తొమ్మిదేండ్లలో నీళ్లు సముద్రం పాలు.. నిధులు కాంట్రాక్టర్ల పాలు

తొమ్మిదేండ్లలో నీళ్లు సముద్రం పాలు.. నిధులు  కాంట్రాక్టర్ల పాలు

ఈ తొమ్మిదేండ్లలో నీళ్లు సముద్రం పాలు.. నిధులు పాలకుల/ కాంట్రాక్టర్ల పాలు తెలంగాణ అప్పుల పాలు నిరుద్యోగులు రోడ్ల పాలు.. ఇదే రాష్ట్రం సాధించిన ఘనతలు. నీళ్లు, నిధులు, నియామకాలలో ఆంధ్ర పాలకుల వివక్షను వ్యతిరేకిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగింది. ప్రధానమైన ఈ మూడింటిలో ఒకటి నీళ్లు. సాగు, తాగునీటి విషయంలో తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత జరిగిన అభివృద్ధి.. ఈ తొమ్మిదేండ్ల పాలనను సమీక్షించి వాస్తవాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన 33 ప్రాజెక్టులలో 32 ప్రాజెక్టులు 2014 కు ముందే 70 శాతం నుంచి 80 శాతం పూర్తయ్యాయి. కేవలం రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగతా పనులు పూర్తయి 32 ప్రాజెక్టుల ద్వారా 34 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. ఈ 33 ప్రాజెక్టులలో ప్రాణహిత-–చేవెళ్ల కూడా ఒకటి. ప్రత్యేక రాష్ట్రం వచ్చే నాటికే ఈ ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లతో పనులు చేశారు. మరో రూ.28 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు కంప్లీట్​అయి 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చేది. అంటే రూ. 41 (11 + 30) వేల కోట్లతో 33 ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసుకొని మొత్తం 50.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోనికి వచ్చి ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ 33 ప్రాజెక్టులను ఎక్కడివక్కడే వదిలేసింది. కొత్త కాంట్రాక్టులు, కొత్త అగ్రిమెంట్‌ల పేరుతో కమీషన్ల కోసం రీడిజైన్​అనే ఎత్తుగడ వేసింది. రీడిజైన్‌ల పేరుతో రూ. 30 వేల కోట్లతో పూర్తి కావలసిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టుగా పేరు మార్చి ఆయకట్టును 18.25 లక్షల ఎకరాలుగా పేర్కొన్నారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.1.30 లక్షల కోట్లకు పెంచారు. (ఇప్పటికీ పంట కాలువలు, పిల్ల కాలువలు పూర్తి కాలేదు). రీడిజైన్‌ ద్వారా అదనంగా సాగులోకి వచ్చేది 1.85 లక్షల ఎకరాలే... కానీ రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. పైగా ఎన్నో గ్రామాల్లో వేలాది మందిని నిరాశ్రయుల్ని చేసి రోడ్డున పడేశారు. దీనికి కేసీఆర్‌ నిర్ణయాలే ప్రధాన కారణం. ఈ రీడిజైనింగ్ సూత్రాన్ని మిగతా ప్రాజెక్టులకు కూడా అన్వయించి అంచనాలు భారీగా పెంచారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం ఏటా 195 టీఎంసీలు ఎత్తిపోయాలి. కానీ 2019 నుంచి 2022 వరకు నాలుగేండ్లలో 154.08 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్​చేశారు. ఇందు కోసం వినియోగించిన కరెంటు ఖర్చు సుమారు రూ.4 వేల కోట్లు. ఎత్తిపోసిన 154.08 టీఎంసీల నుంచి 50 టీఎంసీలు మళ్లీ వృథాగా సముద్రంలోకే పోవడం గమనార్హం. అంటే నికరంగా నాలుగేండ్లలో 104 టీఎంసీలు మాత్రమే ఉపయోగపడ్డాయి. ఈ నీటిని కూడా సాగుకు ఇవ్వకుండా ప్రజలను భ్రమల్లో ముంచడానికి ఎండాకాలంలో వాగులలో పారించడం, మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ మరియు ఇతర కొన్నిచెరువుల్లో నిల్వ చేసి వాటిని టూరిస్ట్‌ స్థలాలుగా ప్రజలకు చూపిస్తున్నారు. ప్రాజెక్టు కింద ఏటా 18.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. కానీ గతేడాది 57 వేల ఎకరాలకు నీరిస్తామని ప్రతిపాదించినప్పటికీ గోదావరి వరదలలో పంపులు మునిగిపోవడంతో అది కూడా చేయలేదు. పంట కాలువలు, పిల్ల కాలువలు ఇప్పటికీ పూర్తి చేయనందున ప్రాజెక్టు కింద ఆయకట్టు భూములకు నీరు అందించలేని పరిస్థితి. కొండపోచమ్మ సాగర్‌ ద్వారా కేసీఆర్ ఫామ్‌హౌస్‌ కు నీళ్లివ్వడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయిని అంటూ గొప్పలు చెప్తూ.. తాను చేసిన రీడిజైన్‌ తప్పును కప్పిపుచ్చడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది ఒక ఫెయిల్యూర్​ప్రాజెక్టు. వేల కోట్ల కరెంటు బిల్లులతో భవిష్యత్తులో ఇది తెల్ల ఏనుగులా మారబోతున్నది. ఉత్తర తెలంగాణలో 2014 కు ముందు చేపట్టిన ఆదిలాబాద్‌ జిల్లాలోని చనాకా కొరాటా,  సదర్‌మట్‌ ఆధునికీకరణ, వరంగల్‌ జిల్లాలో తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి చేయలేదు.

