మున్సి‘పోల్స్’ పై ప్రభుత్వం కోర్టుకు చెప్పిందొకటి.. చేసేదొకటి

మున్సి‘పోల్స్’ పై ప్రభుత్వం కోర్టుకు చెప్పిందొకటి.. చేసేదొకటి
  • 119 రోజుల గడువు కోరి.. 25 రోజుల్లోనే 90% ప్రక్రియ పూర్తి
  • ఫలితంగా వార్డుల విభజన, ఓటరు జాబితాల్లో తప్పులు
  • ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న ప్రతిపక్షాలు
  • 43 మున్సిపాలిటీల నుంచి హైకోర్టులో పిటిషన్లు
  • 5న విచారణకు అవకాశం
  • కోర్టు తీర్పు ఆధారంగా చర్యలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:

మున్సిపల్​ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు మొత్తం ఎన్నికల ప్రక్రియను సందిగ్ధంలో పడేశాయి. కేసు విచారణలో ప్రభుత్వం హైకోర్టుకు ఒకటి చెప్పడం.. బయట మరొకటి చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మొదటి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త మున్సిపాలిటీలతోపాటు పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌‌ఈసీ ) రెండుసార్లు లేఖ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్‌‌ఈసీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు తమకు 119 రోజుల గడువు కావాలని హైకోర్టును కోరిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు, వార్డుల విభజన, ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్‌‌ కేంద్రాల గుర్తింపు తదితర ప్రక్రియలను కేవలం25 రోజుల్లోనే పూర్తి చేసింది. ముందుగా సుమారు నాలుగు నెలలు సమయం కోరిన సర్కార్‌‌ నెల రోజుల్లోపే ఎన్నికలకు సంబంధించిన 90 శాతం పనిని పూర్తి చేయడంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటరు జాబితాలో, వార్డుల విభజనలో తప్పులు వెలుగు చూడటంతో హైకోర్టుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

వివాదాస్పదంగా మున్సిపల్‌‌ బిల్లు

వాస్తవానికి మున్సిపల్‌‌ ఎన్నికల విషయంలో మొదటి నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. లేఖలు రాసినా స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టుకు లాగింది. ఈ క్రమంలో ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మున్సిపల్‌‌ బిల్లులో ఏకంగా ఎన్నికల నిర్వహణ తేదీని తానే ప్రకటించేలా ప్రభుత్వం సవరణ చేయడం వివాదాస్పదమైంది. రాజ్యాంగంలోని 74, 75 సవరణ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను ప్రభుత్వం లాక్కోవడం ఏమిటని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. దీంతో ఎస్‌‌ఈసీ విధుల్లో ప్రభుత్వ జోక్యంపై గవర్నర్‌‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరికి ఆర్డినెన్స్‌‌గా తీసుకురావాల్సి వచ్చింది. ఆర్డినెన్స్‌‌ జారీ చేసి పది రోజులైనా ఇప్పటి వరకు పబ్లిక్‌‌ డొమైన్‌‌లోకి రాలేదు.

హైకోర్టులో 43 పిటిషన్లు

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి హైకోర్టులో పిటిషన్లు వెల్లువెత్తాయి. ఓటరు జాబితాల్లో తప్పులు, వార్డుల విభజనలో అవకతవకలపై ఆయా పట్టణాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కోర్టును ఆశ్రయించారు. వార్డుల విభజన అశాస్త్రీయంగా చేశారని, ఉదాహరణకు ఒకే మున్సిపాలిటీలోని ఒక వార్డులో 1200 మంది ఉంటే, మరో వార్డులో 1800 మంది ఉన్నారని, కొన్ని వార్డుల్లో వేలల్లో ఓటర్లను చూపి, మరికొన్ని వార్డుల్లో వందల్లోనే చూపారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఒకే కుటుంబలోని ఓటర్లు మూడు, నాలుగు వార్డుల పరిధిలోకి తీసుకొచ్చారని ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపును ఇంటింటి సర్వే చేయకుండా హడావుడిగా చేపట్టారని, జాబితాలో ఒక సామాజిక వర్గాన్ని మరో సామాజిక వర్గంగా చూపారని, అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా రిజర్వేషన్‌‌ వచ్చేలా చేసేందుకు కొన్ని వార్డుల్లోకి ఒకే సామాజికవర్గం ఓట్లు వచ్చేలా వార్డుల విభజించారనే అంశాలను పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ క్రమంలోనే కరీంనగర్, రామగుండం మున్సిపల్‌‌ కార్పొరేషన్లతోపాటు భైంసా, శంషాబాద్‌‌, మిర్యాలగూడ, చౌటుప్పల్, సూర్యాపేట, పరిగి, ఆదిభట్ల, తుక్కుగూడ, పోచారం, వికారాబాద్, కోరుట్ల, నర్సాపూర్‌‌, మంథని, నిర్మల్‌‌, ఆర్మూర్‌‌, బోధన్‌‌, గజ్వే-ల్‌‌– ప్రజ్ఞాపూర్‌‌తోపాటు హైదరాబాద్‌‌ నగర శివారులోని మీర్‌‌పేట, బడంగ్‌‌పేట, బండ్లగూడ జాగీర్‌‌, జవహర్‌‌నగర్‌‌ మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది.

ఈనెల 5న హైకోర్టు విచారణ ?

మున్సిపల్‌‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను ఈ నెల 5న హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రభుత్వం వాదనలు విన్నాక కోర్టు ఆదేశాలు వెలువరించనుంది. కోర్టు తీర్పు ఆధారంగా ఎన్నికల సంఘం అధికారులు ముందుకు వెళ్లనున్నారు. ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌‌ ఇస్తే.. ఈ నెలాఖరులోనే ఎన్నికలు పూర్తి కావొచ్చని, లేదంటే మరింత ఆలస్యం కావొచ్చని మున్సిపల్‌‌ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.