
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం వచ్చాక టీఆర్‌ఎస్‌కు ఉప ఎన్నికల్లో తొలి దెబ్బ పడింది. ఆరేండ్లలో ఎంపీ, ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో ఎక్కడా వెనక్కితిరిగి చూడలేదు. తెలంగాణ రాక ముందు కూడా ఉప ఎన్నికల్లో ఆ పార్టీ హవా కొనసాగింది. ఉప ఎన్నిక అంటే టీఆర్‌ఎస్ అన్నట్లు పరిస్థితి మారిపోయింది. కానీ ఇప్పుడు దుబ్బాకలో ఓటమిని చవిచూసింది. బీజేపీ దూకుడు ముందు నిలువలేకపోయింది.
మొన్నటి వరకు అన్ని ఉప ఎన్నికల్లో గెలుపు
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం నాలుగుసార్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. నాలుగింటిలో మూడు చోట్ల టీఆర్‌ఎస్ గెలిచింది. 2016లో పాలేరులో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, నారాయణఖేడ్‌లో కిష్టారెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ జరిగిన బై ఎలక్షన్లో టీఆర్‌ఎస్ గెలిచింది. 2019లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ పోటీ చేసి విజయం సాధించింది. దీంతో వరుసగా మూడు ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిచింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎంపీ ఉప ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలిచింది. మెదక్ నుంచి కేసీఆర్ ఎంపీగా గెలవగా.. సీఎం అయ్యాక రాజీనామా చేశారు. అక్కడ ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి విజయంసాధించారు. అదే విధంగా వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి రాజీనామా చేసి, మంత్రివర్గంలో చేరారు. దీంతో 2015లో ఉప ఎన్నికలు రాగా, పసునూరి దయాకర్ గెలుపొందారు.
అప్పుడు మహబూబ్‌నగర్‌లో.. ఇప్పుడు దుబ్బాకలో బీజేపీ హవా
ఉప ఎన్నికల్లో బీజేపీ రెండు సార్లు విజయం సాధించింది. ఉద్యమ సమయంలో అప్పటి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ బైపోల్‌లో బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు దుబ్బాకలో రఘునందన్ విజయం సాధించారు. ఈ ఇద్దరూ టీఆర్‌ఎస్ అభ్యర్థులపైనే గెలిచారు.