KAANTHA OTT Officially: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘కాంత’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

KAANTHA OTT Officially:  ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘కాంత’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’ (KAANTHA). ఈ మూవీ 2025 నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ క్రమంలో మేకర్స్ ఆశించినస్థాయిలో కాంత విజయం అందుకోలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా రూ.34.5 కోట్ల గ్రాస్, ఇండియా వైడ్గా రూ.22.05 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాల సమాచారం.

అయితే, గత కొన్నిరోజులుగా ‘కాంత’ ఓటీటీ రిలీజ్పై పలురకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఎట్టకేలకు ‘కాంత’ ఓటీటీ విడుదలపై నెట్‌ఫ్లిక్స్‌ క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టింది. ఈ నెల డిసెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తెలుగు, తమిళ భాషల్లో ‘కాంత’ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.

ఇందులో నటులు సముద్రఖని, రానా, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో పోటాపోటీగా నటించి మెప్పించారు. రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’, దుల్కర్ సల్మాన్ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ సంయుక్తంగా కాంత మూవీ నిర్మించారు. సెల్వమణి సెల్వరాజ్ రచన, దర్శకత్వం వహించారు. 

Also Read :  హిందీ ‘బిగ్‌బాస్‌ 19’ విన్నర్ ఎవరు? అతనికి వచ్చిన ప్రైజ్‌ మనీ ఎంత.?

సినిమా విశ్లేషణకి వస్తే.. ప్రేక్షకుల చప్పట్లకు తగ్గట్టుగా నటించాలనే హీరో, కథకు తగ్గట్టుగా నటించాలనే దర్శకుడు.. వీరి మధ్య ఇగో క్లాషెస్‌ ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఫస్ట్ హాఫ్‌ అంతా హీరోయిన్‌తో లవ్‌ స్టోరీకి ప్రాధాన్యతను ఇచ్చిన దర్శకుడు, సెకెండాఫ్​ మొత్తం మర్డర్ మిస్టరీ జానర్‌‌లోకి మార్చాడు. సినిమాలో ఓ వైపు సినిమా షూటింగ్ జరుగుతుండటం, పీరియాడిక్ టచ్‌, నటీనటుల పెర్ఫార్మెన్స్‌, అప్పటి ఆర్ట్ వర్క్, మ్యూజిక్ లాంటివన్నీ ఈ సినిమాకు గ్రాండ్‌ లుక్‌ తీసుకొచ్చాయి. ప్రేక్షకులను కూడా బ్లాక్ అండ్ వైట్‌ సినిమాల కాలానికి తీసుకెళ్లగలిగాయి.

అయితే సెకండాఫ్‌లో రానా సీన్స్‌ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రస్తుత కాలాన్ని గుర్తుచేస్తుంటాయి. అదీకాక సెకండాఫ్‌ మొత్తం మర్డర్ మిస్టరీ చుట్టూనే తిరగడం సాగతీతగా అనిపిస్తుంది. అయితే, హంతకుడు ఎవరనేది ముందే ఊహించినా.. ఎందుకు చేశాడనేది మాత్రం గెస్‌ చేయలేం. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.గొప్ప పీరియాడిక్‌ సెటప్‌లో ఈ మూవీని ప్లాన్‌ చేయడంలో సక్సెస్‌ అయిన దర్శకుడు.. ఈ కథను సరైన రీతిలో బిగి సడలకుండా తెరకెక్కించడంలో తడబడ్డాడు.

‘కాంత’ కథేంటంటే: 

1950 నేపథ్యంలో స్టార్‌‌ హీరోకి, గొప్ప దర్శకుడికి మధ్య జరిగే కథ ఇది. అయ్య (సముద్రఖని) పేరున్న దర్శకుడు. తన తల్లి శాంత కథను అదే పేరుతో సినిమాగా తీయడం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. ఒకప్పటి ఆయన ప్రియ శిష్యుడైన టీకే మహదేవన్‌ (దుల్కర్‌‌) ఇందులో హీరో. జీరోగా ఉన్న అతన్ని స్టార్‌‌ హీరోని చేసింది అయ్యనే. కానీ వీళ్లిద్దరి మధ్య ఇగో క్లాషెస్‌. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఓ ప్రొడ్యూసర్ చొరవతో తిరిగి ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది.  కానీ హీరో మహదేవన్‌ సెట్‌లో దర్శకుడిని డామినేట్ చేస్తుంటాడు. ‘శాంత’ టైటిల్‌ను ‘కాంత’గా మార్చడంతో పాటు క్లైమాక్స్‌ కూడా తన స్టార్‌‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్చాలని పట్టుబడుతుంటాడు.

ఇందులో కొత్త అమ్మాయి కుమారి (భాగ్యశ్రీ బోర్సే)ను హీరోయిన్‌గా తీసుకుంటారు. ఈమె అయ్య శిష్యురాలు కావడంతో సెట్‌లో ఆయన చెప్పిందే ఫాలో అవుతుంటుంది. మహదేవన్‌కు ఆమె వ్యవహారశైలి నచ్చకపోయినప్పటికీ తన అందం, టాలెంట్‌కు ఫిదా అవుతాడు. క్రమంగా ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ అప్పటికే ఓ మీడియా మొఘల్ కూతురితో అతనికి పెళ్లయింది. మరోవైపు మహదేవన్‌, అయ్య మధ్య సయోధ్య కుదర్చడానికి కుమారి ప్రయత్నాలు చేస్తుంటుంది. కానీ అవేవి వర్కవుట్ అవవు. ఈ ఇద్దరి ఇగో క్లాషెస్‌తో మిగతా యూనిట్‌ అంతా ఇబ్బందులు పడుతుంటారు. ఎలాగోలా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుంది. కానీ చివరి రోజు సెట్‌లో జరిగిన పరిణామాలతో ఒకే సీన్‌ మిగిలి ఉండగా షూటింగ్‌ ఆగిపోతుంది.

మరోవైపు అదేరోజు రాత్రి స్టూడియోలో ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య కేసును ఛేదించడానికి ఫీనిక్స్‌ (రానా) రంగంలోకి దిగుతాడు. స్టూడియో మొత్తం తన ఆధీనంలోకి తీసుకుని విచారణ మొదలుపెడతాడు. ఇంతకూ ఆ హత్య చేసిందెవరు..? వీళ్లిద్దరి ఇగో ఇష్యూస్‌కి కారణమేంటి..? ఇద్దరిలో ఎవరు చెప్పిన క్లైమాక్స్‌తో సినిమా పూర్తయింది.. అనేది మిగతా కథ.