
- కేటీఆర్ పిలుపునిచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ ధర్నాకు కవిత దూరం
- కవిత చేపట్టిన జీవో 3 దీక్షకు మద్దతు తెలపని కేటీఆర్
- రెండు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్న హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు : పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌లో ఇంటి పోరు మొదలైంది. అధికారం కోల్పోయి నాలుగు నెలలు కూడా కాలేదు... ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలు, లీడర్లు పార్టీ మారారు. కీలక నేతల మధ్య కూడా విభేదాలు మొదలైనట్టు ప్రచారం జరుగుతున్నది. ఎల్ఆర్ఎస్ పేరిట కాంగ్రెస్ సర్కార్ ప్రజల నుంచి రూ.20వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నదని ఆరోపిస్తూ.. కేటీఆర్ ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలకు పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపును ఎమ్మెల్సీ కవిత లైట్ తీసుకున్నారు. హైదరాబాద్‌లోనే ఉండి కూడా ఆమె ధర్నాలో పాల్గొనలేదు. ‘‘ఆ రోజు నేను గుడికి వెళ్లాను.. అందుకే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు’’అని సమాధానం ఇచ్చారు.
అన్నా చెల్లెళ్ల మధ్య పెరిగిన గ్యాప్!
జీవో 3 వల్ల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు అన్యాయం జరుగుతున్నదని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో శుక్రవారం ఆమె దీక్ష చేపట్టారు. ఈ దీక్షను కేటీఆర్ లైట్ తీసుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. హైదరాబాద్‌లో అందుబాటులోనే ఉన్న ఆయన.. దీక్షలో పాల్గొనలేదు. కనీసం ట్విట్టర్లో కూడా ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. నిజామాబాద్ ఎంపీ సీటు విషయంలోనూ కవితకు చేదు అనుభవమే ఎదురైనట్టు ప్రచారం జరుగుతున్నది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నా.. ఆమె నిజామాబాద్ నియోజకవర్గానికి వెళ్లడం లేదు.
వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో హరీశ్
కేసీఆర్ నిర్వహిస్తున్న లోక్‌సభ ఎన్నికల ప్రిపరేషన్‌లో హరీశ్ రావు చురుగ్గా పాల్గొంటున్నారు. రెగ్యులర్‌గా తెలంగాణ భవన్‌కు వస్తున్నారు. కానీ, ఇటీవల కేటీఆర్ పిలుపిచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ ధర్నాలో పాల్గొనలేదు. కవిత చేసిన దీక్షకు దూరంగా ఉన్నారు. హరీశ్ రావు బీఆర్‌ఎస్ వీడి, బీజేపీలోకి వెళ్తారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీటికి తోడు ఎల్‌ఆర్‌ఎస్, జీవో 3 కార్యక్రమాలకు ఆయన పూర్తిగా దూరంగా ఉండడం అనుమానాలకు తావిస్తున్నదని పార్టీ లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు.
కాంగ్రెస్ వైపు చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ పెద్దలు ఆరోపిస్తుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడ్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు.. ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అధికారికంగా వారిని పార్టీలో చేర్చుకోకుండా.. భేటీ అయ్యేందుకు రేవంత్ అవకాశం ఇస్తున్నారు. ఇప్పటి దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, ప్రకాశ్ గౌడ్ రేవంత్‌ను కలిశారు. ఎందుకు కలిశారని ప్రశ్నిస్తే.. నియోజకవర్గ సమస్యల అభివృద్ధిపై చర్చించేందుకే అని చెప్తున్నారు. ఈ పరిణామాలు లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు తలనొప్పిగా మారాయి. సిట్టింగ్ ఎంపీలు వెంకటేశ్, రాములు, బీబీ పాటిల్ బీఆర్ఎస్ను వీడినా స్పందించలేదు. మేయర్‌గా పని చేసిన బొంతు రామ్మోహన్, మంత్రిగా పని చేసిన మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. చాలా మంది కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూలో ఉన్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు పని చేస్తారో.. లేదో.. కూడా తెలియని సందిగ్ధంలో అధిష్టానం ఉన్నది.