స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తరు?..రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం చర్చించి చెప్పాలి: హైకోర్టు

స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తరు?..రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం చర్చించి చెప్పాలి: హైకోర్టు
  • ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై రిట్ పిటిషన్ 
  • విచారణ నవంబర్ 3కు వాయిదా 

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్‌ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వగా, దానిపై ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు కొట్టివేసింది.  

ఈ నేపథ్యంలో ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు కోరింది. అయితే, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలు సమర్పించడానికి గడువు కావాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం కోరడంతో తదుపరి విచారణను నవంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. 

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సస్పెండ్‌‌ చేస్తూ ఈ నెల 9న ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌‌ను సవాల్ చేస్తూ అడ్వకేట్ ఆర్‌‌.సురేందర్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జి.ఎం. మొహియుద్దీన్‌‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. 

పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. బీసీలకు 42% రిజర్వేషన్‌‌లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై మాత్రమే హైకోర్టు స్టే మంజూరు చేసిందని, ఎన్నికల ప్రక్రియను మాత్రం కొనసాగించవచ్చని పేర్కొందన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిందని, బీసీలకు కేటాయించిన అదనపు సీట్లను ఓపెన్‌‌ కేటగిరీకి కేటాయించి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌‌ అడ్వకేట్ జి.విద్యాసాగర్‌‌ వాదిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌‌ఎల్‌‌పీని సుప్రీంకోర్టు కొట్టివేసిన వెంటనే ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసిందన్నారు. 

బీసీలకు 42% రిజర్వేషన్‌‌ల అమలుపై స్టే ఉన్నందున ఎన్నికలు నిర్వహించాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌‌లలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహించాల్సి ఉందన్నారు. అందుకే ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. దీంతో విచారణను బెంచ్ వచ్చే నెలకు వాయిదా వేసింది.