యమునా ప్రవాహ ఉద్ధృతి..నది ఒడ్డుకు వెళ్లొద్దని కేజ్రీవాల్ విజ్ఞప్తి

యమునా ప్రవాహ ఉద్ధృతి..నది ఒడ్డుకు వెళ్లొద్దని కేజ్రీవాల్  విజ్ఞప్తి

ఢిల్లీలోని యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి వరద భారీగా వస్తుండటంతో ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయి నీటి మట్టం 205.88 మీటర్లు కాగా.. ప్రస్తుతం 204.83 మీటర్ల వరకు నీరు ప్రవహిస్తోంది.  శుక్రవారం నది  నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో 205.33 మీటర్లకు చేరుకోవడంతో వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 5 వేల మందిని హాథీ ఘాట్‌లో టెంట్లలోకి తరలించారు.  మరి కొందరిని నార్త్‌ఈస్ట్ జిల్లాల్లోని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. బాధితులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు వసతులు ఏర్పాటు చేశాయి. ఆహారం, తాగునీరు సహా ఇతరత్రా నిత్యావసరాలు అందించాయి.   కరవాల్ నగర్‌లో 200 మందిని ఎత్తైన ప్రాంతానికి తరలించారు. 

యమునా నది ప్రమాద స్థాయికి దిగువన ప్రవహిస్తుండటంతో..సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలెవరూ నది ఒడ్డుకు వెళ్లవద్దని  విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి, రిపాలనకు ప్రజలు సహకరించాలని కోరారు.  ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 'ఢిల్లీలో యమునా నది నీటిమట్టం పెరిగింది, నది ఒడ్డుకు వెళ్లకుండా చూడాలని అందరికీ నా విజ్ఞప్తి. యమునా నది సమీపంలో నివసించే ప్రజలకు తగిన ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వానికి, పరిపాలనకు సహకరించండి. మేము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాము మరియు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము” అని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

హర్యానాలోని హత్నీకుండ్‌ బ్యారేజీ  వద్ద  సగటున 352 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటుంది. అయితే ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో...యమునా నదిలోకి భారీగా వరద నీరు వస్తోంది. ఆ నీరంతా ఢిల్లీ చేరే సరికి ప్రమాదకరస్థాయికి చేరుకుంది. లాస్ట్ ఇయర్ జులై 30న ఓల్డ్‌ రైల్వే బ్రిడ్జి వద్ద 205.59 మీటర్ల స్థాయిలో ప్రవహించింది. అంతకుముందు 2019లో 206.60 మీటర్ల మార్కును చేరి ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. 1978లో అత్యధికంగా 207.49 మీటర్ల రికార్డుస్థాయిలో ప్రవహించింది. 2013లో 207.32 మీటర్ల స్థాయిలో యమునా నది ఉద్ధృతి కొనసాగింది.