ఇండియా, యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. బిజినెస్​కు బూస్ట్​.. ఐటీకి మేలు..ఆటో సెక్టార్‌‌‌‌‌‌‌‌కూ లాభమే

ఇండియా, యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. బిజినెస్​కు బూస్ట్​.. ఐటీకి మేలు..ఆటో సెక్టార్‌‌‌‌‌‌‌‌కూ లాభమే
  • ఇండియా నుంచి దిగుమతి చేసుకునే 99 శాతం వస్తువులపై యూకేలో సుంకాలు జీరో 
  • యూకే నుంచి వచ్చే 90 శాతం వస్తువులపై టారిఫ్‌‌‌‌లు తగ్గించనున్న ఇండియా

న్యూఢిల్లీ:  ఇండియా– యూకే,  ఈ వారం ప్రారంభంలో  ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌‌‌‌టీఏ) చర్చలను విజయవంతంగా పూర్తి చేశాయి. ఒకవైపు గ్లోబల్‌‌‌‌గా టారిఫ్‌‌‌‌ వార్ నడుస్తున్న వేళ,  న్యూజిల్యాండ్‌‌‌‌, యూఎస్, ఈయూతో  భారత్ ఎఫ్‌‌‌‌టీఏ చర్చలు జరుపుతోంది.  యూకేతో 2022 లో చర్చలు మొదలు కాగా, తాజాగా పూర్తయ్యాయి.  

ఈ ఎఫ్‌‌‌‌టీఏతో  ఇరు దేశాల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.  ప్రస్తుతం యూకేకు, ఇండియాకు మధ్య 60 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.5 లక్షల కోట్ల)విలువైన వ్యాపారం (ఎగుమతులు, దిగుమతులు కలిపి) జరుగుతుండగా,  2030 నాటికి దీనిని 120 బిలియన్ డాలర్ల (రూ.10 లక్షల కోట్ల)కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

తాజాగా కుదిరిన  ట్రేడ్ ఒప్పందంలో ఏముందో చూద్దాం..

ఈఎఫ్‌‌‌‌టీఏ అమల్లోకి వస్తే,  యూకేకు ఇండియా నుంచి ఎగుమతి అయ్యే సుమారు అన్ని వస్తువులపై  టారిఫ్ పడదు.  సుమారు 99 శాతం  వస్తువులు, 100 శాతం వాణిజ్యంపై  దిగుమతి సుంకాలను యూకే  రద్దు చేయనుంది.  

    
లెదర్, ఫుట్‌‌‌‌వేర్, టెక్స్‌‌‌‌టైల్ అండ్ క్లాతింగ్‌‌‌‌, జెమ్స్ అండ్ జ్యూయలరీ, బేస్ మెటల్స్, ఫర్నిచర్, స్పోర్ట్స్ గూడ్స్, ట్రాన్స్‌‌‌‌పోర్ట్/ఆటో కాంపోనెంట్స్, కెమికల్స్, వుడ్/పేపర్, మెకానికల్/ఎలక్ట్రికల్ మెషినరీ, మినరల్స్ వంటి సెక్టార్లు లాభపడనున్నాయి. ప్రస్తుతం యూకేలో ఈ సెక్టార్లపై 4-–16 శాతం డ్యూటీ పడుతోంది.
  
యూకే నుంచి దిగుమతి చేసుకునే 90 శాతం గూడ్స్‌‌‌‌పై సుంకాలు తగ్గించడానికి ఇండియా అంగీకరించింది. కానీ,  డెయిరీ ఉత్పత్తులు, యాపిల్స్, చీజ్, ఓట్స్, యానిమల్ అండ్ వెజిటబుల్ ఆయిల్స్ వంటి సెన్సిటివ్‌‌‌‌  అయిన వ్యవసాయ ఉత్పత్తులపై  సుంకాలను తగ్గించడం లేదు.  వీటిని ఎక్స్‌‌‌‌క్లూజన్ లిస్ట్‌‌‌‌లో ఉంచారు.   ప్లాస్టిక్స్, డైమండ్, సిల్వర్, బేస్ స్టేషన్స్, స్మార్ట్‌‌‌‌ఫోన్స్, టెలివిజన్ కెమెరా ట్యూబ్స్, ఆప్టికల్ ఫైబర్స్, ఆప్టికల్ ఫైబర్ బండిల్స్, కేబుల్స్ వంటి సెన్సిటివ్ ఇండస్ట్రియల్ గూడ్స్ కూడా ఈ ఎక్స్‌‌‌‌క్లూజివ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో ఉన్నాయి.  మరికొన్నింటిపై పదేళ్లలో టారిఫ్‌‌‌‌లను ఇండియా తగ్గించనుంది. 
  
యూకే నుంచి దిగుమతి చేసుకునే  స్కాచ్ విస్కీ, జిన్‌‌‌‌పై సుంకం ప్రస్తుతం 150 శాతం ఉంది. దీనిని మొదట 75 శాతానికి,  పదేళ్లలో  40 శాతానికి తగ్గించనున్నారు. యూకే ఆటోలపై డ్యూటీ 100 శాతం పైన ఉంది.  దీన్ని  కోటా బేస్‌‌‌‌లో  10 శాతానికి తగ్గిస్తారు. అంటే ఏడాదికి పరిమితికి మించిన బండ్లను దిగుమతి చేసుకుంటే, కోటా కంటే ఎక్కువగా ఉన్న బండ్లపై ఎప్పటిలానే 100 శాతం సుంకం పడుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీల)కు కూడా ఈ రూల్‌‌‌‌ వర్తిస్తుంది.  ఈ నిర్ణయంతో   టాటా -జేఎల్‌‌‌‌ఆర్, రోల్స్-రాయిస్, ఆస్టన్ మార్టిన్, బెంట్లీ వంటి యూకే కంపెనీలు లాభపడతాయి. వీటి బండ్ల  ధరలు భారత్‌‌‌‌లో తగ్గొచ్చు.
 
 చెఫ్‌‌‌‌లు, యోగా ఇన్‌‌‌‌స్ట్రక్టర్స్, క్లాసికల్ మ్యూజిషియన్స్ వంటి స్కిల్డ్‌‌‌‌ ప్రొఫెషనల్స్‌‌‌‌ యూకేకు వెళ్లడంపై రిస్ట్రిక్షన్లు తగ్గిపోతాయి.   ఐటీ, ఐటీఈఎస్‌‌‌‌, ఎడ్యుకేషన్, టెలికం వంటి ఇతర సెక్టార్లకూ ఇది వర్తిస్తుంది. ఏడాదికి 1,800 మందికి ఈ ప్రయోజనం దక్కుతుంది.
   
కామర్స్ మినిస్ట్రీ ప్రకారం, యూకేలో తాత్కాలికంగా ఉన్న భారతీయ వర్కర్స్,  వారి యజమానులు మూడేళ్ల పాటు డ్యూయల్ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.  జీతంలో సుమారు 20 శాతం ఆదా చేయడానికి కంపెనీలకు వీలుంటుంది. ఒక్క ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లోనే  60 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా.  భారత కంపెనీలు, ఉద్యోగులు సుమారు రూ.4,000 కోట్ల విలువైన ప్రయోజనాలు పొందుతారు. సర్వీసెస్ సప్లయర్లకు ఎకనామిక్‌‌‌‌ నీడ్స్ టెస్ట్‌‌‌‌, న్యూమరికల్ కోటా వంటి రిస్ట్రిక్షన్లు ఉండవు.

ఎఫ్‌‌‌‌టీఏ ఎప్పుడు అమలులోకి వస్తుందంటే? 

ఇండియా, యూకే మధ్య ఎఫ్‌‌‌‌టీఏ చర్చలు ఇప్పుడే ముగిశాయి. ఒప్పందాన్ని లీగల్‌‌‌‌గా రెడీ చేయడానికి సుమారు మూడు నెలల టైమ్ పడుతుంది.  ఆ తర్వాత, ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తారు.  భారత్‌‌‌‌లో యూనియన్ కేబినెట్, యూకే పార్లమెంట్ ఆమోదం (ఇది ఒక సంవత్సరం వరకు పట్టొచ్చు) పొందాలి. ఆ తర్వాత రెండు దేశాలు  అంగీకరించిన తేదీన ఎఫ్‌‌‌‌టీఏ అమల్లోకి వస్తుంది.