రియల్ బూమ్ హామీలతో ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం

రియల్ బూమ్ హామీలతో  ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ప్రభుత్వం దూసుకుపోతున్నది. రెండేండ్లలోనే రెట్టింపు స్థాయిలో ఆమ్దానీ పొందింది. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు రాష్ట్ర సర్కార్ ఇష్టారీతిన రియల్ బూమ్ హామీలతో భారీగా ఖజానా నింపుకుంటున్నది.  డిసెంబర్ నుంచి మార్చి చివరి దాకా నెలకు యావరేజ్​గా రూ.1,400  కోట్ల చొప్పున టార్గెట్ పెట్టుకున్నది. అంటే నాలుగు నెలల్లో రూ.5,600  కోట్లు రాబట్టుకోన్నునది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 15వేల కోట్లు కేవలం రిజిస్ట్రేషన్స్​ అండ్ స్టాంప్స్ నుంచే సమకూర్చుకోనుంది. అంచనా వేసిన దానికంటే వంద, రెండొందల కోట్లు ఎక్కువే వచ్చేలా టార్గెట్లు పెట్టుకుని మరీ రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటూ పోతున్నది.  

గత ఆర్థిక సంవత్సరంలో రూ.12వేల కోట్లు

2019-20లో రిజిస్ట్రేషన్లు అండ్ స్టాంప్స్​తో ప్రభుత్వానికి రూ.7,061 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతినెలా యావరేజ్​గా  రూ.55 కోట్లు వచ్చింది. ఇప్పుడు నెలకు యావరేజ్ గా వంద కోట్లపైనే వస్తున్నది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12,372.73 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల క్రయవిక్రయాలు పెరిగాయి. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువలను రెండుసార్లు పెంచడంతో రిజిస్ట్రేషన్ల రాబడి భారీగా పెరిగింది. దీంతోనే ఆదాయం డబుల్ అయింది. మేడ్చల్ మల్కాజ్​గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, యదాద్రి భువనగిరి జిల్లాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తున్నది.