ఏజెన్సీలో పోడు పట్టాల కోసం దళారుల వసూళ్లు

ఏజెన్సీలో పోడు పట్టాల కోసం దళారుల వసూళ్లు

మహబూబాబాద్​, వెలుగు:వారం రోజుల్లో అర్హులైన రైతులకు పోడు పట్టాలను   చేసుకోవాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ జిల్లా కేంద్రంలో సమీక్షించి ఆఫీసర్లకు ఇటీవల సూచించారు. కానీ, ఇంతవరకు గ్రామాల వారీగా పోడుపట్టాల అర్హత సాధించిన రైతుల వివరాలను విడుదల చేయలేదు. దీంతో పోడు రైతులు తమ ఆధీనంలో ఉన్న భూముల వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో అని ఆందోళనకు గురవుతున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి ఆఫీసర్ల దాకా ఎవరికి పట్టాల వివరాలు  వెల్లడించడంలేదని అంటున్నారు. 
గిరిజన రైతులు 2005కు ముందు నుంచి పోడు సాగు చేసుకుంటే అర్హత కలిగి ఉంటారని, గిరిజనేతర రైతులు 1930 నుంచి సుమారు  75 ఏండ్లుగా నివాసం ఉండడం, పోడు సాగు చేసుకుంటున్నట్లుగా ఆఫీసర్ల నుంచి ధ్రువీకరించాలి. వీటికోసం రూల్స్​ కఠినంగా ఉండటంతో అనేకమంది గిరిజనేతర రైతులు అర్హత కోల్పోతమేమో నని ఆందోళన చెందుతున్నారు. కానీ, ఆఫీసర్లు లబ్దిదారుల ఎంపిక చివరి జాబితా ప్రకటించడం లేదు. గ్రామస్థాయిలో ఎఫ్ఆర్సీఎస్​ కమిటీల సభ్యులతో ఫీల్డ్​లో అప్లికేషన్ల పరిశీలన సమయంలో సంతకాలు తీసుకున్నారు. వాటిద్వారా సీక్రెట్​గా లిస్టు ప్రిపేర్​ చేస్తుండడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయని స్థానిక రైతులు అంటున్నారు. 

 ఏజెన్సీ ఏరియాలో వసూళ్ల పర్వం

ఏజెన్సీ ఏరియాలో పోడు పట్టాల పంపిణీ త్వరలో జరుగుతుందనే ప్రచారంతో కొంమంది దళారులు పోడు రైతుల వద్ద   వసూళ్లకు పాల్పడుతున్నారు. తమ ఆధీనంలో ఉన్న మొత్తం భూమికి పట్టాలు రావాలంటే ప్రాసెస్​ చివరి దశలో ఉందని రెవెన్యూ, ఫారెస్టు ఆఫీసర్లకు ముడుపులు ఇవ్వాలని గిరిజన రైతులను నమ్మిస్తున్నారు. రైతుల నుంచి వేలల్లో డబ్బు  గుంజుతున్నట్టు తెలుస్తోంది. 

 కఠిన నిబంధనలను సడలించాలి

గిరిజనేతర రైతులకు గత 45 ఏళ్లకు పైగా ఏజెన్సీ ఏరియాలో పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గిరిజన రైతులకు 2005 వరకు నిబంధన విధించి, గిరిజనేతరులకు గత 75 ఏళ్లుగా మూడు తరాల నుంచి పోడు భూములు సాగు చేసుకుంటున్నట్టుగా, స్థిర నివాసం ఉంటున్నట్లుగా ధ్రువీకరించుకోవాలనే కఠినమైన నిబంధనలు దారుణం. కఠినమైన రూల్స్​ వల్ల గిరిజనేతరులు అనేక మందిపోడు భూముల హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. అర్హుల లిస్టును గ్రామాల్లో డిస్​ప్లే చేసిన తర్వాత పట్టాలను అందించాలి.
జంగ సదానందం, గిరిజనేతరపోడు రైతు,దుర్గారం, కొత్తగూడ మండలం

ఉమ్మడి జిల్లాలో పోడు భూముల వివరాలు
జిల్లా                    దరఖాస్తులు          పోడుభూములు(ఎకరాల్లో)
భూపాలపల్లి         25021                         63,077
 వరంగల్లు             7711                           9,968
ములుగు               34044                        91,843
మహబూబాబాద్​   32697                       1,15,948