధికారులు స్టాండింగ్ కమిటీ ముందు అభ్యర్థన  ఉంచారు. ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఖర్చు ఎలా పెరుగుతుందని స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తి లెక్కలు తేవాలంటూ  మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. మొదట్లో రూ.350 కోట్లు అనుకున్నప్పటికీ ఆ తరువాత రూ.426 కోట్లకి పెరిగింది. ఇప్పుడు ఏకంగా రూ.565 కోట్లు ఖర్చు అయిందని అధికారులు చెబుతున్నారు.