ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

 ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహాముత్తారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో పెద్దపులి అడుగులు మళ్లీ కనిపించాయి. నర్సింగాపూర్ అడవుల్లో స్థానికులు పులి అడుగులు గుర్తించి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. తాము కూడా పులిని చూశామని కొందరు పశువుల కాపర్లు తెలిపారు. ఆఫీసర్లు అవి పులి పాదాలే అని గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేశారు. గతంలోనూ జిల్లాలో పలుచోట్ల పులి అడుగులు కనిపించాయి.

కలుషిత నీళ్లు రాకుండా చూడాలి

వరంగల్‍ సిటీ, వెలుగు: గ్రేటర్‍ పరిధిలో కలుషిత నీళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయని.. ఆఫీసర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రేటర్‍ మేయర్‍ గుండు సుధారాణి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం 22వ డివిజన్‍ దేశాయిపేటలోని ప్రతాపరుద్ర ఫిల్టర్‍ బెడ్‍ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీళ్లు ఎందుకు రంగు మారుతున్నాయని సిబ్బందిని ప్రశ్నించారు.  అనంతరం ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. వరంగల్‍ కీర్తి బార్‍ వద్ద రోడ్డు జంక్షన్‍ రీడిజైన్‍, కల్వర్టు పనులు గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే బల్దియా కమిషనర్‍ ప్రావీణ్య  31 డివిజన్‍ సీఎస్‍ఆర్‍ గార్డెన్‍, టెంపుల్‍ ట్రీ విల్లా, 48వ డివిజన్‍ దగ్గా ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్లు, డ్రైనేజీ పనులను  పరిశీలించారు. డెవలప్‍మెంట్‍ పనుల్లో క్వాలిటీ లేనట్లయితే బిల్లుల్లో కోత ఉంటుందని హెచ్చరించారు.

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: రేవూరి

నర్సంపేట, వెలుగు: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీయేని ఆ పార్టీ స్టేట్​ లీడర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. నర్సంపేట టౌన్​ఆఫీసులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సెంటిమెంట్​తో ఓ సారి, ఆచరణ సాధ్యం కాని హామీలతో మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా రాష్ట్రంలో నియంత, కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. నర్సంపేటలో ఈసారి బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ చిలువేరు రజిని భారతి ఆధ్వర్యంలో వజినపెల్లి శారద, మామిడి రవి, మామిడి హైమ, కోమటి సరోజన, సుంకరనేని జానకిలతో పాటు పలువురు రేవూరి సమక్షంలో బీజేపీ చేరారు. కార్యక్రమంలో లీడర్లు వడ్డేపల్లి నర్సింహారాములు, బాల్నే జగన్​, జాటోతు సంతోష్​నాయక్​, కొంపల్లి రాజు, రామాంజనేయులు, శీలం సత్యనారాయణలు పాల్గొన్నారు.

ఇండ్ల స్థలాలకు పట్టాలు

చిట్యాల, వెలుగు: జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం భావుసింగ్ పల్లికి చెందిన 23మంది పేద చెంచులకు జడ్పీటీసీ గొర్రె సాగర్ ఇండ్ల జాగల పట్టాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఆర్డీటీ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్వంలో పక్కా గృహాలు కూడా నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్​దామెరబోయిన నారాయణరావు, ఆర్డీటీ కోఆర్డినేటర్ పద్మ తదితరులున్నారు.

ఆఫీసర్లు అలర్ట్ ​ఉండాలి

ఎమ్మెల్యేలు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులతో..మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‍, వెలుగు: ఉమ్మడి వరంగల్‍ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్‍ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు ఆదేశించారు. సోమవారం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, పోలీస్‍ కమిషనర్‍, ఎస్పీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలిఫోన్‍ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధానంగా ములుగు జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో అలెర్ట్ గాఉండాలని సూచించారు. గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో వరద నీటితో జనాలు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెరువులు, రోడ్లు తెగినచోట, రోడ్లపై అంగుళం కంటే ఎక్కువ నీరు ప్రవహించే దారులను తాత్కలికంగా బ్లాక్‍ చేయాలన్నారు. విద్యుత్‍ స్తంభాల వద్ద కరెంట్‍ షాక్‍లు రాకుండా చూడాలని.. పంట నష్టం, రోడ్ల డ్యామేజ్‍ అంచనాలు తయారుచేయాలన్నారు. మిషన్‍ భగీరథ మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తూ.. ఆటంకాలు ఉన్నచోట రిపేర్లు చేపట్టాలన్నారు.

