
సిద్దిపేట, వెలుగు: పడావుగా ఉన్న అసైన్డ్ భూములను సేకరించి రియల్ వెంచర్లుగా మార్చి ఆదాయం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపాల్టీల పరిధిలో ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్, భూదాన్ భూములను రియల్ వెంచర్లుగా డెవలప్ చేయాలని, లాండ్ ఓనర్లకు డెవలప్ చేసిన వెంచర్లో ఎకరానికి 600 గజాల చొప్పున కేటాయించాలని, తద్వారా వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనం కలిగించాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం మున్సిపాలిటీల్లో అసైన్, తదితర భూముల సేకరణకు వీలుగా జీఓ 234 జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో సుడా, గజ్వేల్ మున్సిపాలిటీ ఏరియాలో ఈ జీఓ అమలుకు రంగం సిద్ధం చేశారు.
సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా) పరిధిలోని పొన్నాలలో 45 ఎకరాలు, మిట్లపల్లిలో 20 ఎకరాలను గుర్తించారు. ఇవి సిద్దిపేట టౌన్‌కు దగ్గరగా ఉండడంవల్ల లేఅవుట్ చేస్తే భారీ లాభాలొస్తాయని భావిస్తున్నారు. పొన్నాలలో 617 సర్వే నెంబర్లో గుర్తించిన భూమికి సంబంధించి 45 మంది అసైనీలతో సుడా వైస్ చైర్మన్ రమణాచారి ఇటీవల మీటింగ్ పెట్టారు. మిట్లపల్లి అసైనీలతో కూడా త్వరలో సమావేశం నిర్వహించనున్నారు.
సిద్దిపేట చుట్టూ ఫస్ట్ ఫేజ్‌లో...
సుడా పరిధిలో నాలుగు మండలాలకు చెందిన 26 గ్రామాలున్నాయి. వీటిలో సిద్దిపేట అర్బన్ మండలంలో 10 , రూరల్ మండలంలో 8, చిన్నకోడూరు, కొండపాక మండలాల్లో నాలుగేసి గ్రామాలున్నాయి. సిద్దిపేట అర్బన్, కొండపాకల్లో భూములకు మంచి డిమాండ్ వుంది. ఈ గ్రామాల్లో ఒకేచోట15 నుంచి 20 ఎకరాల వరకు ఎక్కడ అసైన్డ్ భూములున్నాయో గుర్తించనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో 70 ఎకరాల్లో లేఅవుట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇది సక్సెస్ అయితే మిగిలిన ప్రాంతాలకు ఈ ప్లాన్‌ను విస్తరిస్తారు.
అసైనీల కొత్త డిమాండ్లు
ఎకరానికి 600 గజాల చొప్పున డెవలప్‌చేసిన ప్లాట్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదిస్తుండగా అసైనీలు తిరస్కరిస్తున్నారు. పొన్నాల అసైనీలు సుడా వైస్ చైర్మన్ రమణాచారితో జరిపిన మీటింగ్‌లో కొత్త డిమాండ్లు ముందుకు తెచ్చారు. 600 గజాల ప్లాటుతో పాటు.. రూ. 20లక్షల క్యాష్ ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అడుగుతున్నారు. భూముల విలువ దృష్ట్యా తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని అంటున్నారు. అసైనీలతో వారం రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించి.. తుది నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. డెవలప్ చేసిన తర్వాత అసైనీలకు ఇచ్చే 600 గజాల స్థలాన్ని వారికి రిజిస్ట్రేషన్ చేస్తారు.
దీంతో వారికి భూమి మీద సర్వ హక్కులు వస్తాయి. భూములను తిరిగి సేకరించే అంశంపై సర్కారు అసైనీలకు ఎలాంటి నోటీసులు ఇవ్వడంలేదు. పంచాయతీ సిబ్బందితో సమాచారం అందించి వారిని మీటింగ్‌కు పిలిచారు. సేకరించిన భూములను పూర్తిగా అభివృద్ది చేస్తారు. రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, పార్క్ లు,డ్రింకింగ్‌వాటర్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. ఒక ఎకరంలో రోడ్లు, ఉమ్మడి అవసరాలకు దాదాపు 2,000 గజాలు పోగా 600 గజాలు టాండ్ ఓనర్‌కు కేటాయించి మిగిలిన ప్లాట్లను ప్రభుత్వం ఓపెన్ యాక్షన్ ద్వారా అమ్ముతారు. పట్టణానికి దగ్గరలో చేసే వెంచర్ల డెవలప్‌మెంట్‌కోసం భారీగా ఖర్చు కావడం, లాండ్ ఓనర్ కు కూడా భూమి కేటాయించనుండడంతో లాభదాయకంగా ఉండే భూములను ఎంపిక చేయాలని భావిస్తున్నారు.
గజ్వేల్‌లో భూదాన్ భూములు..
గజ్వేల్ పరిధిలో భూదాన్ భూములను సైతం సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. ధర్మారెడ్డిపల్లి, సంగుపల్లి గ్రామ పంచాయతీల పరిధిలోని 790 నుంచి 810 సర్వే నెంబర్ల లో దాదాపు 180 ఎకరాల మేర భూదాన్ భూములున్నాయి. దాదాపు 50 ఏండ్ల కింద పేదలకు ఈ భూములను పంపిణీ చేయగా.. చాలా వరకు చేతులు మారాయి. ఈ నేపథ్యంలో భూములను వెనక్కి తీసుకోవాలని ఇటీవల అధికారులు నిర్ణయించి.. రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ భూముల్లో మోడ్రన్ లేఅవుట్ చేయాలన్న ప్రతిపాదన తేవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అసైనీలతో మాట్లాడుతున్నాం
మోడ్రన్ లే అవుట్ల కోసం పొన్నాల అసైనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి అవగాహన కల్పించి వారు అంగీకరిస్తేనే భూమిని సేకరించి అభివృద్ది చేస్తాం. భూయజమానికి 600 గజాల అభివృద్ది చేసిన ప్లాట్ కేటాయిస్తాం. మిగిలిన భూమిని ఓపెన్ యాక్షన్ లో అమ్ముతాం. - రమణాచారి, సుడా వైస్ చైర్మన్