ఆఫర్స్ తో ఆకట్టుకుంటున్న గోల్డ్ షాపుల యజమానులు

ఆఫర్స్ తో ఆకట్టుకుంటున్న గోల్డ్ షాపుల యజమానులు

మార్కెట్లో శ్రావణమాసం సందడి కనిపిస్తోంది. ఈ మాసంలో బంగారం కొంటే సకల శుభాలు కలుగుతాయని మహిళలు నమ్ముతారు. అందుకే ఈ నెలలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏదో ఒక రోజు బంగారం కొని అమ్మవారి ముందు పెడతారు. అలా చేస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుందని చాలామంది భావిస్తారు. దాంతో ప్రస్తుతం సిటీలోని గోల్డ్ షాపులన్నీ బంగారం అమ్మకాలతో బిజీగా మారాయి.

మొన్నటి వరకు ఆషాఢంలో ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో గోల్డ్ షాపులన్నీ బోసిపోయి కనిపించాయి. కానీ శ్రావణమాసంలో నోములు, వ్రతాలకు తోడు...పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటంతో జ్యూయలరీని షాపింగ్ చేస్తున్నారు నగర వాసులు. దాంతో కస్టమర్లను ఆఫర్స్, డిస్కౌంట్స్ తో ఆకట్టుకుంటున్నారు షాపుల యజమానులు. బంగారం ధర గతంతో పోలిస్తే తక్కువే ఉందనీ... కొనుగోళ్ళకు ఇదే బెస్ట్ టైం అంటున్నారు. 

శ్రావణ మాసంలో అమ్మవారి దగ్గర అర గ్రాము బంగారం పెట్టినా... ఏడాదంతా తమ ఇంటికి సిరి సంపదలు వస్తాయని మహిళలు నమ్ముతారు. అందుకే ఏడాది మొత్తంలో కొన్నా కొనకపోయినా ఈ శ్రావణ మాసంలో మాత్రం గోల్డ్ కొంటారు. ప్రస్తుతం పూల్కా, లక్ష్మీ రూపు, నక్షి వర్క్ , ప్లెయిన్ గోల్డ్ తో ఉన్న డిజైన్స్ ని ఎక్కువ లైక్ చేస్తున్నారని అంటున్నారు వ్యాపారులు. మరికొన్ని రోజుల్లో పెళ్లి ముహూర్తాలు ఉండటంతో చాలామంది ఇప్పటి నుంచే షాపింగ్ మొదలు పెట్టారని చెబుతున్నారు..

అమ్మవారి రూపులతోపాటు చిన్న ఆభరణమైనా తప్పకుండా కొంటామని అంటున్నారు మహిళలు. బంగారంతో పాటు పూజలో ఉపయోగించే వెండి పూలు, అష్ట లక్ష్మి పూజా సామాన్లను కొంటున్నారు. శ్రావణ మాసం కోసం అర గ్రాము నుంచే స్పెషల్ డిజైన్స్ దొరుకుతున్నట్టు చెప్పారు. శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు మహిళలు వరలక్ష్మి వ్రతం చేస్తారు. దాంతో మరో మూడు రోజులపాటు సిటీలోని బంగారు షాపులకు కష్టమర్ల తాకిడి పెరిగే అవకాశం ఉందంటున్నారు నగల వ్యాపారులు.