విశ్లేషణ: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలె

విశ్లేషణ: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలె

ఏండ్లు గడుస్తున్నా రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతి నిధులకు, మంత్రులకు ఉపాధ్యాయ సంఘాలు విడివిడిగా, జేఏసీగా ఏర్పడి వినతి పత్రాలు ఇచ్చాయి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. కానీ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా టీచర్ల ఇబ్బందులు, బడుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అన్ని డిపార్ట్​మెంట్లలో ప్రమోషన్లు ఇచ్చినప్పటికీ విద్యాశాఖలో ఉపాధ్యాయులకు గత ఆరు సంవత్సరాలుగా ప్రమోషన్లు ఇవ్వడం లేదు. దశాబ్ద కాలానికి పైగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల విద్యా వ్యవస్థను పర్యవేక్షించే అధికారులు లేక అస్తవ్యస్తంగా మారింది. ఏండ్ల నుంచి పదోన్నతులు లేని కారణంగా ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పర్యవేక్షణ అధికారుల పోస్టులు సుమారు 95 శాతం ఖాళీగానే ఉన్నాయి. పలు హైస్కూళ్లలో సబ్జెక్ట్​టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. టెన్త్​ క్లాస్​స్టూడెంట్లకు అన్ని సబ్జెక్టుల్లో టీచర్లు లేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కాబట్టి ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెచ్ఎంలు, ఎంఈవోలు, డిప్యూటీ డీఈవోలు, డైట్ లెక్చరర్లు అన్ని కేటగిరీల్లో పదోన్నతులు, సాధారణ బదిలీలు, అంతర్ జిల్లా బదిలీలు వెంటనే చేపట్టాలి.

సీపీఎస్​ విధానం రద్దు చేయాలె..
ఉద్యోగుల పాలిట గుదిబండలా మారిన నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్​ స్కీమ్​ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్ని కొనసాగించాలి. సీపీఎస్​విధానంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సీపీఎస్ రద్దుపై మీనమేషాలు లెక్కిస్తున్న వేళ రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి సీపీఎస్ ను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు.

టీచర్ల సమస్యలు తీర్చాలె..
317 జీవో ద్వారా స్థానికేతర జిల్లాకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాకు వచ్చే అవకాశం కల్పించాలి. అప్ గ్రేడ్ అయిన భాషా పండిట్స్, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ఆయా స్కూళ్లకు కేటాయించి అర్హులందరికీ పదోన్నతులు కల్పించాలి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న మహిళా టీచర్లకు ప్రభుత్వ టీచర్లకు వర్తించే అన్ని సెలవులు ఇవ్వాలి. బదిలీలకు వారికి అవకాశం కల్పించాలి. మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు సేవా నిబంధనలు అమలు చేయాలి. రాష్ట్రంలో బోధనేతర ఉదోగ్యులందరికీ వేసవిలో పని చేసినందున అదనంగా సంపాదిత సెలవులు మంజూరు చేస్తున్నారు. కానీ 2016 వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు నేటికి సంపాదిత సెలవులు మంజూరు చేయలేదు. ఇప్పటికైనా వాటిని ఇవ్వాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేసి, వారికి హెల్త్ కార్డులు జారీ చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత హెల్త్ కార్డ్ స్థానంలో ప్రీమియంతో కూడిన హెల్త్ కార్డు వర్తింపచేస్తూ మెరుగైన వైద్య సౌకర్యం అందించాల్సిన అవసరం ఉంది. మహిళా టీచర్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లే రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలి. జీవో 342 ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నత చదువులకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతించాలి. ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా అవకాశం కల్పించే జీవోను పునరుద్ధరించి పదోన్నతులు ఇవ్వాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా నిబంధనలు రూపొందించి అమలు చేయాలి. గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖల్లో పని చేస్తున్న టీచర్ల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న టీచర్లను రెగ్యులరైజ్​చేయాలి. వేతన సవరణ ఎరియర్స్ అన్నింటిని ప్రభుత్వం వెంటనే నగదు రూపంలో చెల్లించాలి.

– పిన్నింటి బాలాజీరావు
జడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా