
ఆదిలాబాద్, వెలుగు: ఆదివాసీలను అసెంబ్లీకి పంపడం, వారికి భూ పంపిణీ చేయడమే తమ ‘మాభూమి రథయాత్ర’ లక్ష్యమని దళిత్ శక్తి ప్రోగ్రామ్ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ చెప్పారు. గురువారం కుమ్రం భీం కాలనీకి చేరుకున్న యాత్రకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల పట్టాలు ఇప్పించేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.
భూమికి, ఆదివాసీలకు ఎంతో అనుబంధం ఉందని, ప్రకృతిని కాపాడుతూ భూమిని రక్షిస్తున్న ఆదివాసీలకు ప్రస్తుతం గుంట భూమి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, మహిళా అధ్యక్షురాలు గోడం రేణుక, డీఎస్పీ స్టేట్ సెక్రటరీ అన్నెల లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ ఉన్నారు.