గాయత్రి ప్రాజెక్ట్స్‌ కంపెనీకి బిగ్ రిలీఫ్.. రూ.6 వేల 300 కోట్ల రుణం మాఫీ

గాయత్రి ప్రాజెక్ట్స్‌ కంపెనీకి బిగ్ రిలీఫ్.. రూ.6 వేల 300 కోట్ల రుణం మాఫీ

హైదరాబాద్: నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీకి భారీ ఊరట దక్కింది. గాయత్రి ప్రాజెక్ట్స్ ప్రమోటర్లు ప్రతిపాదించిన రూ.2,400 కోట్ల వన్-టైమ్ సెటిల్మెంట్ ప్లాన్‌ను ఎన్‎సీఎల్టీ హైదరాబాద్ బెంచ్ ఆమోదం తెలిపింది. ఎన్‎సీఎల్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రుణదాతలకు రూ.8,100 కోట్ల బకాయిలకు బదులు రూ. 2400 కోట్లు మాత్రమే చెల్లించి మళ్లీ కంపెనీని సొంతం చేసుకుంటారు గాయత్రి కంపెనీ ప్రమోటర్లు. 

గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ సీనియర్ పొలిటిషియన్ టి.సుబ్బరామిరెడ్డి కుటుంబానికి చెందింది. ఈ కంపెనీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ వంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే చాలా ప్రాజెక్టులను చేపట్టిన గాయత్రి ప్రాజెక్ట్స్ బ్యాంకుల నుంచి రూ.8100 కోట్ల రుణాల సేకరించింది. కానీ ఆశించిన మేర వ్యాపారం జరగకపోవడంతో కంపెనీ దివాళా తీసింది. బ్యాంకులకు తిరిగి డబ్బు చెల్లించలేక చేతులేత్తేసింది. 

ఎన్సీఎల్టీలో గాయత్రి ప్రాజెక్ట్స్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇచ్చిన అప్పు రికవరీ చేసుకోవడానికి కంపెనీని, కంపెనీ ఆస్తుల్ని విక్రయించేందుకు కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ప్రయత్నించింది. కానీ దివాళా తీసిన గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరికి సుబ్బరామిరెడ్డి కుటుంబసభ్యులే వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్‎తో ఎన్సీఎల్టీలో ప్రతిపాదన పెట్టారు. రుణదాతలకు రూ.8,100 కోట్ల బకాయిలకు బదులు రూ. 2400 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చారు.

గాయత్రి ప్రాజెక్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఇక చేసేదేమి లేక ప్రమోటర్లు పెట్టిన ఓటీఎస్ స్కీమ్‎ ప్రతిపాదనకు రుణదాతలు అంగీకరించారు. అంటే.. గాయత్రి కంపెనీ రూ.8,100 కోట్ల బకాయిలకు బదులు రూ. 2400 కోట్లు రుణదాతలకు తిరిగి చెల్లిస్తే చాలు. రూ. 2400 కోట్లు అంటే గాయత్రి కంపెనీ తీసుకున్న రుణంలో 30 శాతం. రూ.2400 కోట్లలో ముందుగా రూ.750 కోట్లు చెల్లించడానికి ప్రమోటర్లకు 90 రోజుల వ్యవధి ఇచ్చింది ఎన్‎సీఎల్టీ. మిగిలిన డబ్బులను కంపెనీ ఆస్తుల మానిటైజేషన్, ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధుల ద్వారా చెల్లించనున్నారు.