రెండేండ్ల సర్వీస్​ ఉంటేనే ట్రాన్స్​ఫర్​

రెండేండ్ల సర్వీస్​ ఉంటేనే ట్రాన్స్​ఫర్​

హెచ్ఆర్ఏ ఆధారంగా మూడు కేటగిరీలుగా స్కూళ్లు 
ఒకే జిల్లాలో పనిచేస్తేనే స్పౌజ్ పాయింట్లు 
బదిలీలు, ప్రమోషన్లపై గైడ్​లైన్స్ విడుదల

హైదరాబాద్, వెలుగు : జీవో 317 బాధితుల గోడును సర్కారు పట్టించుకోలేదు.. టీచర్ల సంఘాల విజ్ఞప్తులనూ వినిపించుకోలేదు. సర్కారు అనుకున్నట్టే ఈ ఏడాది కూడా రెండేండ్ల సర్వీస్ ఉంటేనే ట్రాన్స్​ఫర్లకు అర్హులని తేల్చింది. ఫిబ్రవరి 1వ తేదీనాటికీ ఒకే స్కూల్​లో ఐదేండ్లు సర్వీస్ నిండిన హెడ్​మాస్టర్లు, 8 ఏండ్లు సర్వీస్ పూర్తయిన టీచర్లకు బదిలీలు తప్పనిసరి కానున్నది. దీంట్లో మూడేండ్లలోపు రిటైర్ అయ్యే వారుంటే, బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే ట్రాన్స్​ఫర్ ఆర్డర్లు పొందిన హెడ్ మాస్టర్లు, టీచర్లు ఈ విద్యాసంవత్సరం లాస్ట్ వర్కింగ్ డే మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ నుంచి రిలీవ్ కావాల్సి ఉంది. కాగా ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియకు సంబంధించిన గైడ్​లైన్స్ ను సర్కారు అనధికారికంగా బహిర్గతం చేసింది. ఈసారి కూడా మేనేజ్​మెంట్ల వారిగానే బదిలీలు, ప్రమోషన్లు జరగనున్నాయి. బదిలీలన్నీ వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరగనుండగా, ఎన్​సీసీ ఆఫీసర్లకు మాత్రమే మాన్యువల్​గా కౌన్సెలింగ్ ఉంటుంది. హెడ్​మాస్టర్లకు మల్టీజోన్ స్థాయిలో, ఇతర టీచర్లకు జిల్లాస్థాయిలో బదిలీలు, ప్రమోషన్లు ఉండనున్నాయి. 

ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్ల కోసం 12 జిల్లాలకు స్టేట్ అబ్జర్వర్లు

హైదరాబాద్, వెలుగు: టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు 12 జిల్లాలకు స్టేట్ అబ్జర్వర్లను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన నియమించారు. రెండ్రోజుల కింద జరిగిన డీఈవోల మీటింగ్​లో తమకు స్టేట్ నుంచి సహాయం అవసరమని కోరడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వికారాబాద్ జిల్లాకు ఉషారాణి(మోడల్ స్కూల్ డైరెక్టర్), గద్వాల, నారాయణపేట జిల్లాలకు  ఉషారాణి (ఐఏఎస్​ఈ ప్రిన్సిపల్), ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు  శ్రీనివాస్​చారి (టెక్ట్స్ బుక్ డైరెక్టర్), జగిత్యాలకు రాజీవ్ (ఎస్​ఎస్​ఏ జేడీ), మెదక్, కరీంనగర్​జిల్లాలకు క్రిష్ణారావు (ఎస్​ఎస్​సీ బోర్డు డైరెక్టర్), మహబూబాబాద్ జిల్లాకు ఎన్​ఎస్​ఎస్  ప్రసాద్ (మోడల్ స్కూల్ డీడీ), ములుగు, భూపాలపల్లి జిల్లాలకు మధన్​ మోహన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెంకటనర్సమ్మను నియమించారు.  

గైడ్​లైన్స్​లోని కొన్ని పాయింట్లు.. 

* హెచ్ఆర్ఏ 17శాతం, 13శాతం, 11శాతం కేటగిరీల ప్రకారం 1,2,3 కేటగిరీలుగా స్కూళ్లను మార్చారు. ఏటా వరు సగా 1,2,3  పాయింట్లు అలాట్ చేశారు. ఈసారి నాలుగో కేటగిరీ తొలగించారు.

* అదర్ డ్యూటీ (ఓడీ) ఉన్న టీచర్ల సంఘాలకు, గుర్తింపున్న టీచర్ల సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు పది అడిషనల్ పాయింట్లు ఉంటాయి.

* గర్ల్స్ స్కూళ్లలో 50 ఏండ్లలోపున్న టీచర్లకు బదిలీలు తప్పనిసరి. అయితే గర్ల్స్ స్కూళ్లలో మహిళలెవరూ లేని సందర్భంలో 50 ఏండ్లు నిండిన పురుష టీచర్లను అనుమతించనున్నారు.

* గతంలో ఉన్న ఎస్ఎస్ సీ ఫార్మార్మెన్స్ పాయింట్లు, సర్వీస్ పాయింట్లు తీసేశారు. 

* స్పౌజ్, పెండ్లికాని మహిళలకు పది అడిషనల్ పాయింట్లు ఉంటాయి. 8 ఏండ్లలో ఒకేసారి వీటిని వాడుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు స్పౌజ్ వర్తింపు 

* ప్రిఫరెన్షియల్ కేటగిరీ లో 70 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులు, వితంతువులు, విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తున్న మహిళలు, హెడ్మాస్టర్లు/టీచర్ల జీవిత భాగస్వామి (స్పౌజ్) క్యాన్సర్, బోన్ టీబీ, బైపాస్ సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, న్యూరో సర్జరీలతో పాటు కొత్తగా మస్క్యులర్ డిస్ట్రోఫీ, డయాలసిస్ కు అనుమతి.   

* జువెనైల్ డయాబెటిస్, మానసిక వైకల్యం, హృద్రోగం ఉన్న పిల్లల పేరెంట్స్ ను  ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉంటారు. ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరి వాడుకునే వారు 2023 జనవరి 1 తర్వాతి తేదీల్లో జిల్లా మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికెట్ పెట్టాలి. 

* టీచర్లు ఇద్దరుంటే స్పెషల్ కేటగిరీ పాయింట్స్ లేదా ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే వాడుకోవాలి.

* ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే స్పౌజ్ పాయింట్స్ వర్తిస్తాయి.