ఉప్పొంగిన  మానేరు

మొగుళ్లపల్లి(టేకుమట్ల), వెలుగు: రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి శివారులోని మానేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  ఈ ప్రదేశంలో ఏడేండ్ల కింద బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించగా.. పనులు పూర్తి చేయలేదు. తాజాగా వచ్చిన వరదలకు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది.

గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసేదాకా తనిఖీల్లేవ్..

  •    కొత్తపల్లిలో జోరుగా అక్రమ ఇసుక వ్యాపారం
  •      కలెక్టర్ కు కంప్లయింట్ చేయడంతో 8 ట్రాక్టర్లు సీజ్

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. స్థానిక ఆకేరు వాగు నుంచి రోజూ వందలాది ట్రాక్టర్ల ఇసుక బయటకు తరలిపోతోంది. వాగు నుంచి వెళ్లే దారిలో ఓ సంఘం స్థలం ఉండడంతో.. ఆ స్థలాన్ని ఏడాదికి దాదాపు రూ.24లక్షలకు వేలం వేశారంటే అతిశయోక్తి కాదు. ఇసుక తవ్వకాలతో భూములన్నీ లోయలుగా మారాయి. అయితే ఈ దందా రోజూ జరుగుతున్నా.. ఆఫీసర్లు స్పందించడం లేదు. దీంతో ల్యాబర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టరేట్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయడంతో.. సోమవారం మైనింగ్ ఆర్ఐ మధుసూదన్, రెవెన్యూ ఆర్ఐ కృష్ణ స్వామి హుటాహుటిన తరలివచ్చి, 8 ట్రాక్టర్లు సీజ్ చేశారు. డ్రైవర్లు పారిపోయినట్లు చెప్పారు. ట్రాక్టర్ల ఓనర్లు, భూయజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఫిర్యాదు చేస్తే కానీ ఆఫీసర్లు స్పందించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఇసుక దందాపై పెద్ద స్థాయిలో విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడం

వరంగల్ సిటీ, వెలుగు: టీఆర్ఎస్ గూండాలకు, పోలీసు కేసులకు భయపడేది లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు స్పష్టం చేశారు. ఇటీవల దేశాయిపేటలో బీజేపీ లీడర్ నాగబోయిన రాంకీ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరగగా.. ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు రాంకీ ఇంటిపైకి వెళ్లి దౌర్జన్యం చేయబోయారు. విషయం తెలుసుకున్న ప్రదీప్ రావు.. సోమవారం హుటాహుటిన దేశాయిపేటకు వెళ్లి కార్యకర్తలకు భరోసా కల్పించారు. టీఆర్ఎస్ లీడర్లు గూండాలుగా ప్రవర్తిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పిట్ట బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని, ఎంత అణచివేయాలని చూస్తే అంత ఎదుగుతామని తెలిపారు.

