కేజీబీవీ స్టూడెంట్లు ఇంకా కోలుకోలే!

కేజీబీవీ స్టూడెంట్లు ఇంకా కోలుకోలే!

కేజీబీవీ స్టూడెంట్లు ఇంకా కోలుకోలే!

సికింద్రాబాద్, వెలుగు : కెమికల్ లీకేజీతో అస్వస్థతకు గురైన మారెడ్​పల్లిలోని కస్తూర్బా గాంధీ కాలేజీ విద్యార్థినులు ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం యశోదలో 38 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. వారిలో ఐదుగురికి తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలు రావడంతో ఐసీయూలో ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. సోమవారం సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు జడ్జి మురళీ మనోహర్, మోండా డివిజన్​ కార్పొరేటర్​ కొంతం దీపిక, బీజేపీ సిటీ మహిళా మోర్చా నాయకురాలు లక్ష్మి సోమవారం హాస్పిటల్​కు వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. 

తీవ్ర గొంతు నొప్పి 

కెమికల్​ లీకేజీతో అస్వస్థతకు గురైన విద్యార్థినులు ఎక్కువగా శ్వాస సంబంధ సమస్యతో పాటు తలనొప్పి , కడుపునొప్పి, గొంతులో మంట, హై ఫీవర్​తో బాధపడుతున్నారు. దీంతో పేరెంట్స్​ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జడ్జి మురళీ మనోహర్​ ఓ విద్యార్థినిని పరామర్శించగా అప్పటివరకు బాగానే మాట్లాడిన అమ్మాయి ఒక్కసారిగా శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడింది. దీంతో వెంటనే డాక్టర్లు చెక్​చేసి మెడిసిన్​ఇవ్వడంతో కొంత ఆయాసం తగ్గింది. చాలా మందికి లంగ్స్​ఇన్​ఫెక్షన్​ అయినట్లుగా రిపోర్టులు వచ్చాయని పేరెంట్స్ పేర్కొన్నారు. కొంత మంది అమ్మాయిల రక్తంలో హిమోగ్లోబిన్ ​శాతం పడిపోతోందని, దీంతో వారికి డాక్టర్లు బ్లడ్​ఎక్కించినట్లు తెలిపారు. 

ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే మళ్లీ అస్వస్థత

తమ పిల్లలకు సమస్య తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తోందని పేరెంట్స్​ఆందోళన చెందుతున్నారు. ‘మీ పిల్లల ఆరోగ్యం బాగానే ఉందని, ఇంటికి తీసుకెళ్లండని డాక్టర్లు చెప్తున్నారు. ఇంటికి తీసుకెళితే కొద్దిసేపటికే తలనొప్పి, గొంతునొప్పి,  బ్రీతింగ్​ప్రాబ్లమ్​వస్తోంది’ అని ఓ విద్యార్థిని తండ్రి ఆవేదన చెందారు. పూర్తిగా తగ్గకుండా ఇంటికి తీసుకెళ్తే  ఎలా అని వాపోయారు. ఈ విషయాన్ని వారు జడ్జి మురళీ మనోహర్​కు వివరించగా.. విద్యార్థినులు పూర్తి స్థాయిలో కోలుకున్న  తరువాతే ఇంటికి పంపిస్తారని, భయపడొద్దని ఆయన భరోసా ఇచ్చారు.  

అసలు కారణాలను బయటపెట్టాలె

కాలేజీ​ ల్యాబ్ ​నుంచే గ్యాస్ ​లీకైందని, మేనేజ్​మెంట్ ఈ విషయాన్ని దాచిపెట్టి చెత్తకుప్పలోని సీసా నుంచి వచ్చినట్లు చెబుతోందని పేరెంట్స్​ ఆరోపిస్తున్నారు. చెత్తకుప్పకు అతి దగ్గరలో ఉన్న షాప్​లు, ఇతర నివాసాలు, రోడ్డుపై వెళ్లేవారు ఎందుకు అస్వస్థతకు గురికాలేదని.. కాలేజీలో ఉన్న విద్యార్థినులకు మాత్రమే ఎందుకు ఇలా జరిగిందని పేరెంట్స్‌ ప్రశ్నిస్తున్నారు. దీనిపై సమగ్ర  విచారణ జరపాల్సిన పోలీసులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదన్నారు. చెత్తకుప్పలోని సీసా నుంచే కెమికల్ లీకై​  విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లుగా రిపోర్టు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వారు ఆరోపించారు. ప్రమాదానికి గల అసలు కారణాలను బయటపెట్టాలని, తమ పిల్లలు తొందరగా కోలుకునేలా వైద్య సేవలు అందించాలని పేరెంట్స్​ డిమాండ్​చేస్తున్నారు.