పెళ్లి కొడుకు బదులు కృష్ణుడి విగ్రహం: యూపీలో సంచలనం సృష్టిస్తున్న యువతి పెళ్లి..

 పెళ్లి కొడుకు బదులు  కృష్ణుడి విగ్రహం: యూపీలో సంచలనం సృష్టిస్తున్న యువతి పెళ్లి..

ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల పింకీ శర్మ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని సంప్రదాయ హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న ఆమె చిన్నప్పటి నుంచీ కృష్ణుడికి గొప్ప భక్తురాలు.

గత శనివారం రోజున తన కుటుంబ సభ్యులు, చుట్టాలు, గ్రామస్థులు కలిసి  పెళ్లి వేడుకలాగా అన్ని ఆచారాలను ఆ విగ్రహంతో నిర్వహించారు. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైయూర్ కాశీమాబాద్ గ్రామంలో జరిగిన ఈ పెళ్లి జనాల దృష్టిని ఎంతో   ఆకర్షించింది.

 
అయితే పింకీ ఇంటిని పెళ్లి ఇంటిలా అలంకరించి, పెళ్లి మండపం కూడా వేశారు. ఆమె బావ ఇంద్రేష్ కుమార్, శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వరుడిలా ముస్తాబు చేసి కారులో బరాత్‌ ద్వారా వచ్చారు. ఈ బరాత్‌లో దాదాపు 125 మంది పాల్గొన్నారు. బరాత్‌ ఊరేగింపు ఇంటికి రాగానే, అత్తమామలు చేసే సంప్రదాయ స్వాగతం పలికారు. పింకీ తన చేతుల్లో ఆ విగ్రహాన్ని ఎత్తుకుని వేదికపైకి వెళ్లింది.

ఆమె దేవుడి విగ్రహంతో దండలు మార్చుకుని తర్వాత సిందూరం పెట్టుకుంది. ఈ పెళ్ళికి విందు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా బృందావనం నుంచి వచ్చిన కళాకారులు భక్తి పాటలు, డాన్స్ కూడా చేశారు.

పెళ్లిలో అగ్ని సాక్షిగా వేసే ఏడు  అడుగులు కూడా పింకీ కృష్ణుడి విగ్రహాన్ని ఎత్తుకునే వేసింది. ఇంతటితో అయిపోలేదు మరుసటి రోజు ఉదయం ఆమెని అత్తారింటికి పంపడం కూడా జరిగింది. అయితే, ఆమె మాత్రం తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది.

 
పింకీ తండ్రి సురేష్ చంద్ర చెప్పిన వివరాల ప్రకారం, పింకీకి చిన్నప్పటి నుంచీ కృష్ణుడంటే ప్రాణం. నాలుగు నెలల క్రితం, బృందావనంలోని బాంకే బిహారీ ఆలయంలో ప్రసాదం తీసుకుంటుండగా, ఒక బంగారు ఉంగరం ఆమె చున్నీలో పడింది. ఇది దేవుడి ఆశీర్వాదంగా భావించిన పింకీ, ఇక ఏ మనిషిని పెళ్లి చేసుకోకుండా కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

కొద్ది రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు, బృందావనంలో కృష్ణుడి విగ్రహాన్ని మోసుకుని గోవర్ధన పరిక్రమ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆమె కోలుకోవడంతో, దేవుడి సంకేతం అని మరింత గట్టిగా నమ్మింది. తండ్రి ఆమె నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించి, కొడుకులతో సమానంగా కుటుంబ ఆస్తిలో ఆమెకు వాటా ఇస్తానని చెప్పారు.

పింకీ తల్లి రామేంద్రికి మొదట్లో ఈ ఆలోచన వింతగా అనిపించినా, ఇది ఆమె భక్తి అని అర్థం చేసుకుని ఒప్పుకున్నారు. పింకీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చదువు ముఖ్యం అయినప్పటికీ, తన జీవితం దేవుడికి అంకితమైందని, శాంతి, భక్తి, కృష్ణుడికి శరణాగతిలోనే ఉన్నాయని చెప్పింది.