
బిగ్ బాష్ లీగ్‌లో ఫీల్డర్ పట్టిన క్యాచ్ క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ బ్యాట్స్‌మన్ కొట్టిన బాల్‌ను.. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ కష్టపడి అందుకున్నాడు. లాస్ట్ మినట్లో బ్యాలెన్స్ ఆపుకోలేక బౌండరీ దాటాడు. ఆ సమయంలో తెలివిగా వ్యవహరించిన అతను.. బంతిని గాల్లోకి ఎగరేశాడు. ఈ క్రమంలో సరైన కంట్రోల్ లేకపోవడంతో బంతి కూడా బౌండరీ లైన్ అవతలే పడేలా అనిపించింది. దీంతో ఆ ఫీల్డర్ బౌండరీ అవతలికి వెళ్లి.. బంతిని పట్టుకున్నాడు. ఆ సమయంలో అతను గాల్లోకి జంప్ చేశాడు. అలా జంప్ చేసి బంతిని పట్టుకొని..దాన్ని బౌండరీ లైన్ ఇవతలకు విసిరాడు. మళ్లీ బంతి పడేలోపు మరోసారి అందుకున్నాడు. దీంతో అది సరైన క్యాచ్ గా పరిగణించిన అంపైర్... బ్యాట్స్‌మన్ ఔటైనట్లు ప్రకటించాడు.
క్యాచ్ పట్టిన విధానం...అంపైర్ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు, అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఇది ఏ రకమైన క్యాచ్ అని అడుగుతున్నారు. క్రికెట్ లో దీనికి సంబంధించిన నిబంధనలు ఏమున్నాయని ప్రశ్నిస్తున్నారు. అయితే క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది అవుటేనని నిపుణులు అంటున్నారు. అతను నేలను తాకకుండా బంతిని అందుకున్నాడని..అందుకే అంపైర్ ఔటిచ్చినట్లు వివరించారు.