నెంబర్ ప్లేట్లు మారుస్తూ చోరీలు

  •     ఇద్దరు యువకులపై కేసు నమోదు
  •     ఒకరి అరెస్ట్​, పరారీలో మరొకరు

హనుమకొండ, వెలుగు: జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు యువకులు దొంగతనాలకు పాల్పడ్డారు. పోలీసులకు అనుమానం కలుగకుండా బైకులకు డాక్టర్, మీడియా స్టిక్కర్లు వేసుకుని తాళం వేసి ఉన్న ఇండ్లు, ఆలయాల్లో చోరీలు చేయడం మొదలు పెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీసులు ఒక యువకుడిని పట్టుకోగా.. మరొకరు పరారీలో ఉన్నారు. అరెస్ట్​కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్​ కమిషనర్​ డా.తరుణ్​ జోషి  సోమవారం వెల్లడించారు. వరంగల్ జిల్లా కాశీబుగ్గ ఎస్ఆర్ నగర్  కు చెందిన మహమ్మద్ యాకూబ్ పాషా ఆటో డ్రైవర్​ గా పని చేస్తూ చోరీలకు చేస్తున్నాడు. పోలీసులకు చిక్కుకుండా తన బైక్ నంబర్​ ప్లేట్​ పై డాక్టర్, ప్రెస్​ లోగోలు వేసుకుని దొంగతనాలకు వెళ్లేవాడు. ఇలా తరచూ నెంబర్​ ప్లేట్స్, లోగోలు మారుస్తూ తాళం వేసి ఉన్న ఇండ్లు, ఆలయాల్లో మొత్తం ఎనిమిది చోరీలు చేశాడు. అనంతరం తమ ఏరియాకే చెందిన ఈరెల్లి  రఘు అలియాస్ కున్ను తో పరిచయం పెంచుకున్నాడు. తరువాత ఇద్దరూ కలిసి చోరీలు చేయడం స్టార్ట్ చేశారు. ఇలా వివిధ ప్రాంతాల్లో నాలుగు దొంగతనాలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్​, గీసుగొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఉదయం గొర్రెకుంట ప్రాంతంలో గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా.. మహమ్మద్​ యాకుబ్​ పాషా పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనాల విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అతడి నుంచి  రూ.6 లక్షల విలువైన వంద గ్రాముల బంగారం, వంద గ్రాముల వెండి ఆభరణాలు, ఒక కారు, బైక్​, ల్యాప్​ టాప్​, ఎల్​ఈడీ టీవీ, మూడు సెల్​ ఫోన్లు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో నిందితుడు ఈరెల్లి రఘు పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను సీపీ అభినందించారు.

ట్రాన్స్ ఫర్లలో కొత్త విధానం ఎత్తేయాలి

  • సెక్షన్​ టు సెక్షన్​ బదిలీలే చేపట్టాలి
  • ఎన్​పీడీసీఎల్ ఆఫీస్​ ఎదుట ఉద్యోగుల ధర్నా

హనుమకొండ సిటీ, వెలుగు: విద్యుత్ ఉద్యోగుల విషయంలో యజమాన్యం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, గతంలో సెక్షన్​ టు సెక్షన్​ ట్రాన్స్​ ఫర్​ చేస్తే.. ఈసారి మాత్రం సబ్​డివిజన్​ టు సబ్​ డివిజన్​ అంటూ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారని తెలంగాణ విద్యుత్తు ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ 82  నేతలు మండిపడ్డారు. ట్రాన్స్​ ఫర్ల విషయంలో యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరించడాన్ని నిరసిస్తూ సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్​పీడీసీఎల్​ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్​ నేతలు మాట్లాడుతూ.. కొత్తవిధానం వల్ల కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. సబ్ స్టేషన్లలో  సిబ్బందిపై పని భారం పడుతుందన్నారు. ఇకనైనా బదిలీ ప్రక్రియను పాత విధానంలోనే చేపట్టాలని, లేదంటే న్యాయ పోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు.

బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్, మహిళ మృతి

ఎల్కతుర్తి, వెలుగు:   హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లొల్లేటి మమత సోమవారం ఉదయం తన ఇంటి మెట్లపై ఉన్న ఇనుప చువ్వలకు తడి బట్టలు ఆరేస్తుండగా షాక్ కొట్టి స్పాట్ లో మరణించింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామంలో ఇటీవల పిడుగుపడి ఫ్యాన్లు, టీవీలు కాలిపోయాయి. మమతకు చెందిన ఇంట్లోనూ ఫ్యాన్ కాలిపోయి ఇంటి మొత్తానికి షార్ట్ సర్య్కూట్ అయింది. ఇది గమనించని మమత.. బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తో చనిపోయింది. కాగా, మమత భర్త ఉపాధి కోసం దుబాయి వెళ్లాడు. ఆమె కుట్టు మెషిన్ కుడుతూ.. పిల్లలను చదవిస్తోంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

