కరోనా టైమ్ లో కనిపించని మేయర్, కార్పొరేటర్లు

కరోనా టైమ్ లో కనిపించని మేయర్, కార్పొరేటర్లు

హైదరాబాద్, వెలుగు:  గ్రేటర్ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతతో పెరుగుతున్న కేసులు, లాక్​ డౌన్ తో జనం ఇబ్బందులు పడుతున్న  టైమ్ లో జనాలకు భరోసా కల్పించాల్సిన కార్పొరేటర్లు డివిజన్లలో కనిపిస్తలేరు. జనంలో తిరిగి వారి సమస్యలపై  అధికారులతో చర్చించి పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులే అసలు పట్టించుకోవడం లేదు.  బాధ్యతలు చేపట్టి 3 నెలలైనా కొందరు కార్పొరేటర్లు నేటికీ జనంలోకి రాలేదు. ప్రతి కార్పొరేటర్ డివిజన్లలో పర్యటించాలని ఆదేశించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం లాక్ డౌన్ తర్వాత  ఇంటికే పరిమితమయ్యారు. కొందరు కరోనా బారిన పడి  జనాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని చెబుతుంటే, ఇంకొందరు కార్పొరేటర్లు బర్త్ డే సెలబ్రేషన్స్​ చేస్తూ  వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. గ్రేటర్ జనం ఎదుర్కొంటున్న సమస్యలపై ‘వెలుగు’ వారితో మాట్లాడగా..ఎన్నికల టైమ్ లో కనిపించిన లీడర్లు, కార్పొరేటర్లుగా గెలిచాక పత్తాలేకుండా పోయారని విమర్శిస్తున్నారు. జనం నుంచి వస్తోన్న విమర్శలు తట్టుకోలేక కొందరు కార్పొరేటర్లు ఫుడ్ ప్యాకెట్లను పంచుతున్నారు. చాలాచోట్ల  జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న  శానిటైజ్​ స్ర్పేఫాగింగ్ లో కార్పొరేటర్లు పాల్గొని ఫొటోలకు మాత్రమే ఫోజులిస్తున్నారు. కానీ కరోనాతో బాధపడుతున్న వారికి హాస్పిటల్స్​లో బెడ్స్​ అందుతున్నాయా, ఆక్సిజన్, మందులు, ఐసోలేషన్​ సెంటర్లు సరిపడా ఉన్నాయా లేవా అన్న విషయాలను  పట్టించుకోవడంలేదు. అవసరమున్న వారికి అవి అందేలా  చేయడంలేదు. డివిజన్లలో కరోనా పేషెంట్లు ఎందరున్నారు, వైరస్ వ్యాప్తి లాంటి  వాటి గురించి తెలుసుకోవడం లేదు. మరికొందరు ఫుడ్ ప్యాకెట్లు పంచడం, రోడ్లపై హైపో క్లోరైడ్ స్ర్పే చేస్తున్నట్లుగా ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అధికారపార్టీకి చెందిన బాలానగర్ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి జనాల్లోకి రావడం లేదు.  కానీ లాక్ డౌన్ లోనే ఆయన బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ  వేడుకలకు ఓ ఎమ్మెల్యే సైతం హాజరవడం విమర్శలకు దారి తీసింది.

ఇంట్లోనే   ఉంటున్నరు..

