
భారతదేశం ఇ-పాస్‌పోర్ట్‌ల జారీ ప్రారంభించింది. ఈ నెక్స్ట్ జనరేషన్ పాస్‌పోర్ట్‌ను మొదట 1 ఏప్రిల్ 2024న పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కొన్ని పాస్‌పోర్ట్ ఆఫీసుల్లో మాత్రమే జారీ చేస్తుండగా, రాబోయే రోజుల్లో ఇతర పాస్‌పోర్ట్ ఆఫీసుల్లో జారీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఇ-పాస్‌పోర్ట్‌ను గుర్తించడానికి ముందు కవర్ పైన ఒక చిన్న బంగారు రంగు గుర్తు ఉంటుంది.
భారతదేశంలో ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి: భారతదేశంలో ఈ-పాస్‌పోర్ట్ అనేది పాస్‌పోర్ట్ కి అప్‌గ్రేడ్ వెర్షన్. ఇది ఎంబెడెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్, యాంటెన్నాతో వస్తుంది. ఫింగర్ ప్రింట్, డిజిటల్ ఫోటో వంటి బయోమెట్రిక్ వివరాలతో పాటు మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
ఈ-పాస్‌పోర్ట్ లక్షణాలు:
*భారతీయ ఇ-పాస్‌పోర్ట్ అధిక భద్రత, ఫాస్ట్ ఆతెంటికేషన్, అధునాతన టెక్నాలజీతో రూపొందించారు.
*పాస్‌పోర్ట్ ముందు కవర్‌లో ఒక ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది.
*ఈ చిప్‌లో ఫింగర్ ప్రింట్, మీ ఫోటో, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ సమాచారం ఉంటుంది.
*మీ పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు కూడా ఇందులో ఉంటాయి.
*అదనపు భద్రత కోసం ఎన్‌క్రిప్టెడ్ యాక్సెస్‌తో కూడిన కాంటాక్ట్‌లెస్ చిప్ ఇది.
*ICAO (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) నియమాలకు పూర్తి అనుగుణంగా ఉంటుంది.
*దీనివల్ల నకిలీ లేదా డూప్లికేట్ పాస్‌పోర్ట్‌లు తయారు చేయడం చాలా కష్టం.
ఇ-పాస్‌పోర్ట్‌కు ఎలా అప్లయ్ చేసుకోవాలి:
*మొదట పాస్‌పోర్ట్ సర్వీస్ పోర్టల్ ఓపెన్ చేయండి .
*కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇ-పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫామ్ నింపాలి.
*మీకు దగ్గరలో ఉన్న పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK) సెలెక్ట్ చేసుకోవాలి
*ఇప్పుడు పాస్‌పోర్ట్ ఫీజు ఆన్‌లైన్‌లో కట్టాలి
*చివరగా మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటరులో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోండి.