నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి గండం..రిజర్వాయర్​లో అడుగంటిన జలాలు

నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి గండం..రిజర్వాయర్​లో అడుగంటిన జలాలు
  •   నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6.62 లక్షల ఎకరాల్లో ఆగిన సాగు 
  •   దుక్కులు దున్ని, నార్లు పోసుకుని ఎదురుచూస్తున్న రైతులు 
  •   కనీసం 80 టీఎంసీలు వస్తే తప్ప నీళ్లను విడుదల చేయలేని పరిస్థితి 
  • తొమ్మిదేండ్ల తర్వాత  సాగర్ ఆయకట్టుకు నీటి గండం
  • రిజర్వాయర్​లో అడుగంటిన జలాలు


నల్గొండ, వెలుగు: నీళ్లు లేక నాగార్జునసాగర్​ఎడమ ఆయకట్టు రైతులు  ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం నుంచి ఇన్​ఫ్లో లేకపోవడంతో రిజర్వా యర్​ వెలవెలబోతున్నది. ఆగస్టు రెండో వారంలోకి ప్రవేశించినా లెఫ్ట్​ కెనాల్​కు నీరు విడుదల చేయకపోవడంతో ఈసారి భూములన్నీ పడావు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది నైరుతి రుతు పవనాల ప్రభావంతో జూన్​, జూలై నెలల్లో కృష్ణా బేసిన్​లో  భారీ వర్షాలు కురిశాయి. దీంతో జూలై 28న సాగర్​ ఎడమకాలువకు నీటి విడుదల చేశారు. కానీ, ఈసారి ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈసారి ప్రభుత్వం ముందస్తు సాగును ప్రోత్సహించడంతో ఆయకట్టు కింద వరి నార్లు పోసుకున్నారు. కానీ, నల్గొండ జిల్లాలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి ఆ నార్లను కూడా అతికష్టం మీద కాపాడుతూ వస్తున్నారు. ఎలాగూ సాగర్​ నీళ్లు వస్తాయనే ఆశతో ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా ఆలోచించలేదు. దీంతో సాగర్ ​ఎడమ ఆయకట్టు రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది.

 పది లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకం..

తెలంగాణ, ఏపీలో కలిపి సాగర్​ ఎడమకాలువ ఆయకట్టు సాగు విస్తీర్ణం 1 0.37 లక్షల ఎకరాలు. దీంట్లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో 6.62 లక్షల ఎకరాల పారకం ఉంది. కృష్ణా, పశ్చిమ  గోదావరి జిల్లాల్లో కలిపి మరో 3.75 లక్షల ఎకరాలు సాగవుతోంది. నీటి విడుదల లేకపోవడంతో  రెండు ఉమ్మడి జిల్లాల్లో కనీసం 15 శాతం కూడా వరి నాట్లు వేయలేదు. నాగార్జునసాగర్​, మిర్యాలగూడ, కోదాడ ప్రాంతాల్లో సాగర్​ నీళ్లపై ఆశతో దున్నిన దుక్కులన్నీ పడావుపడ్డాయి. నీళ్లు లేకపోవడంతో చాలాచోట్ల వరినార్లు ఎండిపోయాయి. ఈ టైంలో ఏ పంటలు సాగు చేయాలో అర్థం కాని రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 2013--–14 నుంచి 2020-–-21 వరకు 9 ఏండ్లలో రెండు సందర్భాల్లో తప్పా అత్యధికంగా ఆగస్టు మొదటి వారంలోనే ఆయకట్టుకు నీటి విడుదల చేశారు. వర్షాలు ఆలస్యం కావడంతో  2015--–16లో అక్టోబర్​ రెండో వారంలో, మళ్లీ 2017–--18 అక్టోబర్​ 31న నీటి విడదల చేశారు.  తాజా పరిస్థితి ఆ రెండేండ్ల కంటే ఘోరంగా ఉందని రైతులు చెప్తున్నారు.

వానకాలం పంటకు నీళ్లు లేనట్లే..

నాగార్జునసాగర్ ​రిజర్వాయర్​లో ప్రస్తుత నిల్వలను పరిశీలిస్తే వానాకాలం పంటకు నీళ్లు ఇచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. ఎడమ కాలువ కింద  వానకాలం పంటకు 132 టీఎంసీల నీళ్లు అవసరం. దీంట్లో మొదటి జోన్​పరిధిలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి అవసరాలకే 60 టీఎంసీలు కావాలి. ప్రస్తుతం రిజర్వాయర్​లో140 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. దీనిలో డెడ్​స్టోరేజీ కింద 132 టీఎంసీలు తీసేస్తే మిగిలేది 8 టీఎంసీలు మాత్రమే. అదనంగా ఇంకో 80 టీఎంసీల నీళ్లు రిజర్వాయర్​లోకి చేరితే తప్పా ఎడమకాల్వకు నీటి విడుదల చేయలేమని ఆఫీసర్లు చెప్తున్నారు. జూరాల నుంచి శ్రీశైలం రిజర్వాయర్​లోకి  రెండు రోజుల క్రితం 54,668 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా, గడిచిన 24 గంటల్లో ఇది 46,558 క్యూసెక్కులకు తగ్గిపోయింది. శ్రీశైలం నుంచి సాగర్​ రిజర్వాయర్​లోకి ఎలాంటి ఇన్​ఫ్లో  లేకపోగా, సాగర్​ నుంచే రోజూ 450 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్ ​జంట నగరాల తాగునీటి అవసరాలకు రిలీజ్​ చేస్తున్నారు. దీంతో సాగర్ ఆయకట్టు భవిష్యత్తు ఆగస్టు, సెప్టెంబర్​లో వచ్చే తుపాన్లపైనే  ఆధారపడి ఉందని ఎక్స్​పర్ట్స్​ చెప్తున్నారు. గతంలో స్లైక్లోన్​ ప్రభావంతో లేటైనా అక్టోబర్​లో నీటి విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు సాగర్​ నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్​ 
చేస్తున్నారు.  

వరి నారు పోసి రూ.20 వేలు నష్టపోయిన

నాగార్జునసాగర్​ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తారన్న నమ్మకంతో ముందస్తుగా వరి నారు పోసిన. రెండెకరాలు దుక్కి దున్నడానికి, దమ్ము చేయడానికి పెట్టుబడులతో కలిపి ఇప్పటికే రూ.20వేల వరకు ఖర్చు పెట్టిన. కానీ, సాగర్​రిజర్వాయర్​లో నీళ్లు లేకపోవడంతో ఎడమకాల్వ కు నీటి విడుదల చేయడం లేదు. పోసిన వరి నారు ఎండిపో గా, పొలం కాస్తా పడావు పడింది. 
 - కంచర్ల వెంకటేశ్వర్లు, ఎడమ కాలువ రైతు, అల్వాల గ్రామం, హాలియా మండలం 

నీళ్ల కోసం ఎదురుచూస్తున్న 

సాగర్ ఎడమ కాలువ పరిధిలోని మునగాల ఫస్ట్ లిఫ్ట్ కింద 4 ఎకరాల పొలం ఉంది.  ఏటా ఈ టైం కల్లా వరి నాట్లు వేసేటోళ్లం. కానీ, ఈ సంవత్సరం సాగర్ ఎడమ కాలువకు నీళ్లు రాకపోవడంతో దుక్కులు దున్ని నీటి కోసం ఎదురుచూస్తున్నం. కనీసం నార్లు కూడా పోసుకోలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే నీటి విడుదలపై ప్రకటన చేయాలె. 
- ఆడిదెల వెంకటరెడ్డి, రైతు మునగాల, సూర్యాపేట జిల్లా