- డాక్టర్ సెల్ కన్వీనర్ కొప్పుల రాజశేఖర్
పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ గ్రామంలో బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని తెలంగాణ బీజేపీ డాక్టర్ సెల్ కన్వీనర్ కొప్పుల రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14న స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి గ్రామ సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన బీజేపీ కార్యకర్తలు రాజు, మనోహర్‌పై గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపించారు.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరుగుగా వారిపైనే కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీని కలిశామని, తక్షణమే అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు మల్లేశ్, ముకుంద నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
