రాష్ట్ర సర్కార్​కు గవర్నర్​ షాక్​

రాష్ట్ర సర్కార్​కు గవర్నర్​ షాక్​

బడ్జెట్​కు ఆమోదంపై ఇంకా నిర్ణయం తీసుకోని తమిళిసై
3 నుంచి అసెంబ్లీ సమావేశాలు
జాయింట్​ సెషన్​ ఎందుకు పెడ్తలేరని ప్రశ్నించిన గవర్నర్​
నేడు హైకోర్టులో పిటిషన్​ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్  షాక్ ఇచ్చారు. వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్​కు  ఎట్లా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాసినట్లు రాజ్​భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్​ను ఎందుకు నిర్వహించడం లేదని ఆమె ప్రశ్నించారు. సమావేశాలకు టైమ్​దగ్గరపడుతుండటం, బడ్జెట్​కు గవర్నర్​ ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేసి బడ్జెట్​కు గవర్నర్ ఆమోదం తెలిపేలా ఆదేశించాలని కోరనుంది. ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.

మొదటి రోజే బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. అసెంబ్లీని ప్రొరోగ్ చేయనందున ఈ సెషన్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఏర్పాటు చేయడం లేదంటూ ఈ నెల 21న గవర్నర్ కు ప్రభుత్వం నుంచి బడ్జెట్​ ఫైల్​ను పంపారు. నిరుడు కూడా ఇదే తరహాలో గవర్నర్ స్పీచ్​ లేకుండానే  ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు పెడితే ప్రజలకు ఇబ్బంది తలెత్తకూడదనే ఉద్దేశంతో గవర్నర్ అప్పుడు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన స్పీచ్​ లేకుండా చేయడంతో గవర్నర్​ బాహాటంగానే తప్పుబట్టారు. రెండేండ్లుగా తనకు ప్రభుత్వం ప్రొటోకాల్ ఇవ్వడం లేదని, రిపబ్లిక్ డే వేడుకలను కూడా పరేడ్ తో నిర్వహించలేదని ఎట్ హోం సందర్భంగా గవర్నర్​ ప్రస్తావించారు. ప్రస్తుతం బడ్జెట్​కు ఆమోదంపై గవర్నర్​ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఆదివారమే ఈ పిటిషన్ డ్రాఫ్ట్ కు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్​ దుష్యంత్ దవే వాదనలు వినిపించే అవకాశం ఉంది. ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయిస్తే.. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది.