ఆర్టీసీ కార్మకులకు ఏరియర్స్ లేకుండానే పీఆర్సీ అమలు

ఆర్టీసీ కార్మకులకు ఏరియర్స్ లేకుండానే పీఆర్సీ అమలు

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికకు ముందు ఇచ్చిన హామీల అమలులో ఆర్టీసీ కార్మికులకు షాక్‌‌ ఇచ్చేందుకు సర్కార్‌‌ సిద్ధమైంది. పీఆర్సీ అమలుతో పాటు యూనియన్ల పునరుద్ధరణపై ఎన్నికలకు ముందు ఒకలా మాట్లాడిన ప్రభుత్వం, ఇప్పుడు అందుకు విరుద్ధంగా చర్యలకు రెడీ అవుతున్నది. కేవలం జీతం పెంపునకే పీఆర్సీని పరిమితం చేయనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో జీతాలు పెరగనున్నాయి. అయితే ఇప్పటికే 2017, 2021 పీఆర్సీలు మిస్సయిన ఉద్యోగులకు.. కేవలం ఒక్క పీఆర్సీతో ప్రభుత్వం సరిపెట్టనుంది. జీతాలు పెంచే ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి.. వారికి ఏరియర్స్ ఇచ్చే ఉద్దేశం లేదని తెలిసింది. దీంతో జీతం ఏ నెల నుంచి పెరిగితే.. ఆ నెల సాలరీ మాత్రమే జమ కానుంది.

డిమాండ్లపై మాటెత్తని సర్కార్​ పెద్దలు

ఆర్టీసీ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ, యూనియన్ల పునరుద్ధరణ, 5 పెండింగ్ డీఏల విడుదల, 2013 పీఆర్సీ 50శాతం బాండ్ బకాయిల చెల్లింపులు, సీసీఎస్ లోన్ల క్లియరెన్స్ లాంటి అనేక డిమాండ్లు చాలా రోజులుగా పెండింగ్​లో ఉన్నాయి. మునుగోడు ఎన్నికల టైంలో డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పిన సర్కార్ పెద్దలు.. ఇప్పుడు వాటి మాటెత్తడం లేదు. మునుగోడు బైపోల్ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావు, జగదీశ్ రెడ్డి కూడా కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు షరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ ఇచ్చేందుకు సీఎం ఆమోదం చెప్పారని బాజిరెడ్డి గోవర్ధన్​ ప్రకటించారు. దీంతో ఆర్టీసీ కార్మికులు ఖుషీ అయ్యారు. అయితే మునుగోడు ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం కేవలం జీతాల పెంపునకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందున కార్మికులకు పీఆర్సీ ఏరియర్స్ ఇచ్చే ఆలోచనలో లేనట్లు సమాచారం. 2013 పీఆర్సీకి సంబంధించి 50 శాతం బకాయి ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. 2020 నాటికే వారికి ఇచ్చిన బాండ్ల గడువు తీరిపోయింది. ఈ బకాయిలు కూడా ఇప్పట్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం లేదని సమాచారం.

ఇచ్చిన మాట నిలుపుకోవాలి

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం రెండు పీఆర్సీలు ఇవ్వాలి. 2017 పీఆర్సీకి ముందే మాకు 16 శాతం  ఐఆర్ ఉంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో సమానం కావాలంటే ఇంకా 33శాతం ఫిట్ మెంట్​తో పీఆర్సీ ప్రకటించి మొత్తం 49 శాతం ఇవ్వాలి. యూనియన్లను అనుమతించి సర్కారు మాట నిలబెట్టుకోవాలి.
- హనుమంతు ముదిరాజ్, టీజేఎంయూ స్టేట్ జనరల్ సెక్రటరీ