కవితకు కాంగ్రెస్‎లోకి ఎంట్రీ లేదు.. తెలంగాణను దోచుకున్న దొంగ కేసీఆర్: MLC దయాకర్

కవితకు కాంగ్రెస్‎లోకి ఎంట్రీ లేదు.. తెలంగాణను దోచుకున్న దొంగ కేసీఆర్: MLC దయాకర్

కరీంనగర్, వెలుగు:  రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని, ఆ దిశగా కాంగ్రెస్ క్యాడర్ పని చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పీసీసీ బాధ్యుడు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పిలుపునిచ్చారు.  కరీంనగర్ డీసీసీ ఆఫీసులో బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సంస్థాగత  సమావేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి హాజరైన అద్దంకి దయాకర్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని,  ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 

తెలంగాణను దోచుకున్న దొంగ కేసీఆర్ అని, కాళేశ్వరం పేరుతో రూ.కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్‎లోకి ఎంట్రీ లేదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే  స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. బీసీ బిల్లు కోసం మద్దతు తెలిపినట్లుగా ప్రచారం చేసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గవర్నర్ ద్వారా కేంద్రం ఆమోదానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. 

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పదేళ్లలో  బీఆర్ఎస్ ప్రభుత్వం 10 రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు.  గత సర్కార్ చేసిన 8 లక్షల కోట్ల అప్పులను తమ ప్రభుత్వం కడుతుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జీ ఒడితల ప్రణవ్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు.