మున్సిపోల్స్ అక్టోబర్​లో!

మున్సిపోల్స్ అక్టోబర్​లో!
  • దసరా తర్వాతే నిర్వహణకు సర్కారు ఆలోచన
  • ముందు 109 రోజుల టైం కోరి.. ఆ వెంటనే హడావుడి చేసి.. ఇప్పుడు వెనుకడుగు
  • ఆర్టికల్‌ 370 రద్దుతో బీజేపీ బలం పెరిగిందని టీఆర్ఎస్ అనుమానం
  • అందుకే ఎన్నికలకు టైం తీసుకోవాలని యోచన

మున్సిపల్‌ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. త్వరగానే ఎలక్షన్లు ముగించాలని మొదట్లో అనుకున్న ప్రభుత్వం తన ఆలోచనను పక్కన పెట్టింది. కోర్టు కేసులు తేలాకే ఎన్నికలకు వెళ్తామని బయటికి చెప్తున్నా.. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరిగిందన్న అనుమానంతోనే ఇప్పుడు వెనుకంజ వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో అధికారుల తీరులో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. అక్టోబర్​లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌, వెలుగు:

మున్సిపల్‌ ఎన్నికలు హడావుడిగా ముగించాలనుకున్న ప్రభుత్వం తన ఆలోచనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. కోర్టు కేసులు తేలాకే ఎన్నికలకు వెళ్తామని బయటికి చెప్తున్నా.. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలం పెరిగిందన్న అనుమానంతోనే ఇప్పుడు వెనుకంజ వేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు సైతం కొంత టైం తీసుకోనున్నట్టు చెప్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకే అధికారుల మాట తీరులో మార్పు వచ్చినట్టు కూడా ప్రచారం నడుస్తోంది. అక్టోబర్​లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టైం కోరి..హడావుడి చేసి.. ఇప్పుడేమో..?

మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుమారు నెలన్నర క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ స్పందిస్తూ.. ఎన్నికల నిర్వహణకు 109 రోజుల టైం కావాలని  కౌంటర్‌ దాఖలు చేసింది. కోర్టు కూడా అనుమతిచ్చింది. అయితే.. ఆ వెంటనే అధికార పార్టీ టీఆర్ఎస్​ వైఖరిలో మార్పు వచ్చింది. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జులై నెలాఖరులోగా మున్సిపల్‌ ఎన్నికలు పూర్తి చేస్తామని టీఆర్​ఎస్​ అధినేత,  సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని కేడర్​ను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో మున్సిపల్‌ శాఖ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగం చేసింది. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలో తప్పులు, వార్డుల విభజన ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 109 రోజుల గడువు కోరి వారం పదిరోజుల్లోనే ప్రీపోల్​ ప్రక్రియను ముగించడం వెనుక మతలబేందని కొందరు హైకోర్టుకు వెళ్లారు. 56 మున్సిపాలిటీల నుంచి 1,373  ఫిర్యాదులు రాగా వాటిలో 665 కంప్లైట్లను పరిష్కరించామని, 708 ఫిర్యాదులను తిరస్కరించామని మున్సిపల్‌ అధికారులు కోర్టుకు నివేదించారు. అన్ని కంప్లయింట్లను ఎలా రిజెక్ట్‌ చేస్తారని కోర్టు ప్రశ్నించగా.. తమ ఓట్లు ఫలానా వార్డులో కాకుండా మరో వార్డులో వచ్చాయని, ఆ వార్డులోనే కొనసాగించాలంటూ వారు ఫిర్యాదు చేశారని, అందుకే తిరస్కరించామని కోర్టుకు అధికారులు వివరించారు. ఆ వివరణతో కోర్టు సంతృప్తి చెందలేదు. కొత్త మున్సిపల్‌ ఆర్డినెనన్స్‌ను తెచ్చి, పాత చట్టం ప్రకారం వార్డుల పునర్విభజన ఎలా చేస్తారని ప్రశ్నించింది. వార్డుల రిజర్వేషన్లకు కొత్త చట్టం, విభజనకు పాత చట్టం ఉపయోగించడం.. ఒకే ఎన్నికలో రెండు చట్టాల ప్రకారం నడుచుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 119 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఏ ఫిర్యాదులు లేని 69 చోట్ల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపింది.

దసరా అయ్యాకే..

కోర్టులో విచారణ కొనసాగుతున్న కొద్దీ కేసు మరింత జటిలమవుతోంది. మున్సిపల్‌ అధికారులు దాఖలు చేసిన కౌంటర్‌తో సంతృప్తి చెందని హైకోర్టు పూర్తి వివరాలతో తిరిగి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం బుధవారం దాఖలు చేసిన కౌంటర్‌పై ఈనెల 28న వాదనలు వింటామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఈనెలాఖరు వరకు కోర్టు విచారణ కొలిక్కి వచ్చే అవకాశం లేదు. సెప్టెంబర్‌ నెల ఆగితే కోర్టుకు గతంలో నివేదించిన గడువు దగ్గర పడుతుంది. దసరా పండుగ తర్వాత ఎన్నికలకు వెళ్తే ఏ ఇబ్బంది ఉండబోదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్పటివరకు 370 ఆర్టికల్‌ రద్దు ప్రభావం తగ్గిపోతుందని అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్​లో దశాబ్దాలుగా కొనసాగుతున్న 370 ఆర్టికల్​ను కేంద్రం ఇటీవల రద్దు చేయడంతో బీజేపీకి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోనూ ఫాలోయింగ్​ పెరిగినట్లు టీఆర్​ఎస్​ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆ ఎఫెక్ట్​ వల్ల ఇప్పటికిప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తే..   బీజేపీకి లాభం చేకూరొచ్చని భావిస్తున్నాయి. దీంతో అక్టోబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తే  ఆర్టికల్​ 370 రద్దు ఎఫెక్ట్​ పెద్దగా ఉండదని, ఇది తమకు కలిసి వస్తుందని టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే దసరా తర్వాతే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టు సమాచారం.