తెలంగాణ కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది

తెలంగాణ కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది

శారీరక ఇబ్బందుల్లో ఉన్న వికలాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం బాగా కృషి చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.  స్టేడియంలో ఏర్పాటుచేసిన దివ్యాంగుల ఉపకరణాల స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి వికలాంగులు, వయోవృద్దులు భారీ సంఖ్యలో వచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వికలాంగుల సంక్షేమంలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. ఇది ఆత్మకు సంతృప్తినిచ్చే కార్యక్రమం. దివ్యాంగులకు అధునాతన పరికరాలు అందిస్తున్నాం. చదువుకునే దివ్యాంగ విద్యార్థుల కోసం 300 ల్యాప్‌టాప్స్, 400 స్మార్ట్‌ఫోన్స్ అందిస్తున్నాం. శారీరక శ్రమ లేకుండా ఉండేందుకు ద్విచక్ర వాహనాలు 1000, బ్యాటరీ వీల్ ఛైర్స్ 650 అందిస్తున్నాం. రూ. 24 కోట్ల 34 లక్షలతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్స్‌లో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాం. దివ్యాంగుల సంక్షేమం కోసం తెలంగాణ కృషి చేస్తోందని భారత ప్రభుత్వం గుర్తించింది. దివ్యాంగుల కృత్రిమ పరికరాల తయారీ పార్క్ కోసం కృషి చేస్తాం. ఈ పరికరాల తయారీతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ వికలాంగుల పింఛన్ పెంచారు: మహమూద్ అలీ

వికలాంగుల పింఛన్‌ను సీఎం కేసీఆర్ 500 నుంచి 3000 పెంచారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి ఆయన ట్రైసైకిల్స్‌ను దివ్యాంగులకు పంపిణీ చేశారు. దివ్యాంగులకు పంపిణీ చేసిన వాటిలో క్రికెట్ వీల్ చైర్స్, ల్యాప్‌టాప్స్, 4జీ స్మార్ట్ మొబైల్స్, ద్విచక్ర వాహనాలు, వినికిడి యంత్రాలు, హ్యాండ్ స్టిక్స్, ట్రై సైకిల్స్, బ్యాట్రీ వీల్ చైర్స్, బ్రెయిలీ బుక్స్ మొదలైనవి పంపిణీ చేశారు.