ఏపీలో ముగిసిన తొలివిడత పంచాయతీ నామినేషన్లు

ఏపీలో ముగిసిన తొలివిడత పంచాయతీ నామినేషన్లు
  • రేపు నామినేషన్ల పరిశీలన.. గతంలో జరిగిన ఘటనలతో ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారం సాయంత్రం ముగిసింది. రేపు ఉదయం దాఖలైన నామినేషన్లు పరిశీలన జరుగుతుంది. నామినేషన్ పత్రాలు అన్నీ సరిగ్గా ఉంటే సరి.. లేదంటే తిరస్కరిస్తారు. పలు చోట్ల హడావుడిలో చివరి నిమిషంలో నామినేషన్లు దాఖలు చేయడంతో పొరపాట్లు జరిగి ఉండే అవకాశం ఉంది. గతంలో కరోనాకు ముందు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగానే అధికారులు… అభ్యర్థులు

కుమ్ముక్కయి కొందరి నామినేషన్లు ఏకపక్షంగా తిరస్కరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పోటీ చేస్తున్న అభ్యర్థుల కిడ్నాప్.. దాడులకు దారితీసిన ఘటనలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ నేపధ్యంలో రేపటి నామినేషన్ల పరిశీలనపై ఉత్కంఠ ఏర్పడింది. తాజాగా  ఏపీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 168 మండలాల్లో తొలి విడుత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3 వేల 249 గ్రామ పంచాయతీలకు, 32 వేల 504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థులు రెండు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయడంతో ఖచ్చితమైన సంఖ్య వివరాలను అధికారికంగా చెప్పలేకపోతున్నారు. అన్నీ కలుపుకుని సర్పంచ్ పదవులకు 13 వేలు, వార్డు సభ్యులకు 35 వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు చెబుతున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన పూర్తయ్యాక పోటీలో నిలిచే అభ్యర్థులెవరో తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి 4వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ ఉండడంతో.. ఈ ఉప సంహరణ పర్వం ముగిసిన తర్వాతే చివరికి పోటీలో నిలబడే వారెవరన్నది తేలిపోతుంది. ఫిబ్రవరి 9న ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

అదుపుతప్పి చెరువులో పడిన ఎద్దుల బండి.. తాతా మనవడి మృతి

లారీ నిండా పండ్ల బుట్టలు.. తేడా కనిపిస్తోందని చెక్ చేస్తే..

ఇంజనీరింగ్ స్టూడెంట్లకు క్లాసుల్లేవ్.. ఓన్లీ ల్యాబులే