రుణమాఫీ చెప్పింది రూ. లక్ష వరకు.. చేసింది 37 వేల లోపే

రుణమాఫీ చెప్పింది రూ. లక్ష వరకు.. చేసింది 37 వేల లోపే
  • వడ్డీ మీద వడ్డీతో పేరుకుపోతున్న క్రాప్​ లోన్లు
  • రైతుల ఖాతాలను బ్లాక్​ చేస్తున్న బ్యాంకులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: నాలుగేండ్లుగా రాష్ట్ర సర్కారు లక్ష రూపాయల రుణ మాఫీని సాగదీస్తుండటంతో రైతులు అరిగోస పడుతున్నారు. ఇటు ప్రభుత్వం రుణమాఫీ చెయ్యక.. అటు బ్యాంకులు కొత్తగా లోన్లు ఇయ్యక.. ఆగమవుతున్నారు. దాదాపు 16 లక్షల మంది రైతులకు బ్యాంకులు కొత్తగా లోన్లు ఇవ్వడం లేదు. పాత క్రాప్​ లోన్లు చెల్లిస్తలేరంటూ చాలా మంది రైతుల అకౌంట్లను ఫ్రీజ్​ చేశాయి. ఏదైనా స్కీమ్​ కింద డబ్బులు అకౌంట్​లో పడితే.. వాటిని రుణమాఫీ కింద పట్టుకుంటున్నాయి. పంట లాగోడికి బ్యాంకులో అప్పు పుట్టకపోవడంతో  ప్రైవేటు వ్యాపారులను రైతులు ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాగుచేసుకుంటున్నారు. 

నాలుగేండ్లలో 16% మందికే మాఫీ

2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లక్ష రూపాయల వరకు పంట రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రకటించారు. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మేనిఫెస్టోలోనూ ఇదే విషయం చేర్చారు. 2018 డిసెంబర్‌‌‌‌ 11ను కటాఫ్​ డేట్​గా ప్రభుత్వం గైడ్​లైన్స్​లో పేర్కొంది. రుణమాఫీకి ప్రతి బడ్జెట్ లోనూ నిధులు కేటాయిస్తున్నప్పటికీ.. వాటిని రిలీజ్​చేయడం లేదు. ఈ నాలుగేండ్ల బడ్జెట్లలో ప్రభుత్వం రుణమాఫీ కోసం రూ. 20,164.20 కోట్లు కేటాయించింది. ఈ నిధులన్నీ విడుదల చేసి ఉంటే.. ఈపాటికే రుణమాఫీ పూర్తయ్యేది. నాలుగు విడతల్లో మొత్తం లోన్లు మాఫీ చేస్తామని చెప్పిన సర్కార్.. నాలుగేండ్లలో రెండు విడుతలు కూడా పూర్తిగా మాఫీ చేయలేదు. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రుణ మాఫీకి అర్హులైన రైతులు 36.68 లక్షల మంది. వారికి మాఫీ చేయాల్సిన మొత్తం  రూ.19,198.38 కోట్లు. అయితే.. నాలుగేండ్లలో ఇప్పటివరకు కేవలం 5.66 లక్షల మంది రైతుల రుణాలే మాఫీ అయ్యాయి.  రూ. 1,179.78 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. రుణమాఫీ పొందిన రైతుల శాతం 16లోపే. రుణమాఫీ జరిగింది 6 శాతమే. ఇంకా 31 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 18 వేల కోట్లకుపైగా రుణాలు మాఫీ కావాల్సి ఉంది. వీరిలో కొందరు బయట అప్పుసప్పు చేసి బ్యాంకుల్లో పాత లోన్లు చెల్లించి రెన్యువల్​ చేసుకోగా.. ఇంకొందరు పాత లోన్లకు వడ్డీలు చెల్లించి రెన్యువల్​ చేసుకున్నారు. 12 లక్షల మంది రైతులు రెన్యువల్‌‌ చేసుకోలేదని ఎస్​ఎల్​బీసీ వర్గాలు చెప్తున్నాయి. ఈ 12 లక్షల మందికి బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రెన్యువల్ చేసుకున్నప్పటికీ రుణ పరిమితి లేక మరో  4 లక్షల మందికి బ్యాంకుల నుంచి లోన్లు రావడం లేదు. మొత్తంగా 16 లక్షల మంది రైతులకు బ్యాంకుల్లో కొత్తగా అప్పు పుట్టడం లేదు.  ప్రభుత్వం ఒకే దఫాలో రుణమాఫీ చేసి ఉంటే.. తమకు ఈ తిప్పలు తప్పేవని అన్నదాతలు అంటున్నారు. బ్యాంకులో పాత క్రాప్​ లోన్లకు వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని, అకౌంట్లను బ్లాక్​ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే అకౌంట్లలో ఉన్న తమ డబ్బులను, ఇతర స్కీమ్​ల కింద జమైన డబ్బులను కూడా బ్యాంకులు రుణమాఫీ వడ్డీ కింద కట్​ చేసుకుంటున్నాయని వాపోతున్నారు. 

