అధికార లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు

అధికార లాంఛనాలు లేకుండానే సాయన్న అంత్యక్రియలు

అధికార లాంఛనాలు లేకుండానే ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో హైదరాబాద్ మారేడ్‌పల్లి స్మశాన వాటికలో  కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. సాయన్న కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సముదాయించారు. దీంతో సాయన్న అనుచరులు ఆందోళన విరమించారు. అనంతరం సాయన్న అల్లుడు శరత్‌ చంద్ర అంత్యక్రియల ప్రక్రియను పూర్తి చేశారు. 

అభిమానుల ఆగ్రహం..

ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించకపోవడంపై ఆయన అభిమానులు ఆందోళన చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న  అంతిమ సంస్కారాలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరపాలని అభిమానులు డిమాండ్ చేశారు.  సాయన్న అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిమానులను సముదాయించేందుకు ప్రయత్నించిన వారు వినకపోవడంతో శ్మశానవాటిక నుండి  వెళ్లిపోయారు. 

ఎందుకు చేయలేదు..

సినీ నటులను, ఏపీకి చెందిన వారు చనిపోతే ప్రభుత్వం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని...కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించపోవడం ఏమిటని అభిమానులు ప్రశ్నించారు. ఈ సందర్బంగా కేసీఆర్ డౌన్ డౌన్, బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.  సాయన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి కూడా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ప్రశ్నించారు.  దళిత ఎమ్మెల్యే కాబట్టే ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయడం లేదని మండిపడ్డారు. 30 ఏండ్లు ప్రజలకు సేవ చేసిన ఎమ్మెల్యేను ఇలా అవమానించాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. 

72 సంవత్సరాల సాయన్న అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం యశోద ఆస్పత్రిలో మృతిచెందారు. షుగర్‌ లెవెల్స్‌ పడిపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులు సాయన్నను ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ  సాయన్న తుది శ్వాస విడిచారు.  1951 మార్చి 5న  చిక్కడపల్లిలో జన్మించిన సాయన్న.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.టిడిపి తరపున  1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచారు. 2009లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకరరావు చేతిలో  ఓటమిపాలయ్యారు. 2014 తర్వాత సాయన్న బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరపున పోటీ చేసి  కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా గెలిచారు.