దుబ్బాక బైపోల్ పై పార్టీల ఫోకస్

దుబ్బాక బైపోల్ పై పార్టీల ఫోకస్

దుబ్బాక ఉప ఎన్నికపై అన్ని పార్టీలు  అప్పుడే ఫోకస్ పెట్టాయి. భారీ మెజార్టీతో తిరిగి జెండా ఎగురవేసేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. 2018లో వచ్చిన ఓట్లకంటే ఎక్కువ పొందాలని భావిస్తోంది. ఈ సారి సీటు తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్, గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఈ నెల 6న దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ఖాళీ అయిన అసెంబ్లీ స్థానానికి 6 నెలల లోపు ఎన్నిక నిర్వహించాలి. నవంబర్ లోపు బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నా యి. దీంతో దుబ్బాక బై పోల్ కూడా అప్పుడే జరిగే చాన్స్ ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

టీఆర్ఎస్ నుంచి సతీశ్ రెడ్డి

రామలింగారెడ్డి కొడుకు సతీశ్ రెడ్డిని బరిలోకి దించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కొంత కాలంగా నియోజక వర్గంలో సతీశ్ రెడ్డి రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారని నేతలు అంటున్నారు. ఉప ఎన్నికల్లో సతీశ్ కు టికెట్ ఇవ్వడం వల్ల పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రామలింగారెడ్డి భార్య సుజాతను పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టికెట్ ఎవరికి ఇచ్చినా గెలిపించే బాధ్యతను మంత్రి హరీశ్ రావుకు కేసీఆర్ అప్పగించనున్నారు. అదృష్టం పరీక్షించుకునే పనిలో రఘునందన్ దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్గిగా థి 2014, 2018 ఎన్నికల్లో రఘునందన్ రావు పోటీ చేశారు. రెండు సార్లు ఓడిపోయిన సానుభూతిని ఈ ఉప ఎన్నికల్లో తనకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో మోడీ పాలన, రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ తనకు కలిసి వస్తుందన్న ధీమాలో ఉన్నారు. ఇప్పటికే ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొ దలు పెట్టారు. స్థానికుడు కావడంతో రఘునందన్ కు దుబ్బాక నియోజకవర్గంలో మంచి పట్టుంది

అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకులాట

ఉప ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ సిద్ధమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అభ్యర్థికోసం అన్వేషణ చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది . 2018లో పోటీ చేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి.. ఇప్పుడు పోటీ చేసేందుకు అనాసక్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అప్పుడు సిద్ది పేట నుంచి జన సమితి అభ్యర్థిగా పోటీ చేసిన భవానిరెడ్డి ఈ మధ్య కాంగ్రెస్ లో చేరారు. ఆమె దుబ్బాక నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నా కాంగ్రెస్ సీనియర్ల మధ్య క్లారిటీ లేదని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించితే పార్టీ గెలుస్తుందని కొందరు నేతలు భావిస్తున్నారు.