Team India: ఆస్ట్రేలియా బయలుదేరిన టీమిండియా.. తొలి బ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్, గిల్

Team India: ఆస్ట్రేలియా బయలుదేరిన టీమిండియా.. తొలి బ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్, గిల్

వెస్టిండీస్ తో టెస్ట్ ముగిసి ఒక రోజు కాకముందే టీమిండియా మరో మెగా సిరీస్ కు సిద్ధమవుతుంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వైట్ బాల్ సిరీస్ సవాలుకు సై అంటుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మొదట మూడు వన్డేలు.. ఆ తర్వాత 5 వన్డే మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా సిరీస్ కు భారత జట్టు బుధవారం (అక్టోబర్ 15) ఆస్ట్రేలియాకు బయలుదేరింది. రెండు బ్యాచ్ లుగా టీమిండియా ఆసీస్ లో అడుగుపెట్టనుంది. ఇందులో భాగంగా మొదటి బ్యాచ్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.

ఢిల్లీ విమానాశ్రయంలోకి భారత స్టార్ క్రికెటర్లు ఎంట్రీ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. టీమిండియా వెళ్లబోయే తొలి బ్యాచ్ లో విరాట్ కోహ్లీ ముందు వరుసలో కనిపించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, నయా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, హర్షిత్ రాణా, శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. రెండు బ్యాచ్‌లలో ఆటగాళ్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. రెండో బ్యాచ్ ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం బయలుదేరే అవకాశం ఉంది. కోహ్లీ, రోహిత్ శర్మ ఏడు నెలల తర్వాత గ్రౌండ్ లో కనిపించనుండడంతో ఈ సిరీస్ కు వీరిద్దరూ ప్రధాన ఆకర్షణగా మారనున్నారు. 

అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్: 

2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత వన్డే జట్టు :

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ , హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధృవ్ జురెల్, యశస్వి జైశ్వాల్