ఇంకా 50 వేల లోపు రుణాలే మాఫీ కాలే

  • రూ. 50 వేల లోపున్న రుణాలను గత మార్చి 31 నాటికే మాఫీ చేయాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు రూ. 37 వేల లోపు రుణాలనే మాఫీ చేశారు.  రూ. 37 వేల నుంచి 50 వేల వరకు ఉన్న రుణాల మాఫీ కోసం 857 కోట్లు అవసరం. వ్యవసాయశాఖ పంపించిన రైతు రుణాల బిల్లులను రాష్ట్ర ఖజానాలో నిధులు లేక పోవడంతో ఆర్థికశాఖ వెనక్కి పంపించింది. 
  • 2019లో రుణమాఫీ కోసం పైసా కూడా ప్రభుత్వం చెల్లించలేదు.
  • 2020లో రూ. 25 వేల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి 2.96 లక్షల మంది రైతు రుణాలు రూ. 408.38 కోట్లు మాఫీ చేసింది.
  • 2021 ఆగస్టులో రూ. 50 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 25 వేల నుంచి 50 వేల వరకు ఉన్న రుణాలు రూ. 1,790 కోట్లు, రైతులు 5.72 లక్షల మంది. కాగా ఇందుకు సరిపడా నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటి వరకు రూ. 50 వేల  పంట రుణాలు మాఫీ కాలేదు. రూ. 37 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. 
  • మొత్తం 36.68 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 19,198.38 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 5.66 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. అవి కూడా రూ. 1,179.78 కోట్లు మాత్రమే. ఇంకా 31 లక్షల మంది రైతులు రుణ మాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. 

రైతుల అకౌంట్లు బ్లాక్​

క్రాప్​ లోన్లు తిరిగి చెల్లించడం లేదంటూ రైతుల అకౌంట్లను బ్యాంకులు బ్లాక్​లో పెట్టాయి. అకౌంట్లలో దాచుకున్న డబ్బులను, ఇతర స్కీమ్​ల కింద ఆ అకౌంట్లలో పడే డబ్బులను తీసుకోకుండా ఫ్రీజ్​ చేశాయి. అకౌంట్లలోని డబ్బులను ఏటీఎం ద్వారా విడిపించుకోకుండా.. ఫోన్‌‌‌‌ పే, గూగుల్‌‌‌‌ పే ద్వారా ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేయకుండా హోల్డ్‌‌‌‌లో పెట్టాయి.  ఏటీఎం, ఫోన్‌‌‌‌ పే, గూగుల్‌‌‌‌ పే వంటి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ మొబైల్‌‌‌‌ బ్యాంకింగ్‌‌‌‌ సేవల సమయంలో తమ బ్యాంక్‌‌‌‌ అకౌంట్లలో నగదు కనిపించకుండా జీరో చూపిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. క్రాప్​ లోన్లను రెన్యువల్‌‌‌‌ చేసుకుంటేనే అధికారులు అన్‌‌‌‌ హోల్డ్‌‌‌‌ చేస్తున్నారు.  

