Hema : సినిమా వాళ్లు లోకువయ్యారా? మంచు లక్ష్మి వివాదంపై నటి హేమ సంచలన కామెంట్స్!

Hema : సినిమా వాళ్లు లోకువయ్యారా? మంచు లక్ష్మి వివాదంపై నటి హేమ సంచలన కామెంట్స్!

సినిమా రంగంలో బాడీ షేమింగ్, ట్రోలింగ్ వంటి సమస్యలు తరచూ తలెత్తుతూనే ఉంటాయి. ఇటీవల మంచు లక్ష్మిపై ఒక ఇంటర్వ్యూలో బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.  లేటెస్ట్ గా ఈ ఘటనపై నటి హేమ ఘాటుగా స్పందించారు.  కొంతమంది జర్నలిస్టులు, కొన్ని మీడియా సంస్థలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని, సినిమా వాళ్లను లోకువగా చూస్తున్నారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మిని మీరు ముంబై వెళ్లిన తర్వాత మీ డ్రెస్సింగ్ మారిపోయింది  . మీ వయసు 50కి దగ్గరవుతోంది, 12 ఏళ్ల కూతురు ఉంది. ఇలాంటి చిన్న బట్టలు వేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే జనాలు ఏమనుకుంటారు? అని జర్నలిస్టు ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే మంచు లక్ష్మి తీవ్ర అసహనానికి గురై ఘాటుగా బదులిచ్చారు. "మీరు ఒక మగవాడిని ఇదే ప్రశ్న అడుగుతారా? మహేష్ బాబును ఇలాంటి ప్రశ్నలు అడగగలరా? ఒక మహిళను ఇలా ఎలా అడుగుతారు?" అని ఆమె నిలదీశారు. ఈ ఘటనపై ఇప్పుడు నటి హేమ స్పందిస్తూ 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (MAA) , ఫిలిం ఛాంబర్ మౌనంపై ప్రశ్నించారు.

'మా' ఎందుకు స్పందించడం లేదు?

"ఒక మహిళగా, ఒక నటిగా మంచు లక్ష్మికి ఈ పరిస్థితి ఎదురైనప్పుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు సొంత చెల్లికే ఇలా జరిగితే, మరి మిగతా చిన్న ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?" అని హేమ ప్రశ్నించారు. గతంలో తనపై వచ్చిన తప్పుడు వార్తలకు, తప్పుడు ప్రచారాలకు 'మా' సంఘం చాలా వేగంగా స్పందించిందని గుర్తు చేసుకున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేసి..  నా 'మా' సభ్యత్వాన్ని కూడా తొలగించారు. నేను చాలా కష్టపడి మళ్లీ సభ్యత్వం పొందాల్సి వచ్చింది. మరి ఇప్పుడు మంచు లక్ష్మి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ఆమె నిలదీశారు.

సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ వార్తలు పెరిగిపోయాయని, తల్లి, కూతురు అనే తేడా లేకుండా ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రముఖ యాంకర్ సుమపై కూడా ఒక జర్నలిస్ట్ అనుచితంగా ప్రవర్తించారని ఆమె గుర్తు చేశారు. ఈ సంఘటనలన్నీ మీడియా బాధ్యతారాహిత్యానికి నిదర్శనాలని, జర్నలిస్టులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు.

సినిమా వాళ్లు లోకువయ్యారా..

సినిమా వాళ్లను తక్కువ చేసి చూడకండి. ఈ సమాజానికి ఒక మంచిని, స్ఫూర్తిని అందించడానికి మేము కూడా చాలా కష్టపడతాం. మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు అని ఆమె కోరారు. మంచు లక్ష్మి విషయంలో 'మా' అసోసియేషన్, ఫిలిం ఛాంబర్ తక్షణమే స్పందించి, ఇలాంటి అన్యాయాలపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. హేమ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది కేవలం ఒక సెలబ్రిటీ సమస్య కాదని, ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య అని హేమ చెప్పిన తీరుకు చాలామంది మద్దతు తెలుపుతున్నారు.