డీజే హరీష్ హత్యలో అసలేం జరిగింది.. 

డీజే హరీష్ హత్యలో అసలేం జరిగింది.. 

పరువు,  ప్రతిష్ట జీవిత గమనంలో అందరూ కోరుకునేది అదే. అందరూ పరువుతో బతకాల్సిందే.. దానికి ఎవరూ అతీతులు కారు. కానీ పరువు కోసం కొందరు పెద్దలు తమకున్న పరువును పొగొట్టుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో జైలు ఊచలు లెక్కిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. తమ కూతుర్ని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నందుకు అమ్మాయి బంధువులు.. యువకుడిని చంపేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తాజాగా వెలుగుచూసిన పరువు హత్యోదంతం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ అమ్మాయి ప్రేమలో పడి వేరే కులం వాడిని పెళ్లి చేసుకోవడం ఆ తల్లిదండ్రుల దృష్టిలో క్షమించరాని నేరంగా మారింది. మనసును తొలిచిన ఆ ఆలోచన పెనుభూతంగామారి కన్నవారిని కాస్తా కసాయివారిగా మార్చేసింది. అదేదో క్షణికావేశంలో జరిగింది కాదు. రోజుల తరబడి పదును పెట్టిన ఆవేశం.. తమ అమ్మాయి వివాహమాడిన యువకుడిని దుర్మార్గంగా.. దయాదాక్షిణ్యాలు లేకుండా హతమార్చే స్థాయికి దిగజార్చింది.

అసలేం జరిగింది..? 

అమీర్ పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన దేవరకొండ హరీష్ (28) డీజేగా పని చేస్తున్నాడు. గత ఆరు నెలల క్రితం హరీష్ కుటుంబం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కాలనీకి షిఫ్ట్ అయ్యింది. అంతకుముందు నుంచే ఎల్లారెడ్డిగూడలోని ఓ అమ్మాయిని హరీష్ ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కులాలు వేర్వేరు. ఇద్దరూ తమ పెద్దలకు తెలియకుండా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి యువతి కుటుంబ సభ్యులు పద్ధతి మార్చుకోవాలంటూ హరీష్ ను హెచ్చరించారు. అయినా తమ ప్రేమ స్వచ్ఛమైందని 10 రోజుల క్రితం ఆమెను తీసుకెళ్లి.. పెళ్లి చేసుకున్నాడు హరీష్. యువతి కూడా తమవాళ్లను కాదని హరీష్ తో వెళ్లి పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కొత్తకాపురం పెట్టారు. సంతోషంగా కాలం గడుస్తోంది. 

అప్పటికే కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఉన్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు.. హరీష్ పై మరింత పగ పెంచుకున్నారు. తమ పరువు పోయిందని భావించి.. ఎలాగైనా హరీష్ ను మట్టుబెట్టాలని ప్లాన్ చేశారు. దాదాపు10 రోజుల నుంచి హరీష్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అతను ఉంటున్న సూరారంకాలనీకి వెళ్లి కూడా ఆరా తీశారు. హరీష్ ఫ్రెండ్ ద్వారా అతను ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం తెలుసుకున్న  యువతి కుటుంబ సభ్యులు రెక్కీ నిర్వహించారు. మార్చి 1వ తేదీన హరీష్ తన సోదరి ఉంటున్న దూలపల్లి ప్రాంతానికి తన భార్యతో కలిసి వెళ్లాడు. యువతి కుటుంబ సభ్యులు రెక్కీ నిర్వహించి హరీష్ ను బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై వెంబడించి.. దారుణంగా హత్య చేశారు. 

యువతి కళ్లెదుటే కత్తులతో పొడిచి చంపారు. ఆమె కాళ్లవేళ్లా పడి వేడుకున్నా ఏ మాత్రం కనికరించలేదు. ప్లాన్ ప్రకారం వచ్చిన పనిని కానిచ్చేసి.. అక్కడి నుంచి తమ వెంట యువతిని తీసుకుని వెళ్లిపోయారు.  ఇంతలోనే రక్తపు మడుగులో ఉన్న హరీష్ గురించి పేట్ బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే హరీష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించడంతో హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. చనిపోయింది తమ హరీషేనని తెలుసుకుని గుండెలవిసేలా రోదించారు. ప్రేమిస్తే ఇంత ఘోరంగా చంపేస్తారా...? అంటూ విలపించడం ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించింది. హరీష్ కు తండ్రి లేడు. తల్లితో ఉంటున్నాడు. హరీష్ కుటుంబ సభ్యులు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హరీష్ ను చంపిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే.. యువతి సోదరుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పోస్టుమార్టం కోసం హరీష్ డెడ్ బాడీని సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలె 

తమ హరీష్ ను చంపేస్తామని అమ్మాయి సోదరుడు ఫోన్ చేసి బెదిరించారని మృతుడు బావ శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హరీష్ గురించి ఆరా తీశారని చెప్పాడు. హరీష్ ను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. 

పరువు ప్రతిష్టల కోసం కన్న బిడ్డలనే చిదిమేసే తల్లిదండ్రులు... అల్లుళ్లను హతమార్చే అత్తమామలు ఆ తర్వాత ఏమి సాధిస్తున్నారు..? జైలుకెళ్లి శిక్ష అనుభవించి తమ జీవితాన్నే కోల్పోతున్నారు.  దోషులకు కఠిన శిక్షలు పడి మరొకరు ఇలాంటి నేరం చేయాలంటే భయపడాల్సిన రీతిలో చట్టాలు ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా కేసు దర్యాప్తు పేరిట కాలయాపన చేయకుండా బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలి. దోషులకు శిక్ష పడే రీతిలో తగిన సాక్ష్యాధారాలను త్వరితగతిన కోర్టులకు అందజేయాలి.