బ్యాంక్‌‌‌‌ చుట్టూ తిరుగుతున్న


నాకు నాలుగున్నర ఎకరాలుంది. లక్ష రూపాయల క్రాప్​లోన్​ తీసుకున్న. లోన్‌‌‌‌ రెన్యువల్‌‌‌‌ చేసుకోలేదని బ్యాంక్‌‌‌‌  ఆఫీసర్లు నా పర్సనల్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ చేశారు. అందులో రూ.30 వేలు ఉన్నయ్. ఆ డబ్బులు వస్తనే నాటేసిన కూలీలకు ఇచ్చుడు. 1 బీ, పట్టాదారు పాస్‌‌‌‌ బుక్‌‌‌‌, ఆధార్‌‌‌‌ కార్డు పట్టుకుని వారం నుంచి బ్యాంక్‌‌‌‌ చుట్టూ తిరుగుతున్న. ఇంకా నా అకౌంట్‌‌‌‌ను హోల్డ్‌‌‌‌లోనే పెట్టారు.  ‑ లడే వీరయ్య, హుస్సెన్‌‌‌‌ పల్లి, హనుమకొండ జిల్లా

పెన్షన్​ డబ్బులు ఆపిన్రు

ఉన్న రెండెకరాలు కుదవపెట్టి కాటారం ఎస్‌‌‌‌బీఐలో రూ.75 వేలు క్రాప్ లోన్ తీసుకున్న. పంటలు సరిగా పండక అప్పులైనయ్. బ్యాంకులో లోన్​ కూడా కట్టలేదు. 75 వేలు వడ్డీతో కలిపి లక్షా 13 వేలు అయినయట. ఆ అకౌంట్లనే పింఛన్​ డబ్బులు పడుతున్నయ్. ఐదు నెలల నుంచి అకౌంట్ ఆపిన్రు. ఆ డబ్బులు తీసుకోడానికి రావట్లే. రెన్యువల్​ చేస్తేనే ఆ డబ్బులు ఇస్తరట. పూట గడుసుడే కష్టంగుంది. ఎక్కడికెళ్లి తేవాలె. ‒ జాగరి లక్ష్మి, బయ్యారం, భూపాలపల్లి జిల్లా 

వడ్డీలు పెరుగుతున్నా పట్టించుకుంటలే

ఏక మొత్తంలో రుణ మాఫీ చేయాలి. 2018 డిసెంబర్‌‌ 11 లోపు  ప్రతి రైతుకు రూ.లక్ష రుణం మాఫీ చేస్తమన్నరు. ప్రభుత్వం ప్రకటించి నాలుగేండ్లు కావస్తున్నది. తక్కువ మందికే మాఫీ చేసి.. చేతులు దులుపుకున్నది. వడ్డీలతో అప్పులు పెరుగుతున్నా ప్రభుత్వం  పట్టించుకుంటలేదు.  - రావుల రామ్మోహన్ రెడ్డి,  రైతు, జనగామ జిల్లా

అప్పు వడ్డీ బాగా పెరిగిపోయింది

2017 లో గ్రామీణ వికాస్ బ్యాంక్​లో   రూ.80 వేలు  పంట రుణం తీసుకున్న. ఇప్పుడు  రూ.లక్ష 40 వేలు అయింది. సర్కారు రుణమాఫీ చేయక అప్పు పెరిగి పోయింది.  బ్యాంకులు లోన్లు ఇస్తలేవు. వడ్డీ కట్టుమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రుణాలు మాఫీ చేయాలి. - పెద్దమాతరి నర్సింహులు,  రైతు, జనగామ జిల్లా