ఆరు కంపెనీల హవాలా దందాను బయటపెట్టిన ఈడీ

ఆరు కంపెనీల హవాలా దందాను బయటపెట్టిన ఈడీ
  • రాష్ట్ర విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ 

  • రిపోర్టు ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి

  • రికార్డుల్లో తక్కువ చూపి ఎక్కువ ఎక్స్​పోర్టు చేసిన కంపెనీలు

  • ఎంప్లాయీస్‌‌ పేర్లతో బినామీ అకౌంట్లు సృష్టించి దందా

  • రెండు రోజుల ఈడీ సోదాల్లో రూ.1.08 కోట్లు స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ అడ్డాగా సాగుతున్న వందల కోట్ల రూపాయల గ్రానైట్‌‌‌‌ కంపెనీల దందా గుట్టురట్టయింది. మంత్రి గంగుల కమలాకర్ బంధువులకు చెందిన ఆరు కంపెనీల గ్రానైట్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌తో జరిగిన హవాలా వివరాలను శుక్రవారం ఈడీ బయటపెట్టింది. అక్రమంగా చైనా, హాంకాంగ్‌‌‌‌, సింగ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ సహా విదేశాలకు గ్రానైట్స్‌‌‌‌ తరలించారని తెలిపింది. ఈ నెల 9,10 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో జరిపిన సెర్చ్ ఆపరేషన్‌‌‌‌లో రూ. 1.08 కోట్ల నగదు సీజ్‌‌‌‌ చేసినట్లు ప్రకటించింది. గత పదేండ్ల కాలంగా క్వారీల్లో జరుగుతున్న అక్రమాలను గుర్తించినట్లు వివరించింది. 2013లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అండ్‌‌‌‌  ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. ఆరు కంపెనీలు చేసిన గ్రానైట్ ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌, చెల్లించిన రాయల్టీకి భారీగా తేడాలున్నాయని, దీని ఆధారంగా కేసు ఫైల్ చేసి విచారిస్తున్నట్లు వివరించింది. 

రికార్డుల్లో తక్కువ చూపెట్టి..!

కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ విదేశాలకు గ్రానైట్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేస్తున్నాయి. కరీంనగర్ నుంచి విశాఖ, కాకినాడ మీదుగా ఓడరేవులు, రైలు మార్గం ద్వారా చైనా, హాంకాంగ్‌‌‌‌, సింగపూర్ సహా ఇతర దేశాలకు గ్రానైట్‌‌‌‌ తరలిస్తున్నాయి. ప్రధానంగా చైనాకు పెద్ద సంఖ్యలో గ్రానైట్‌‌‌‌ బ్లాక్స్‌‌‌‌ను ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ చేశాయని, రికార్డుల్లో తక్కువ ఎక్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ మెటీరియల్‌‌‌‌ చూపి ఎక్కువ క్వాంటిటీతో బ్లాక్స్‌‌‌‌ను తరలించాయని ఈడీ తెలిపింది. గ్రానైట్​ ఎగుమతుల్లో ఈ 6 కంపెనీలు ఫెమా రూల్స్‌‌‌‌ను పాటించలేదని, ఇల్లీగల్‌‌‌‌గా ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, రాయల్టీస్  చెల్లించలేదని పేర్కొంది. 

లీవెన్ హ్యూ నుంచి బినామీ అకౌంట్లలోకి

విదేశాలకు తరలించిన గ్రానైట్స్‌‌‌‌కు సంబంధించిన డబ్బును చైనా నుంచి హ్యాండ్‌‌‌‌ లోన్ రూపంలో ఇండియాకు తరలించారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా లీక్స్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లోని ఒకరైన లీవెన్ హ్యూతో ఆర్థికలావాదేవీలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారులకు సంబంధించిన వివరాలను పనామా లీక్స్ గతంలోనే విడుదల చేసింది. ఇందులో లీవెన్ హ్యూ కూడా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. లీవెన్ హ్యూకు చెందిన చైనా అకౌంట్లతో గ్రానైట్‌‌‌‌ కంపెనీలకు చెందిన బినామీ అకౌంట్ల లింకులు బయటపడ్డాయి. చైనా నుంచి డబ్బు కలెక్ట్‌‌‌‌ చేసేందుకు కంపెనీల ఉద్యోగుల పేర్లతో బినామీ అకౌంట్లు సృష్టించారు. చైనాకు ఎగుమతి చేసిన గ్రానైట్‌‌‌‌కు సంబంధించిన డబ్బును బినామీ ఖాతాల్లో డిపాజిట్‌‌‌‌ చేసే విధంగా ప్లాన్‌‌‌‌ చేశారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా హ్యాండ్‌‌‌‌ లోన్స్ రూపంలో రూ. వందల కోట్లు ఇండియాకు లాండరింగ్‌‌‌‌ చేశారు.

అక్రమ ఎగుమతికి అప్పట్లో రూ.749 కోట్లు ఫైన్‌‌‌‌

కరీంనగర్ జిల్లాలోని క్వారీ లీజు ప్రాంతాల నుంచి సీ పోర్ట్‌‌‌‌ ద్వారా పెద్ద ఎత్తున గ్రానైట్ బ్లాకులు తరలించడంపై అనేక ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీస్‌‌‌‌తో పాటు సీనరేజ్ ఫీజు చెల్లించలేదని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో సీబీఐ దర్యాప్తు చేసింది. 7,68,889.937 క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేశారని 2013 మే 29న రాష్ట్ర విజిలెన్స్ అండ్ డిపార్ట్​మెంట్ తెలిపింది. పన్ను ఎగవేత, పెనాల్టీ మొత్తం చెల్లించనందుకు గాను రూ. 749.66 కోట్లు జరిమానా కూడా విధించింది. అయితే.. జరిమానాలు చెల్లించడంలో గ్రానైట్‌‌‌‌ సంస్థలు నిర్లక్ష్యం చేశాయి. 

ఈడీ విచారణకు హాజరైన పాలకుర్తి శ్రీధర్

పీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ గ్రానైట్స్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ పాలకుర్తి శ్రీధర్ శుక్రవారం ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌లోని ఈడీ ఆఫీసుకు వచ్చారు. సోమాజిగూడలోని పీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసు, రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ హైదర్‌‌‌‌‌‌‌‌గూడలోని శ్రీధర్ ఇంట్లో బుధవారం ఈడీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులతో శ్రీధర్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఈడీ అధికారులు సుమారు 2 గంటలపాటు ఆయనను విచారించారు. కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌‌‌‌మెంట్లను పరిశీలించారు. ఈ నెల 18న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దర్యాప్తు కొనసాతున్నదని ఈడీ అధికారులు తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు ఉంది.