సమ్మక్క సాగర్​కు చత్తీస్​గఢ్​ అడ్డుపుల్ల.. 50 ఎకరాల కోసం పట్టుబడుతున్న ఎగువ రాష్ట్రం

సమ్మక్క సాగర్​కు చత్తీస్​గఢ్​ అడ్డుపుల్ల.. 50 ఎకరాల కోసం పట్టుబడుతున్న ఎగువ రాష్ట్రం
  • అదీ అటవీ భూమే.. ఎన్​ఓసీ ఇవ్వకుండా అడ్డంకులు
  • జీసీ లింక్​తో లంకె.. అన్ని రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరితే అనుమతులు ఈజీ

హైదరాబాద్, వెలుగు: సమ్మక్కసాగర్​ ప్రాజెక్టుకు చత్తీస్​గఢ్​ ప్రభుత్వం అడ్డుపుల్ల వేస్తున్నది. బ్యారేజీతో ఆ రాష్ట్రానికి పెద్దగా నష్టం లేకపోయినా.. ఏదో అయిపోతున్నదన్నట్టుగా పేచీ పెడుతున్నది. ప్రస్తుతం ఈ బ్యారేజీకి చత్తీస్​గఢ్​ నుంచి ఎన్వోసీ వస్తే తప్ప.. కేటాయింపులు, అనుమతులు వచ్చే పరిస్థితి లేదు. కానీ, ఆ రాష్ట్రం మాత్రం తమ భూభాగంలో ముంపు లేకుండా ఉంటేనే ఎన్వోసీ ఇస్తామని, బ్యారేజీ ఎత్తును తగ్గించాలని పట్టుబడుతున్నది. వాస్తవానికి సమ్మక్కసాగర్​ బ్యారేజీని 87 మీటర్ల ఎత్తుతో డిజైన్​ చేశారు. 

కానీ, ఆ ఎత్తుతో చత్తీస్​గఢ్​లో కేవలం 50 ఎకరాల భూమి మునుగుతున్నది. అది కూడా అటవీ భూమే. ఆ భూమితో పెద్దగా ప్రయోజనం లేకపోయినా.. ముంపునకు గురవుతున్నది రైతుల వ్యవసాయ భూములు కాకపోయినా ఎప్పటికప్పుడు అడ్డుపుల్ల వేస్తోంది. పలుమార్లు రాష్ట్ర సర్కారు, అధికారులు చత్తీస్​గఢ్​ ప్రభుత్వానికి ఎన్వోసీపై విజ్ఞప్తులు చేసినా ఆ రాష్ట్రం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ బ్యారేజీని ఒక ఏడాదిలో 50 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునేలా డిజైన్​ చేయగా.. వాటి అనుమతులు, కేటాయింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. 

జీసీ లింక్​తో లంకె..

సమ్మక్కసాగర్​ బ్యారేజీకి గోదావరి కావేరి లింక్​ (జీసీ లింక్​) ప్రాజెక్టుతో లంకె ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం జీసీ లింక్​లో భాగంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీని నిర్మించి నీటిని తరలిస్తామని చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తుపాకులగూడెం వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్న సమ్మక్కసాగర్​ బ్యారేజీని వాడుకోవాలని చెబుతున్నది. అయితే, చత్తీస్​గఢ్​ ప్రభుత్వం 83 మీటర్ల ఎత్తు వరకు మాత్రమే నీటిని వాడుకోవాలని కండీషన్​ పెడుతున్నది. తద్వారా తమ రాష్ట్రంలో ముంపు లేకుండా చూడాలని అంటున్నది. వాస్తవానికి జీసీ లింక్​లో భాగంగా 148 టీఎంసీలను కేంద్రం తమిళనాడుకు తరలించాలనుకుంటుండగా.. అందులో 50 శాతం అంటే 74 టీఎంసీల నీళ్లను ఇవ్వాలని మన రాష్ట్రం డిమాండ్​ చేస్తున్నది. 

డైవర్షన్​ మన భూభాగం నుంచే చేస్తుండడం.. బ్యారేజీ కూడా ఇక్కడే ఉండడంతో సగం వాటా కోసం పట్టుబడుతున్నది. ఇటు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలూ తమకు వాటా ఇవ్వాలని డిమాండ్​ చేస్తుండడంతో జీసీ లింక్​ త్రిశంకు స్వర్గంలో పడినట్టయింది. ఈ నేపథ్యంలోనే జీసీ లింక్ పై అన్ని రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరితే బ్యారేజీకి ఈజీగా అనుమతులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. 

చత్తీస్​గఢ్​ నుంచి కూడా ఎన్వోసీ వస్తుందని అంటున్నారు. ప్రాజెక్టుకు అనుమతులు లభిస్తే రోజూ 6,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకునేందుకు వీలవుతుందని చెబుతున్నారు. దేవాదుల లిఫ్ట్​కు ఇబ్బందులు తప్పుతాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కేవలం 60 రోజులు మాత్రమే నీటిని లిఫ్ట్​ చేసుకుంటుండగా.. అనుమతులొచ్చాక నీటిని స్టోర్​ చేసుకుంటే 180 రోజుల పాటు లిఫ్ట్​ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి.