జీవో ఇచ్చిన్రు కానీ జీతమియ్యరా.?

జీవో ఇచ్చిన్రు కానీ జీతమియ్యరా.?

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 4వేలకు పైగా పంచాయతీలు గత ఏడాది ఏర్పడ్డాయి. ఎన్నో ఏండ్ల నుంచి  రూ.2వేల లోపే జీతాలు తీసుకుంటూ పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలను అక్టోబర్ 14న రూ.8500 కు పెంచుతూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 51  జారీ  చేసింది. అప్పటి నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రతి చోట ప్రచారం చేస్తున్నారు. కార్మికుల తో కృతజ్ఞతా సభలు నిర్వహిస్తున్నారు. కాని జీతాలు ఎవరు ఇవ్వాలన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.  గ్రామ పంచాయతీలే ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పగా మొత్తం పంచాయతీల్లో కేవలం 20 శాతం మాత్రమే ఆదాయం కలిగి ఉండగా మిగతా 80 శాతం జీపీలకు ఇన్​కమే రావడం లేదు. ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం ఐదుగురు కార్మికులు పని చేస్తుండగా వీరికి ప్రతి నెలా రూ.40 వేలు అవసరం. ఇన్ని పైసలు ఎక్కడి నుంచి తేవాలని సర్పంచ్ లు ప్రశ్నిస్తున్నారు.

క్లారిటీ ఏది?

మామూలుగా ఏదైనా గవర్నమెంట్​ఆర్డర్​జారీ చేస్తే అందులో కొన్ని విషయాలపై క్లారిటీ ఉంటుంది. ఉదాహరణకు పంచాయతీ కార్మికుల జీతాలకు సంబంధించిన జీఓనే తీసుకుంటే 14–10–2019న ఈ ఆర్డర్​ను ఇష్యూ చేశారు. ఇందులో జీతాలను రూ.8500కు పెంచుతున్నట్టు స్పష్టంగా ఉన్నా ఎప్పటి నుంచి ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి అనే విషయం మెన్షన్​ చేయలేదు.  సీఎం మాత్రం గ్రామ పంచాయతీలే బాధ్యత తీసుకోవాలని చెప్పడంతో తమకు అంత స్థోమత లేదని సర్పంచ్​లు అంటున్నారు. దీంతో  39 వేల మంది కార్మికులు పెంచిన జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్లకు జీతాలు ఇవ్వాలంటే ప్రతి నెలా సుమారు రూ.33 కోట్లు అవసరం.

ఆర్థిక సంఘం నిధులతోనే..

గ్రామాలకు  నేరుగా కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా నిధులు వస్తాయి. ప్రతి ఏడాది 203 కోట్లను విడుదల చేస్తోంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 136 కొట్లు కలిపి కలిపి ప్రతి నెలా రూ.339 కోట్లు చెల్లిస్తోంది. అయితే అక్టోబర్, నవంబర్ నెల నిధులతో గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకులు, ట్రాలీలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటి నుంచే కరెంట్ బిల్లులు, కార్మికుల జీతాలు ఎట్లా ఇచ్చేదని సర్పంచ్​లు ప్రశ్నిస్తున్నారు.

ఎప్పుడిస్తరో ఏమో

ప్రభుత్వం జీవో విడుదల చేసినా అమలైతలేదు.  కలెక్టర్, డీపీవోలను కలిసి అడిగితే ఆర్డర్స్​రాలేదంటున్నరు. మా పంచాయతీలో 11 మంది కార్మికులు పనిచేస్తున్నరు.  2 నెలల నుంచి చూస్తున్నా జీతం
ఎప్పుడిస్తరో ఏమో..

– ఈశ్వరయ్య,  పంచాయతీ కార్మికుడు ( వాటర్ మెన్ ), నెమర్ గుండ్ల , యాదాద్రి జిల్లా

పంచాయతీలకు స్థోమత లేదు

రాష్ట్రంలో 80 శాతం గ్రామ పంచాయతీలకు ఆదాయం లేదు. జీతాలలో 80 శాతం ప్రభుత్వం, 20 శాతం పంచాయతీలు భరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 14వ ఆర్ధిక సంఘం నిధులు మాత్రమే వస్తున్నాయి. వాటి నుంచే కరెంట్ బిల్లులు, జీతాలు, మెయింటెన్స్ ఇస్తే గ్రామ అభివృధ్ది ఎట్లా చేసేది?

– ప్రణీల్ చందర్ , సర్పంచ్ , నుసురుళ్లాబాద్, మహబూబ్ నగర్ జిల్లా