 ఎన్నికల టైమ్ లో ఒక్కో ఇంటికి డైలీ రెండు, మూడు సార్లు తిరిగిన నేతలు కార్పొరేటర్లుగా గెలిచాక ఆపదకాంలో జనంలోకి రావడం లేదు.  కరోనా తీవ్రత పెరగడంతో సూరారం డివిజన్ కార్పొరేటర్ సత్యనారాయణ తన ఇంటి వద్దకు ఎవరూ రావద్దని  బోర్డు ఏర్పాటు చేశారు. జనాలకు భరోసా ఇవ్వాల్సిన కార్పొరేటరే ఇలా బోర్డు పెట్టడమేంటని ప్రశ్నిస్తూ ఓ నెటిజన్ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ విషయం వైరల్ గా మారింది. తర్వాత ఆయన తన ఇంటి గేటుకు ఉన్న బోర్డును తీసేసినా  జనాల్లోకి మాత్రం రావడం లేదు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల చంద్రారెడ్డి, చింతల్​ , గాజులరామారం , జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్ లలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ కార్పొరేటర్లు గౌరీష్ పారిజాత, రషీదా బేగం, రావుల శేషగిరి, జగన్, విజయ్​ శేఖర్ ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ​గతేడాది, ప్రస్తుతం లాక్​ డౌన్ టైమ్ లో ఆ కార్పొరేటర్ ఒక్కరోజు కూడా జనాల్లోకి రాలేదని విమర్శిస్తున్నారు. మాదాపూర్ డివిజన్  కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్  కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుంచి జనాలకు కనిపించడం లేదు. లింగంపల్లిలోని తన ఇంటికే ఆయన పరిమితమయ్యారు.  జగదీశ్వర్ గౌడ్  భార్య పూజిత కూడా హఫీజ్ పేట​ కార్పొరేటర్​గా ఉన్నారు.  ఆమె కూడా డివిజన్​లోని కరోనా పేషెంట్లు, వ్యాప్తి గురించి  పట్టించుకోవడం లేదు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్  డివిజన్​లో పర్యటించిన సందర్భాలే  లేవు. కరోనా భయంతో ఇంటి దగ్గరే ఉంటున్నారు. అడిక్ మెట్​డివిజన్ కార్పొరేటర్ సునీత భర్త ప్రకాష్ గౌడ్ ఇటీవల మరణించడంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. కూకట్ పల్లి, వివేకానందనగర్‌, ఫతేనగర్, ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, రోజారంగారావు, సతీష్ గౌడ్, నర్సింహ యాదవ్​కు కరోనా నియంత్రణకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు.  సికింద్రాబాద్, ఉప్పల్  నియోజకవర్గంలో మెజార్టీ  కార్పొరేటర్లు ఏ ఒక్కరికి తమ వంతుగా సాయాన్ని అందించలేదు. కొందరు కార్పొరేటర్లు కేవలం  జీహెచ్ఎంసీ  అరెంజ్ చేసిన  డీఆర్ఎఫ్ వెహికల్స్ లో తిరుగుతూ హైపోక్లోరేడ్ ను సప్లయ్ చేయడం, నాలాల దగ్గరికి వెళ్లి వాటిని క్లీన్ చేసే పనులను పరిశీలిస్తున్నారే తప్ప కరోనాతో జనం పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

మేయర్ పర్యటనలు బంద్

కరోనా లాంటి  అత్యవసర సమయంలో కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇటీవల మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. అయినా ఎవరు స్పందించలేదు. చివరకు మేయర్​ కూడా ఇంటికే పరిమితమయ్యారు. లాక్​ డౌన్​కు ముందు వరుసగా నగరంలో పర్యటించిన ఆమె తర్వాత బయటికి రావడం లేదు. అప్పడప్పుడు తన డివిజన్​లో పర్యటిస్తున్నారే తప్ప గ్రేటర్​ పరిధిలో పర్యటించడం లేదు. డిప్యూటీ మేయర్​ మోతే శ్రీలత గాంధీ, ఫీవర్ హాస్పిటల్స్​ ని సందర్శించి అందుతున్న ట్రీట్ మెంట్​పై అధికారులతో చర్చించారు. ఐసోలేషన్​ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కానీ మేయర్​ మాత్రం బయటకు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లకు తమ డివిజన్లలో కనీసం ఎంత మంది కరోనా బారిన పడ్డారు..ప్రస్తుతం ఎందరు హోం ఐసోలేషన్ లో ఉంటున్నారనే వివరాలు కూడా తెలియడం లేదు. ఏయే కాలనీలు, బస్తీల్లో కరోనా కేసులు ఎక్కువున్నాయన్న సమాచారం లేదు. హెల్త్​ సెంటర్లు ఎన్ని ఉన్నాయన్నది, ఎంత మందికి టెస్టులు చేస్తున్నారు.. జనం వ్యాక్సిన్​ తీసుకుంటున్నారా? లేదా అన్నది అసలు పట్టించుకోవడంలేదు. ఈ సమస్యలున్నాయంటూ అధికారులతో చర్చించడం లేదు.