సీతమ్మసాగర్, గౌరవెల్లి పనులు ఆపండి : తెలంగాణ సర్కార్​కు జీఆర్ఎంబీ విజ్ఞప్తి

సీతమ్మసాగర్, గౌరవెల్లి పనులు ఆపండి : తెలంగాణ సర్కార్​కు జీఆర్ఎంబీ విజ్ఞప్తి
  • సీతమ్మసాగర్, గౌరవెల్లి పనులు ఆపండి     
  • ఎన్జీటీ ఆదేశాలు అమలుచేయండి 
  • సర్కార్​కు జీఆర్ఎంబీ విజ్ఞప్తి 
  • ఇదివరకే పనులు ఆపేశామన్న ఇరిగేషన్ స్పెషల్ సీఎస్

హైదరాబాద్, వెలుగు : సీతమ్మ సాగర్​మల్టీపర్పస్​ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లలో పర్యావరణ ఉల్లంఘనలపై నేషనల్​గ్రీన్​ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గోదావరి రివర్​మేనేజ్​మెంట్​బోర్డు (జీఆర్ఎంబీ) కోరింది. ఈ రెండు ప్రాజెక్టులపై ఎన్జీటీ ఆదేశాల అమలు కోసం జీఆర్ఎంబీ చైర్మన్​ఎంకే సిన్హా అధ్యక్షతన సోమవారం జలసౌధలో ఇరిగేషన్​స్పెషల్​సీఎస్ రజత్​కుమార్, ఈఎన్సీ మురళీధర్, కరీంనగర్​ఈఎన్సీ శంకర్, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్​రెడ్డితో సమావేశం నిర్వహించారు. 

పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రాజెక్టుల వర్క్​సైట్లలో పనులు చేస్తున్నారని నిర్దారణ అయ్యిందని, గ్రీన్​ట్రిబ్యునల్​ఆదేశాలను గౌరవిస్తూ ఆయా పనులను వెంటనే ఆపేయాలని కోరారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు వర్క్​సైట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే, ఎన్జీటీ ఆదేశించిన వెంటనే తాము రెండు ప్రాజెక్టుల పనులను నిలిపివేశామని రజత్​కుమార్​తెలిపారు. ఎన్జీటీ తీర్పు అమలు కోసం గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. 

కేఆర్ఎంబీ మీటింగ్​వాయిదా 

కేఆర్ఎంబీ త్రీ మెంబర్​కమిటీ సమావేశం వాయిదా వేశారు. ఏపీ, తెలంగాణకు కామన్​రిజర్వాయర్లుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల కోరుతూ రెండు రాష్ట్రాలు సమర్పించిన ఇండెంట్లపై చర్చించేందుకు బోర్డు మెంబర్​సెక్రటరీ డీఎం రాయ్​పురే అధ్యక్షతన సోమవారం త్రీ మెంబర్​కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, తాము ఈనెల 21 వరకు మీటింగ్​కు రాలేమని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి  సమాచారం ఇచ్చారు. ఏపీ ఈఎన్సీ రాకపోవడంతో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్​సైతం మీటింగ్​కు దూరంగా ఉండిపోయారు. దీంతో సమావేశాన్ని వాయిదా వేశారు. 

తాగు, సాగు నీటి అవసరాల కోసం 38.73 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ ఇండెంట్​సమర్పించగా, తమకు 30.09 టీఎంసీలు కావాలని ఏపీ కోరింది. శ్రీశైలం, నాగార్జున సాగర్​లలో సరిపడా నీటి నిల్వలు లేకపోవడంతో తాగునీటి అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు నీటి విడుదలకు అనుమతించలేమని బోర్డు అధికారులు చెప్తున్నారు. మళ్లీ త్రీ మెంబర్​కమిటీ సమావేశం జరిగే వరకు ఏపీ రెండు రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకోకుండా బోర్డు కట్టడి చేయాలని తెలంగాణ కోరుతోంది.