ఇమ్మిగ్రెంట్లపై విషం కక్కిన జేడీ వాన్స్.. భార్య ఉషాను భారత్ పంపేయాలంటూ నెటిజన్ల డిమాండ్!

ఇమ్మిగ్రెంట్లపై విషం కక్కిన జేడీ వాన్స్.. భార్య ఉషాను భారత్ పంపేయాలంటూ నెటిజన్ల డిమాండ్!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. విదేశీయుల సామూహిక వలసలు అమెరికన్ కలల దొంగతనం చేస్తున్నాయంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. ఇమ్మిగ్రెంట్లు అమెరికా కార్మికులకు అవకాశాలను దూరం చేస్తున్నారని అందులో ఆరోపించారు. తన వాదనను వ్యతిరేకించే అధ్యయనాలన్నీ “పాత వ్యవస్థ ద్వారా ధనవంతులవుతున్న వ్యక్తులు” నిధులిచ్చినవేనని వాన్స్ ఆరోపించారు. 

అయితే వాన్స్ వ్యాఖ్యలపై తగ్గేదేలే అన్నట్లుగా నెటిజన్లు కూడా గట్టిగా తిరిగిచ్చేస్తున్నారు. ఆయన భార్య ఉషా వాన్స్, భారతీయ ఇమ్మిగ్రెంట్ల కుమార్తె అని వాన్స్ మర్చిపోయారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉషా అమెరికాలోనే జన్మించినప్పటికీ.. ఆమె కుటుంబ నేపథ్యం కారణంగా నెటిజన్లు వాన్స్‌పై మండిపడ్డారు. వాన్స్ తన భార్య ఉషాతో పాటు పిల్లలను కూడా తిరిగి భారత్ పంపిచేయాలంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. దీనికి ఫ్లైట్ టిక్కెట్స్ కొన్నప్పుడు మాకు కూడా చెప్పిండి అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఒకరికి చెప్పే ముందు మీరు కూడా ఆదర్శంగా ఉండాలంటూ వాన్స్ కామెంట్స్ పై మండిపడ్డారు. జేడీ వాన్స్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యలను ఉషా ఎలా సహిస్తోంది? ఆమె తన జాతి, మతాన్ని అపహాస్యం చేయడానికి ఎందుకు అనుమతిస్తోంది? ఆమె అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది?” అని ప్రశ్నించాడు సదరు యూజర్.

దీంతో గతంలో వాన్స్ చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి. తమ జాతి, భాష, రంగు ఒకేలా ఉండే పొరుగువారిని ఇష్టపడటం "పూర్తిగా సహేతుకమైనది" అని ఒక పోడ్‌కాస్ట్‌లో ఆయన అన్న విషయాలను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు యూజర్లు. అలాగే తన హిందూ భార్య ఉషా ఏదో ఒక రోజు తన క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు వాన్స్ చేసిన పాత కామెంట్స్ కూడా మళ్లీ వైరల్ అయ్యాయి. దీనిపై ఉషా మతం మారే ఆలోచన లేదని వాన్స్ తర్వాత వివరణ ఇచ్చినప్పటికీ ఆయన మనస్సులోని ఆలోచనలు తప్పని చాలా మంది అంటున్నారు.