బస్ డిపో ఏర్పాటుకు స్థలాన్ని సేకరించండి

ములుగు, వెలుగు: ములుగు జిల్లాకేంద్రంలో బస్ డిపో ఏర్పాటుకు స్థలం సేకరించాలని ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్లను కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో వివిధ శాఖల ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ప్రైవేట్​ వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. వానల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వెంకటాపురం మండలంలోని ఎదిర ప్రైమరీ స్కూల్ భవనాన్ని పునరుద్ధరించాలని సూచించారు. రోడ్డు రిపేర్లను వారంలో పూర్తిచేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. గోదావరి ఇసుక ర్యాంపుల వద్ద వరదలతో ధ్వంసమైన కరకట్టల వివరాలు సమర్పించాలన్నారు. నది సమీపంలో పట్టా భూములు ఉంటే ఇసుక ర్యాంపులు రద్దు చేయాలన్నారు. అధిక లోడ్​తో ఉన్న ఇసుక లారీలను నియంత్రించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎస్పీ సుధీర్ రాంనాథ్​ కేకన్, అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, డీఆర్​వో రమాదేవి తదితరులున్నారు.

మద్యం తాగి స్టూడెంట్లపై వేధింపులు

టీచర్ సస్పెండ్.. పేరెంట్స్ ఆగ్రహం

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్.. కీచకుడిగా మారి ఇబ్బందులకు గురి చేశాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ మండలం దూదియా తండాలోని ప్రైమరీ స్కూల్​లో సర్వర్ అనే వ్యక్తి టీచర్ గా పనిచేస్తున్నాడు. స్కూల్ కు మద్యం తాగి రావడమే కాక తరచూ పిల్లలను వేధించాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో  వారంతా స్కూల్​కు వచ్చి, సర్వర్ ను అడ్డుకున్నారు. దీంతో ఆయన పొంతన లేని సమాధానాలు చెబుతూ.. క్షమించమని ప్రాధేయపడ్డాడు. విషయం తెలుసుకున్న డీఈవో అబ్ధుల్ హై.. వెంటనే సర్వర్ ను సస్పెండ్ చేశాడు.

16న ప్రెస్‍ క్లబ్‍ ఎలక్షన్‍ 

వరంగల్‍, వెలుగు: గ్రేటర్‍ వరంగల్‍ ప్రెస్‍క్లబ్‍ ఎన్నికలను అక్టోబర్‍ 16న నిర్వహించనున్నట్లు ప్రెస్‍ క్లబ్‍ కమిటీ నిర్వాహకులు తెలిపారు. సోమవారం హనుమకొండలోని ప్రెస్‍క్లబ్‍లో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. రెన్యూవల్‍ కమిటీ బాధ్యులు దాసరి కృష్టారెడ్డి, బీఆర్‍ లెనిన్‍, శెంకేసీ శంకర్‍రావు హాజరై ప్రెస్‍క్లబ్‍ కమిటీతో చర్చించి క్లబ్‍ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15 నుంచి 30 ప్రెస్‍క్లబ్‍ మెంబర్‍షిప్‍ రెన్యూవల్‍ చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్‍ 1 నుంచి 9 వరకు వచ్చిన దరఖాస్తులను రెన్యూవల్‍ కమిటీ పరిశీలించి ఫైనల్‍ లిస్ట్ ప్రకటించనున్నట్లు తెలిపారు. అక్టోబర్‍ 15 జనరల్‍ బాడీ మీటింగ్‍, ప్రెస్‍ క్లబ్‍ లావాదేవీలపై నివేదిక.. అక్టోబర్‍ 16న ఎన్నికలు నిర్వహించి లెక్కింపు అనంతరం అదేరోజు సాయంత్రం ఫలితాలు ఇస్తామన్నారు. 

ప్రజాస్వామ్యమా? నియంత పాలనా?

ఇయ్యాల అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు పిలుపునివ్వగా.. పోలీసులు ముందస్తుగానే ఎక్కడికక్కడ వీఆర్ఏలను అరెస్టు చేశారు. సోమవారం పోలీసులు గ్రామాల్లో మోహరించి, వీఆర్ఏలను అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 3గంటలకే ఇండ్లలోకి దూరి, స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరు పట్ల వీఆర్ఏలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక నియంత పాలనా? అని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే అరెస్టులు చేయిస్తోందని మండిపడ్డారు.

 - వెలుగు నెట్ వర్క్