కమీషన్ల ‘మిషన్‌ భగీరథ’

ఇంటింటికి నల్లా నీరు పేరుతో రూ. 45 వేల కోట్లతో మిషన్‌ భగీరథ చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చే నాటికి 80 శాతం నుంచి 90 శాతం గ్రామాలకు త్రాగునీటి సౌకర్యం ఉంది. ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే లభించే నీటి వనరుల ద్వారా తాగునీటిని అందించేవారు. కానీ కేసీఆర్​ప్రభుత్వం గ్రామాల్లో అప్పటికే ఉన్న త్రాగునీటి పైప్‌లైన్‌లను పూర్తిగా తొలగించి, 1.35 లక్షల కి.మీ.ల కొత్త పైప్‌లైన్లు వేసింది. పైపుల కొనుగోళ్లలో కమీషన్ల కోసమే ఈ ప్రోగ్రాం చేపట్టారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 

మోసపోయిన దక్షిణ తెలంగాణ

కృష్ణా నది నీటిని ఆంధ్రా దోచుకుపోతున్నదని పోరాడి రాష్ట్రం సాధించుకున్నం. కానీ కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో ఏపీ దోపిడీ ఎక్కువైంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల కృష్ణా నీటిని వినియోగించుకోవడంలో విఫలమయ్యాం. కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 811 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 69 శాతం దక్కాలి. కేసీఆర్ అనాలోచితంగా చేసిన సంతకంతో 37 శాతం అంటే 299 టీఎంసీలు మాత్రమే పొందగలిగాం. ఏపీ 63 శాతం అంటే 512 టీఎంసీలు దక్కించుకుంది. మరోవైపు 299 టీఎంసీలను కూడా ఈ తొమ్మిదేండ్లలో ఏ సంవత్సరం పూర్తిగా వినియోగించుకోలేకపోయాం. అదే ఏపీలో నీటి వినియోగం కేటాయింపును మించి 647 టీఎంసీలుగా ఉంది. కృష్ణా జలాల వినియోగ సామర్థ్యం పెంచటంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దక్షిణ తెలంగాణ దారుణంగా మోసపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలిస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులోనూ వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ ప్రాజెక్టు నీటి లిఫ్టింగ్ సామర్థ్యాన్ని కూడా రెండు టీఎంసీల నుంచి ఒక టీఎంసీకి తగ్గించారు. ప్రాజెక్టులో 1, 2 పంపులను మాత్రమే పూర్తిచేసి ఉద్దండపూర్‌ రిజర్వాయర్‌ను నింపి ప్రజల్ని మురిపించి ఓట్లు దండుకునే ప్రయత్నం జరుగుతున్నది. నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ నివారణకు చేపట్టిన డిండి ప్రాజెక్టుది సైతం ఇదే పరిస్థితి. తుమ్మిళ్ల, గట్టు, తదితర ఎత్తిపోతల పథకాలు పూర్తిచేయడంపై కూడా శ్రద్ధ చూపలేదు. ఆర్డీఎస్‌ ను పూర్తిగా వినియోగానికి తేలేదు. కల్వకుర్తి ప్రాజెక్టు క్రింద ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకుండా చెరువులు, కుంటలు, ఇతర రిజర్వాయర్‌లకు నీటిని వదిలి.. నీళ్లు చూపిస్తూ జనాన్ని భ్రమల్లో ముంచుతున్నరు. ఎస్‌ఎల్‌ బీసీ టన్నెల్‌ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి.

కృష్ణా నీటి వినియోగంలో అసమర్థతకు కారణాలు

  • ఈ తొమ్మిదేండ్లలో ప్రభుత్వం నీటి వినియోగం పెంచే ప్రణాళికలు తయారుచేసి అమలు చేయకపోవడం. 
  • తెలంగాణ రాకముందు చేపట్టిన మూడు కల్వకుర్తి(40 టీఎంసీలు), ఎస్​ఎల్​బీసీ(40 టీఎంసీలు), నెట్టెంపాడు(25 టీఎంసీలు)- ప్రాజెక్టులు పూర్తి చేయడంలో, వినియోగించుకోవడంలో అసమర్థత.
  •  పాలమూరు–రంగారెడ్డి (90 టీఎంసీలు),  డిండి (30 టీఎంసీలు) ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనులు చేయకపోవడం.

కృష్ణాను మళ్లించుకుంటున్న ఏపీ

పోతిరెడ్డిపాడు, ఇతర ప్రాజెక్టుల ద్వారా కేటాయించిన నీటికి మించి బేసిన్‌ ఆవల ఉన్న రాయలసీమకు అక్రమంగా తరలించుకునే ప్రయత్నంలో ఉంది ఏపీ. రాయలసీమలో 364 టీఎంసీల స్టోరేజీతో పలు రిజర్వాయర్‌లను నిర్మించుకుంది. పోతిరెడ్డిపాడు విస్తరణ (14 గేట్ల నుండి 24 గేట్లకు 40 వేల నుండి 80 వేల క్యూసెక్‌లకు), రాయలసీమ లిఫ్ట్‌ (రోజుకు 3.0 టీఎంసీలు) ద్వారా రోజుకు 11.00 టీఎంసీల కృష్ణా జలాలను తరలించే ప్రణాళికలు వేగంగా అమలవుతున్నాయి. ఈ తొమ్మిదేండ్లలో మన రాష్ట్రంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న అన్ని  ప్రాజెక్టులు కలిపి కూడా రోజుకు ఒక్క టీఎంసీ మించి నీటిని తరలించే ఏర్పాట్లు చేసుకోలేదు. నీటి వినియోగంలో తెలంగాణ ఎంత వెనుకబడి ఉందో దీన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే దక్షిణ తెలంగాణ త్వరలోనే ఎడారిగా మారే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌ తాగునీటికి కూడా నీటి కొరత ఏర్పడే ముప్పు ఉంది.

నేతలకు వరంలా.. మిషన్‌ కాకతీయ

మిషన్‌ కాకతీయను కేసీఆర్ ప్రభుత్వం అద్భుత కార్యక్రమంగా వర్ణిస్తున్నది. వాస్తవానికి ఇది ప్రజాప్రతినిధులకు ఒక ధనార్జన ప్రోగ్రామ్‌గా పనికొచ్చింది. 2014 కు ముందే ఎపీఈఆర్‌పీ, ఆర్‌ఆర్‌ఆర్‌, జపాన్‌ నిధులు, నాబార్డ్‌ నిధులతో తెలంగాణలో అన్ని చెరువులు, కుంటలకు రిపేర్లు చేసి, పూడిక తీశారు. అయినప్పటికీ ప్రభుత్వం లెక్కలు, కొలతలు లేని పనులకు రూ.30 వేల కోట్ల వరకు ఖర్చు చేసింది. ఫలితం మాత్రం సున్నా. ఇవే నిధులతో కొత్తగా చెరువులు, మీడియం ప్రాజెక్టులు నిర్మిస్తే లక్షల ఎకరాలకు సాగు నీరు అందేది.
- దొంతుల లక్ష్మినారాయణ, 
కన్వీనర్, తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం