సాయుధ పోరాటాన్ని గవర్నర్ వక్రీకరిస్తున్నరు .. RSS‌‌‌ మనిషిలా మాట్లాడటం సరికాదు: సీపీఐ నారాయణ

సాయుధ పోరాటాన్ని గవర్నర్ వక్రీకరిస్తున్నరు .. RSS‌‌‌ మనిషిలా మాట్లాడటం సరికాదు: సీపీఐ నారాయణ

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ వక్రీకరిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ విమర్శించారు. తెలంగాణ సాయుధ వారోత్సవాల నేపథ్యంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను విముక్తి చేసిన ఉద్యమంపై గవర్నర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ అజెండాను మోయడమే అవుతుందన్నారు. 

సోమవారం (సెప్టెంబర్ 15) ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ– ఆర్ఎస్ఎస్ నేతలకు తెలంగాణ సాయుధ పోరాటంపై మాట్లాడే అర్హత లేదన్నారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ వారికి ఇసుమంత పాత్ర లేదని గుర్తుచేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిలో తమ వారు లేకపోవడంతో తమకు సంబంధం లేని వారి త్యాగాలను వాడుకుంటున్నారని విమర్శించారు. 

శవాలను కూడా అద్దెకు తీసుకొని రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్‌‌‌‌ను నిషేధించిన సర్దార్‌‌‌‌‌‌‌‌ వల్లభాయ్‌‌‌‌ పటేల్ పేరుతో రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. నిజాంకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. 4 వేల మంది కమ్యూనిస్టుల త్యాగాలు, పది లక్షల ఎకరాల భూమి పంపకం తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమైందని గుర్తుచేశారు. ఇవన్నీ మరిచి గవర్నర్ ఆర్ఎస్ఎస్ సంస్థకు చెప్రాశిలాగా మాట్లాడడం సరికాదన్నారు. 

తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు సహా దేశంలో ఉన్న పలు రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ మూలాలకు చెందిన వారేనన్నారు. వారంతా కేంద్రానికి తోత్తులుగా మారి, రాష్ట్రాల్లో సమాంతర పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేపట్టిన అస్సాం, మణిపూర్ పర్యటనల్లో నిజాయితీ లేదన్నారు. నిర్మాణమై, ఉపయోగంలో ఉన్న పాత భవనాలను మళ్లీ ప్రారంభించి మణిపూర్ పర్యటనను మోసపూరితంగా చేపట్టారని మండిపడ్డారు. వక్ఫ్ (సవరణ) చట్టంలోని అనేక కీలక నిబంధనలను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు.