తలలు నరికినా ఉద్యమం ఆగదు
23న ఓయూలో బహిరంగ సభ
నేటి నుంచి జనంలోకి పోతాం
బంద్‌కు సహకరించిన
ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
నేడు అఖిలపక్ష భేటీ
కోర్టు ఆదేశాలనూ ప్రభుత్వం లెక్కచేయలేదు
మీడియాతో ఆర్టీసీ జేఏసీ
చైర్మన్ అశ్వత్థామరెడ్డి
హైదరాబాద్, వెలుగు: సమ్మెలో భాగంగా ఈ నెల 23న ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఉద్దేశపూర్వకంగానే న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు వేలు విరిచారని, వేళ్లు విరిచినా.. తలలు నరికినా ఉద్యమం ఆగదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్తామని, ఆహ్వానించాలని మాత్రం అడుక్కోమని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీని బతికించుకోవడానికి తలపెట్టిన బంద్ సంపూర్ణంగా జరిగిందని, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆదివారం నుంచి ప్లకార్డుల పట్టుకుని ప్రజల్లోకి వెళ్తామని, ప్రజల చేతికి పువ్వులు ఇచ్చి మద్దతు కోరుతామని వివరించారు. ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి, నిర్బంధిస్తున్నదని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో కూడా పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించలేదన్నారు. ఎంఐఎం మద్దతు సైతం కోరుతున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సమ్మె, కోర్టు ఆదేశాలు, బంద్, భవిష్యత్ కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని, మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలతో ఆదివారం ఉదయం 11.30 గంటలకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎంఐఎం మద్దతు కోరుతున్నామని, ఆ పార్టీ నేతలను కూడా కలుస్తామని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాన్ని దేశం మొత్తం ప్రశంస్తోందని చెప్పారు. చర్చల విషయంలో కోర్టు ఆదేశిలిచ్చినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి, ఆర్డర్స్ అందలేదని కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించడం పక్కనబెడితే, ముందు చర్చలు ప్రారంభించాలి కదా అని ప్రశ్నించారు.
బంద్ ప్రభుత్వానికి గుణపాఠం
‘‘బంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలి. ఓడిపోయామా.. గెలిచామా.. మెట్టుదిగామా.. మెట్టు ఎక్కామా.. అనేది సమస్య కాదు. ప్రభుత్వం తప్పులమీద తప్పులు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతోంది” అని అశ్వత్థామరెడ్డి అన్నారు. వీలైతే మరోసారి గవర్నర్‌ను కలుస్తామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాటాలు ఉంటాయన్నారు. రాష్ట్ర సర్కార్ తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, ఇది కార్మికుల పోరాటంకాదని, ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే ఉద్యమమని తెలిపారు. సకల జనుల సమ్మె తర్వాత ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలిపిన బంద్ ఇదేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్టీసీకి నష్టాలు పెరిగాయని అన్నారు. తమ వెంట ఎలాంటి బలమైన శక్తులు లేవని, కార్మికులే తమ శక్తి అని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాన్ని తెలుసుకోవాలని, తండ్రిలా సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యం కుప్పకూలితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని, అదే విషయాన్ని హైకోర్టు కూడా చెప్పిందని గుర్తుచేశారు. చర్చలకు పిలవకపోవడం వల్లే కేసీఆర్‌ను నైజాంతో పోల్చామన్నారు.
సమ్మె సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని, పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం పీఆర్వోగా ఉన్న ఓ వ్యక్తి ట్రేడ్ యూనియన్లను కించపరిచే విధంగా ఆర్టికల్స్ రాస్తున్నారని, వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బంద్ ఉహించిన దానికంటే బాగా జరిగిందని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. అన్ని వర్గాలు బంద్‌లో పాల్గొన్నాయని చెప్పారు. మరో కో కన్వీనర్ వీఎస్ రావు మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలన్నారు. గత ఆరు నెలల్లో 1300 కోట్ల నష్టం ఎందుకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

