సర్కార్​ బడుల్లో టీసీలు లేకున్నా అడ్మిషన్లు!

సర్కార్​ బడుల్లో టీసీలు లేకున్నా అడ్మిషన్లు!
  • ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రపోజల్
  • త్వరలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం
  • ఆమోదిస్తే ప్రైవేట్ దోపిడీకి చెక్

హైదరాబాద్, వెలుగురాష్ర్టంలోని సర్కార్ స్కూళ్లలో టీసీ (ట్రాన్స్​ఫర్ సర్టిఫికెట్) లేకుండానే అడ్మిషన్లు ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రపోజల్ ను ప్రభుత్వానికి పంపించింది. సర్కార్ ఆమోదం తెలిపితే ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో చేరే స్టూడెంట్ల సంఖ్య పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇలా టీసీలు లేకుండానే అడ్మిషన్లు కల్పిస్తే ప్రైవేట్ స్కూళ్ల దోపిడీనీ అడ్డుకోవచ్చని అంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు టీసీ లేకుండానే స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వాలి. కానీ చాలా బడుల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు. ప్రస్తుతం కరోనా కారణంగా బడులు ఇంకా ప్రారంభం కాలేదు. సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వం డిజిటల్ పాఠాలు ప్రారంభించింది. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నాయి. ఈ క్రమంలో పేరెంట్స్ నుంచి వంద శాతం ట్యూషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫీజులు కట్టే స్థోమత లేని పేరెంట్స్ తమ పిల్లలకు దూరదర్శన్, టీశాట్ లో వచ్చే పాఠాలను వినిపిస్తున్నారు. పిల్లలను సర్కారు బడుల్లోకి మార్చాలని భావిస్తున్నారు. ఇందుకోసం టీసీలు కావాలని ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లను కోరితే ఫీజు మొత్తం కడితేనే ఇస్తామని చెబుతున్నాయి. దీంతో కొందరు పేరెంట్స్ స్కూల్ ఎడ్యుకేషన్​ఉన్నతాధికారులను ఆశ్రయించారు.

10వ తరగతి వరకూ…

దీనిపై దృష్టిసారించిన అధికారులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ టీసీ లేకుండానే అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. ప్రస్తుతం ధరణి, రిజిస్ర్టేషన్ల ప్రక్రియలో ప్రభుత్వం బిజీగా ఉండడంతో పట్టించుకోలేదని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే చాన్స్‌ ఉందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. టీసీలు లేకుండానే అడ్మిషన్లు కల్పిస్తే కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లను కట్టడి చేయడం ఈజీ అవుతుందన్నారు. ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ల నుంచి లక్ష మంది వరకు గవర్నమెంట్ స్కూళ్లలో చేరారు. ఒకవేళ తమ ప్రపోజల్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపితే రెండు నుంచి మూడు లక్షల వరకు అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విద్యాహక్కు చట్టంలో ఉన్న మేరకు 8వ తరగతి వరకు టీసీల్లేకుండానే అడ్మిషన్లు ఇవ్వాలనే నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయించాయి