హైదరాబాద్: ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయిస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ సోమవారం (డిసెంబర్ 8) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపాలిని హైకోర్టు ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని ఏపీకు అలాట్ చేస్తూ 2024 అక్టోబర్‌లో డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్‌లో చేరిన ఆమ్రపాలి డీవోపీటీ ఉత్తర్వులను కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్ (క్యాట్)లో సవాల్ చేశారు. తిరిగి తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు.
ఐఏఎస్ హరికిరణ్‌తో స్వాపింగ్తో ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ 2025, జూన్ 25న క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఐఏఎస్ హరికిరణ్ రిజర్వ్ కేటగిరీ కాబట్టి అతడితో ఆమ్రపాలికి స్వాపింగ్ వర్తించదని డీవోపీటీ వాదించింది. డీవోపీటీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.
