నిజాంసాగర్​ గేట్లు ఎత్తాలంటూ రైతుల ధర్నా

నిజాంసాగర్​ గేట్లు ఎత్తాలంటూ రైతుల ధర్నా
  • బ్యాక్ వాటర్​లో మునిగిన 1,527 ఎకరాలు

లింగంపేట/కామారెడ్డి, వెలుగు: నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని కిందకు వదలాలని డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని బోధన్ – హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై రైతులు మూడు గంటల పాటు ధర్నా, రాస్తారోకో చేశారు. ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. బ్యాక్​వాటర్​లో నాగిరెడ్డిపేట మండలంలోని చీనూర్, ఆత్మకూర్, నాగిరెడ్డిపేట, గోపాల్​పేట, గోలిలింగాల, మాల్తుమ్మెద, వెంకంపల్లి, తాండూర్, మాటూర్, లింగంపల్లి కలాన్ తదితర గ్రామాల్లో 1,527 ఎకరాల్లో కోత దశకు వచ్చిన వరి పొలాలు నీట మునిగాయి. దాంతో వందలాది మంది రైతులు ఆందోళనకు దిగారు. నిజాంసాగర్​ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని బయటకు వదిలితే మునిగిన పంటల తేలుతాయని, చేతికొచ్చిన వరిపంట దక్కే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ప్రాజెక్టు15  గేట్లను ఒక్క రోజు ఎత్తి, తిరిగి  మూసివేశారని.. ఎగువ నుంచి వరద ఉధృతి ఎక్కువ కావడంతో పంటలు  నీట మునిగాయని  రైతులు చెప్పారు. రైతుల ప్రభుత్వం అని చెప్పుకొంటున్న సీఎం, స్థానిక  ఎమ్మెల్యే సురేందర్​ రైతులకు చేసిందేమిటని ప్రశ్నించారు. రోడ్డుపై ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేశారు.  రైతులకు  పీసీసీ డెలిగేట్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జి వడ్డెపల్లి సుభాష్​రెడ్డి  మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఆందోళనలో రైతు నాయకులు బొల్లు నర్సింహారెడ్డి, స్థానిక ఎంపీపీ రాజ్​దాస్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు జయరాజ్, మాటూర్,తాండూర్, చీనూర్, లింగంపల్లి, నాగిరెడ్డిపేట, వాడి తదితర గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు