గ్రేడ్ 4 సెక్రటరీలుగా జేపీఎస్​లు.. జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం 

గ్రేడ్ 4 సెక్రటరీలుగా జేపీఎస్​లు..  జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం 
  • గ్రేడ్ 4 సెక్రటరీలుగా జేపీఎస్​లు
  • జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం 
  • కొత్తగా 3,551 పోస్టుల క్రియేట్
  • రెగ్యులర్ కు 6,616 మంది అర్హులుగా గుర్తింపు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీల(జేపీఎస్)​ను గ్రేడ్ 4 సెక్రటరీలుగా ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 6,603 పోస్టులను గ్రేడ్ 4  సెక్రటరీలుగా కన్ వర్ట్ చేశారు. అయితే ఈ నెల 30 నాటికి 6,616 మంది జేపీఎస్ లు ప్రభుత్వ రూల్స్ ప్రకారం రెగ్యులరైజ్​అయ్యేందుకు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 3,065 పోస్టులు ఖాళీగా ఉండగా, 3,551 పోస్టులను జేపీఎస్ నుంచి గ్రేడ్ 4 గా మారుస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్​లో కొత్తగా 6,603 సెక్రటరీల పోస్టులకు అనుమతి ఇస్తూ ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు మరో ఉత్తర్వు జారీ చేశారు. గత నెల 28నే ఈ జీవో ఇచ్చినప్పటికీ శనివారం వెలుగులోకి వచ్చింది. 

మిగతా వారి పరిస్థితి ఏంటి?

రాష్ట్రంలో మొత్తం 9,355 జేపీఎస్ పోస్టులను క్రియేట్ చేస్తూ 2018లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. 2019 ఏప్రిల్​లో విధుల్లో చేరారు. ఆఫీసర్ల వేధింపులు, పని ఒత్తిడి, ఆత్మహత్యలు, టార్గెట్లు, షోకాజ్ నోటీసులు తదితర చర్యల వల్ల సుమారు 2 వేల మంది జాబ్ లకు రిజైన్ చేశారు. అయితే సెక్రటరీ పోస్ట్ ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండొద్దని సీఎం ఆదేశించటంతో జిల్లా అధికారులు ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను విధుల్లోకి తీసుకున్నారు.

ఇప్పుడు ప్రభుత్వం 6,603 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటించటంతో ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను రెగ్యులర్ చేసేది లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో 4 ఏండ్ల సర్వీస్ పూర్తయిన మరో 1,500 జేపీఎస్​లను కూడా రెగ్యులర్ చేయనున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామాలు ఉండగా ఇప్పటికే 3 వేల మంది రెగ్యులర్ సెక్రటరీలు పనిచేస్తున్నారు. సుమారు 1,500 మంది ఔట్ సోర్సింగ్ వాళ్లు రెగ్యులరైజ్ కానీ లిస్ట్ లో ఉన్నారు.

మరోవైపు తమను గ్రేడ్ 4 సెక్రటరీలుగా రెగ్యులరైజ్ చేసినందుకు పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేశ్, విజయ్.. పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూధన్ రెడ్డి వేరువేరు ప్రకటనల్లో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.